మరి కొన్ని రోజుల్లోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు ఎలా ఉండబోతాయో అనే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు విస్తృతంగా సాగుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ నివేదికలను ప్రకటించాయి. తాజాగా టైమ్స్ నౌ- సీ ఓటర్ సంస్థ కూడా సర్వే ఫలితాలను విడుదల చేసింది. సర్వే నివేదికలు, పరిశీలకుల అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు చాలా వరకూ ఒకే విధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో తక్కువ మెజారిటీతోనైనా మళ్ళీ మమతా బెనర్జీయే అధికారంలోకి వస్తారని నివేదికలు చెబుతున్నాయి. కేరళలో కూడా ఇప్పుడున్న ఎల్ డి ఎఫ్ కూటమిదే మళ్ళీ విజయమని అంటున్నాయి.
అసోంలోనూ ప్రస్తుత అధికారంలో ఉన్న బిజెపి కూటమికే మరో అవకాశం దక్కుతుందని నివేదికల అంచనా. తమిళనాడులో డి ఎం కె-కాంగ్రెస్ కూటమి మంచి మెజారిటీతో ఈసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. పుదుచ్చేరిలో బిజెపి/ఎన్ డి ఎ కూటమికి అధికారం దక్కుతుందని సర్వేలు వివరిస్తున్నాయి. మొత్తంమీద, ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల మళ్ళీ పాత ప్రభుత్వాలకే పట్టం కడతారని, తమిళ రాష్ట్రాల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాయని సర్వే నిర్వహించిన సంస్థలు విశ్లేషిస్తున్నాయి. టైమ్స్ నౌ -సీ ఓటర్ వెల్లడించిన ఫలితాలు ఆసక్తిగా ఉన్నా, వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని చెప్పవచ్చు.
Also Read : ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా
పశ్చిమ బెంగాల్ లో మళ్ళీ మమత
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి అధికారాన్ని దూరం చేయాలని బిజెపి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఆమెను ఒంటరిని చేయడానికి యత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. సాధారణ వాతావరణంలో అయితే, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. గెలుపు పట్ల ధీమాగా ఉండవచ్చు. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలు కొంప ముంచాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధిపత్యం ఎక్కువై పోయిందనే నెపంతో సువేందు అధికారి వంటి అత్యంత ఆత్మీయ అగ్ర నేతలు పార్టీని వీడి బిజెపిలో చేరారు. పార్టీలోని చాలామంది నేతలపై అవినీతి ఆరోపణలు కూడా బాగా వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలకు బిజెపి మొదటి నుంచీ ఎరవేస్తూనే వుంది. మమతా బెనర్జీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. సహజంగానే ప్రజల నుంచి ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 3 సీట్లే వచ్చినా, 2019లో లోక్ సభ ఎన్నికల్లో ఊహాతీతంగా 18 స్థానాలు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పశ్చిమ బెంగాల్ లో ఉన్న మొత్తం 42 స్థానాల్లో దాదాపు సగం వాటా దక్కించుకుంది. దీనితో, బిజెపికి ఆత్మవిశ్వాసం వెయ్యి రెట్లు పెరిగింది.
Also Read : అన్నాడీఎంకే కూటమిలో చిచ్చు
అప్పటి నుంచి, ఇక్కడ అధికారాన్ని చేపట్టాలనే కోరిక బలంగా పెరిగింది. ఈ ఆలోచనతో బిజెపి దీదీని ఢీకొట్టడానికి సిద్ధమయ్యింది. మమతా ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. ఈ అంశం చాలా ఆసక్తిగా మారింది. బిజెపి తరపున నిలబడుతున్న సువేందు అధికారికి చెక్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నందిగ్రామ్ చాలా కీలకమైన ప్రాంతం. దాదాపు నాలుగు దశాబ్దాల వామపక్ష పాలనకు నందిగ్రామ్ అంశంతోనే తృణమూల్ కాంగ్రెస్ చరమగీతం పాడింది. దీనికి తోడు, బెంగాలీలే ఆ రాష్ట్రాన్ని పరిపాలించాలనే సెంటిమెంట్ ను కూడా బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. నిజానికి, గతంలో తృణమూల్ గెలుపులో సువేందు పాత్ర చాలా పెద్దది. ఇప్పుడు అటువంటి వ్యక్తితోనే దీదీ తలపడుతున్నారు. దీన్ని మమత వేసిన మాస్టర్ స్ట్రోక్ (పెద్ద ఎత్తుగడ) గా రాజకీయ క్షేత్రాల్లో చర్చించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను మోదీ (దాదా) వెర్సెస్ దీదీ గానూ అభివర్ణిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాల ప్రకారం స్వల్ప ఆధిక్యంతోనైనా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : మిథున్ చక్రవర్తి వల్ల బీజేపీకి ఏమి ప్రయోజనం?
కేరళలో ఎల్ డీఎఫ్ వైపు మొగ్గు
కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార ఎల్ డీ ఎఫ్ కే ఎక్కువ స్థానాలు వచ్చాయి. 2016 ఎన్నికల్లోనూ ఇదే విధంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏ కూటమికి ఆధిక్యం వస్తే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు వారినే వరిస్తుందనే సూత్రం ప్రకారం ఎల్ డీ ఎఫ్ కు మళ్ళీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మామూలుగా, ఒకసారి ఎల్ డీ ఎఫ్, ఇంకోసారి యూడీ ఎఫ్ కు ప్రజలు పట్టంకట్టే సంప్రదాయం అక్కడ ఉంది. ఈసారి అదే ఫలించే అంశంలో స్పష్టత రావడం లేదు.
యూ డీ ఎఫ్ కు గతంలో కంటే సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ ఇంతవరకూ తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించ లేదు. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి మిగిలిన నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి. కూటమి ఫలితాలకు ఈ విభేదాలే గండికొడతాయని పరిశీలకులు భావిస్తున్నారు. కేరళపై క్షేత్రస్థాయి అభిప్రాయాల్లో ఇంకా స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతానికి, పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఉన్న ఎల్ డీ ఎఫ్ కూటమికే మళ్ళీ విజయావకాశాలు కాస్త కనిపిస్తున్నాయి. అసోంలో ఎన్ డీ ఎ -యూ పి ఎ కూటమి మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంది. ఈసారి మళ్ళీ ఎన్ డీ ఎ కూటమి అధికారంలోకి వచ్చినా, మెజారిటీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూపిఎ కూటమికి ముఖ్యమంత్రి పీఠం దక్కకపోయినా గెలిచే స్థానాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వెయ్యవచ్చు.
Also Read : మిథున్ చక్రవర్తి జనాకర్షణ బీజేపీకి లాభిస్తుందా?
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ విజయావకాశాలు
తమిళనాడులో ప్రస్తుతం ఎఐఎడిఎంకె -బిజెపి కూటమికి ఎదురుగాలే వీస్తోందని చెప్పాలి. దీనికి కారణం బిజెపికి అక్కడ వున్న బలం మొదటి నుంచీ తక్కువే. దానికి తోడు గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా సంపాదించుకోలేక పోయింది. అధికారంలో వున్న ఎఐఎడిఎంకె అగ్రనేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వంకు ఉన్న ప్రజాకర్షణ అంతంత మాత్రమే. జయలలిత మరణంతోనే అన్నా డిఎంకె వెలుగు వెళ్లిపోయింది. ఈ ఇద్దరు నాయకులతో పోల్చుకుంటే శశికళకు ఉన్న ఆకర్షణ ఎక్కువే. ప్రస్తుతం, ఆమెపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంది. ప్రస్తుతం ఆమె రాజకీయ అస్త్ర సన్యాసం చేసినా, పళని స్వామి బృందం ఓడిపోవాలనే ఆమె కోరుకుంటారు.
ఎఐఎడిఎంకె పగ్గాలు ఎప్పటికైనా తన చేతికే రావాలనే వ్యూహంలో ఆమె వుంది. బిజెపి పెద్దల రాయబారంతో వారిపై – పైకి అనుకూలత ప్రకటించినా,ఆ కూటమి గెలుపునకు ఆమె సహకరిస్తారన్నది అనుమానమే. డి ఎం కె అధికారానికి దూరమై చాలాకాలమైంది. కరుణానిధి వారసుడు స్టాలిన్ అందుబాటులోనే ఉన్నారు. బరిలో నిలబడ్డారు. కమల్ హసన్ పార్టీ మద్దతు కూడా డిఎంకెకే ఉంటుందని భావించవచ్చు. తమిళనాడు రాజకీయాలు ఎన్నో ఏళ్ళుగా ద్రావిడ సిద్ధాంతాల చుట్టూనే తిరుగుతున్నాయి. బిజెపిని ఆర్య సిద్ధాంతవాదిగానే తమిళులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడులో డిఎంకె -కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి, స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి.
Also Read : తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు
పుదుచ్ఛేరిలో పులిజూదం
పుదుచ్చేరిని అందరూ కలిసి రచ్చ రచ్చ చేశారు. ఈ రచ్చ ఎన్ డీ ఎ కూటమికి అనుకూలంగా మారనుంది. ఇది చాలా చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఉన్నదే 30 అసెంబ్లీ స్థానాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ – డిఎంకె కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి అసమర్ధత వల్ల, అధికారాన్ని చివర వరకూ నిలబెట్టుకోలేక పోయారు. బిజెపి బలానికి, వ్యూహానికి కూటమి ఖంగు తిన్నది. నారాయణస్వామిని కుట్ర చేసి, దించేశారనే సెంటిమెంట్ కూడా ప్రజల్లో లేకపోలేదు. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. తమిళసైకి ,లెప్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఈమె బిజెపి తరపున ఎన్నికల్లో చక్రం తిప్పే అవకాశం ఉంది. వీటన్నిటి ప్రభావంతో కాంగ్రెస్ కూటమి గెలుపు కాస్త కష్టంగానే ఉంది. పుదుచ్చేరిలో బిజెపి కూటమి పాగా వేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం ఐదు రాష్ట్రాలకే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, భావి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, ఎన్ డి ఎ – యూపిఎ వర్గాలకు ఈ ఫలితాలు చాలా కీలకం. ఓటరు నాడిని అంచనా వేయడంలో సర్వే సంస్థలు, మీడియా ఎంత వరకూ విజయం సాధిస్తాయన్నది కూడా త్వరలోనే తేలిపోతుంది.
Also Read : నందిగ్రామ్ నుంచి మమత పోటీ