- ఉత్తరాఖండ్ రాజకీయాల్లో పెనుమార్పులు
- అసమ్మతి నేతల ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ అధిష్ఠానం
- త్రివేంద్ర సింగ్ రావత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి
దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా బీజేపీ ఆఘమేఘాలమీద ముఖ్యమంత్రిని మార్చివేసింది. అసమ్మతి నేతల ఒత్తిడితో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పలువురు ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి.
వేగంగా కొత్త సీఎం ఎంపిక :
ఉత్తరాఖండ్ లో అసమ్మతి సెగతో సీఎం పీఠాన్ని వీడిన త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సీఎం రేసులో ధన్ సింగ్ రావత్, కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పేర్లు వినిపించినా నూతన సారథిగా తీరథ్ సింగ్ రావత్ పేరును బీజేపీ ప్రకటించింది. డెహ్రాడూన్ లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష నేతలు ఈ రోజు భేటీ అయి తీరథ్ ను ఎన్నుకోనున్నారు. అయితే దీనికి ముందు కొన్ని ప్రముఖుల పేర్లు వినిపించినా ఎవరూ ఊహించని విధంగా తీరథ్ వైపు మొగ్గు చూపింది. తీరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని గఢ్వాల్ ఎంపీగా ఉన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ రోజు సాయంత్రం కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు త్రివేంద్ర సింగ్ రావత్ పనితీరు ఆశించినంతగా లేదని బాధితులను సకాలంలో ఆదుకోలేకపోయారని అసమ్మతి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
ఉత్తరఖండ్ రాజకీయాల్లో తీరథ్:
తీరథ్ సింగ్ రావత్ 2012లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2013లో ఉత్తరాఖండ్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2015 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సమయంలో తీరథ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
ఇదీ చదవండి:ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా