Sunday, December 22, 2024

జలరవాణామార్గాలపై దృష్టి సారించాలి

.

తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు తీర ప్రాంతాన ఓ పెద్దాయన తో ముచ్చటిస్తున్న సందర్భంగా ‘ఎందయ్యా! ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని బ్రిడ్జీలు కట్టినా ఈ రద్దీ తగ్గేటట్లు లేదు . బ్రిటీషోళ్ళ కాలం నాటి ఆ బకింగ్ హామ్ కాలువ తిరిగి తెరిస్తే పోలా. తక్కువ ఖర్చుతో జల రవాణా వాడుకలోకి వస్తుంది’ అన్నారు. ఆయన మనోపరిపక్వతకు అబ్బురపడటం నావంతయింది. సంబాషణ పొడగిస్తూ ‘బ్రిటీషు కాలం నాటి బ్రిడ్జిలు, రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వున్నాయి. ఈ మధ్యనే వేసిన హైవే (NH45) మనుబ్రోలు దగ్గర తుపాన్ల తాకిడికి కొట్టుకొని పోయి, ప్రతి సంవత్సరం నానా యాతనా పడాల్సి వస్తోంది’ అంటూ వాపోవటం ఆతని వంతైతే, ఆయన విషయపరిజ్ఞానికి మనస్సు లోనే అభినందిచటం నా వంతు అయింది.

నిజమేమరి. విద్యుత్తు ఉత్పతిలో భాగంగా థర్మల్, జల, టైడల్, వాయు, అణు ఇందనాల మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లే, రోడ్లు ,హైవేలు, బుల్లెట్ ట్రైన్లు, జాతీయ, అంతర్జాతీయ విమానాలతో పాటు ప్రత్యామ్నాయంగా జల రవాణా మార్గాల్ని అభివృద్ధి చేయటం తక్షణ సౌకర్యంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

బకింగ్ హామ్ కెనాల్ ఈ కోవలోకి వచ్చేదే. ఈ ప్రాంత వాసులకు చిరపరచితమైన ‘బకింగ్ హామ్ కెనాల్’ 19వ శతాబ్దంలో పాశ్చాత్య ఇంజనీర్లు డిజైన్ చేసి, నిర్మించిన ఈ నావిగేషనల్ కెనాల్ ‘కోరమండల్ కొస్టు’ కే  తలమానికం అని చెప్పవచ్చు. గత వైభవ చిహ్నంగా, జాతీయ వారసత్వ సంపదగా మనకు సంక్రమించిన ఈ జల రవాణా వ్యవస్థ నేటి పాలకుల పోషణ కరువై నిరుపయోగంగా వుండటం, ఒక విధంగా చెప్పాలంటే జాతికే తలవంపు తెచ్చే శోచనీయాంశం.

1806వ సంవత్సరంలో రూపు దాల్చిన ఈ ఉప్పు నీటి జల రవాణా మార్గం ప్రధానంగా సరుకులను చేరవేయటంతో బాటు పౌరుల రవాణా కొరకై ఉద్దేశింపబడినా, వరదల తాకిడిని, తుఫాను భీభత్సాల్ని నిలవరించడంలో ఈ వ్యవస్థ ఎంతగానో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడిందని వాతావరణ శాస్త్రజ్ఞులు పలుమార్లు ఉటకించటం ఈ చారిత్రాత్మక కాలువ ప్రత్యేకతను చాటి చెప్తుంది.

2004లో సంభవించిన ఇండియన్ ఓషన్ సునామి (tsunami) లో, బకింగ్ హామ్ కెనాల్ ఒక బఫర్ జోన్ గా దాదాపు 310 కి.మీ పొడవునా – ప్రకాశం జిల్లా పెద గంజాం నుండి చెన్నై వరకు కొన్ని వేల మంది మత్సకారుల్ని, తీర ప్రాంత గ్రామాలను సునామి భీభత్సం బారినుండి కాపాడిన విషయం లోకవిదితమే. 10 నిమిషాల్లో టైడల్ వేవ్స్ సముద్రంలో కలిసి పోయేలాగున ఈ కెనాలు ఒక అడ్డుగోడగా నిలబడే సామర్ధ్యం కలిగి ఉన్నదని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

వాకాడు మండలంలో గల పెద కుప్పం, శ్రీనివాసపురం, తుడిపాలెం గ్రామాలు విపత్తు బారిన పడకుండా శిధిలావస్థలో వున్న ఈ కెనాల్ నివారించటంలో ఎంతగానో ఉపయోగపడిందని స్థానికులు పేర్కొనటం గమనార్హం. వరదలు, తుపాన్లు వచ్చిన ప్రతిసారీ కొన్ని వేల కోట్ల తక్షణ సహాయం అందించటం ఎంత అవసరమో, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ కెనాలును పునర్వస్థికరించడం అంతే ముఖ్యమని నేటి పాలకులు గుర్తించాలి. A stitch in time will save nine అన్న చందంగా.

దశలవారీగా నిర్మాణం

బకింగ్ హామ్ కాలువ నిర్మాణం దశల వారిగా జరిగింది. ఇది ఒక ప్రైవేట్ జల మార్గం అని చెప్పుకోవచ్చు. నేడు మనం వ్యవహరిస్తున బిల్డ్ , ఓన్,ఆపరేట్, ట్రాన్స్ ఫర్(Boot) మోడెల్ ఆ రోజుల్లోనే డిజైన్,బిల్డ్,ఆపరేట్ (DBO) పద్ధతిన ఈ జల రహదారిని నిర్వహించటం విశేషం. మద్రాసు పోర్టు నుండి ఎన్నోరు వరకు గల 16.5 కి.మీ. కెనాల్ నిర్మాణాన్ని బాసెల్ – కొక్రేన్ కంపెనీ చేపట్టి పూర్తి చేయటం చెప్పుకోదగ్గ విషయం. అందుకే మొదట్లో దీన్ని కొక్రేన్ కెనాల్ గా పిలిచేవారు (1806). మద్రాసుకు ఉత్తర దిశగా ఈ కెనాల్ ను పులికాట్ సరస్సు తో అనుసంధానిస్తూ 40 కి.మీ దూరం పొడగించటం జరిగింది. తదుపరి విజయవాడ (కృష్ణా) ద్వారా తూ.గో జిల్లా కాకినాడ రేవుకు పొడగించటం తో మద్రాసు-కాకినాడు పోర్టు కార్గో రవాణా కార్యకలాపాలను ముమ్మరంగా కొనసాగించే వీలుకల్గింది. 1880లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ నెల్లూరు పర్యటనలో భాగంగా ఈ కెనాల్ ను “బకింగ్ హమ్” గా డిక్లేర్ చేయటం జరిగింది.

796కి.మీ పొడవైన ఈ జలాంతర నావిగేషన్ కాలువ కోరమాండల్ కోస్టుకు సమాంతరంగా సముద్రతీరం నుండి ఒక కి.మీ దూరంలో తమిళనాడులోని విల్లుపురం వరకు విస్తరించి తీర ప్రాంతంలోని ఉప్ప టేర్లను, ముఖ్యంగా పులికాట్ సరస్సును అనుసంధానిస్తూ నిర్మింపబడ్డ ఈ కెనాల్ ఒక అద్భుత ఇంజనీరింగు సృష్టి అని చెప్పవచ్చు, బహుళార్ధక ప్రాజెక్టు అని కూడా పేర్కొనవచ్చు.

జాతీయ జలరహదారి

ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ జల రవాణా వ్యవస్థను పునరద్దరించే దిశలో భారత ప్రభుత్వం జాతీయ జల రహదారి(National Water Ways) (NW-4)గా 2008 లో డిక్లేర్ చేయటం హర్షణీయం. దేశంలో విస్తరించివున్న జల రవాణా మార్గాల్ని వాడుకలోకి తీసుకొని వచ్చే దిశలో ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWWAI) ను ఏర్పాటు చేసి, బకింగ్ హామ్ కెనాల్ అంతర్భాంగా కాకినాడ-పుదుచ్చేరి జాతీయ రహదారి పనుల పర్యవేక్షణకై విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాన్నే ప్రారంభించటం విశేషం. ఫెజ్-1లో లిస్టు కాబడ్డ ఈ ప్రాజెక్టు  సర్వే , ఫెజ్II&IIIలోకి నెట్టి వేయబడటంతో  పనులు నత్త నడకన కోనసాగుతుండటం ఒకింత నిరాశకు తానివ్వటం పాలకులు ఈ పాటికే గుర్తించారనే భావిద్దాం. ప్రాధాన్యతా క్రమాన్ని మార్పుచేసి, మొదటి దశలోనే ఈ జాతీయ జల రహదారి పనులు వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై  ఎంతైనావుంది. రాష్ట్ర జల వనరుల శాఖ నిర్వహించాల్సిన పాత్ర ఇంకెంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ రవాణా వ్యవస్థకు అనుబంధంగా అంతే ప్రాధాన్యతతో చేపట్టాల్సిన ప్రజోపయోగ పని ‘పులికాట్ సరస్సు’ ఆధునీకరణ పై తట్టు ప్రాంతాల నుండి ఆరణి, కాళింగ, స్వర్ణముఖి నదుల నుంచి వచ్చిపడ్డ చెత్త, చెదారం, వ్యవసాయ రసాయనాలు, పురుగు మందుల వ్యర్ధాలు ఈ సుందరమైన సదస్సును కలుషితం చేయడమే కాకుండా, పూడికతో నింపివేయటంతో ముఖ ద్వారాలు మూసుకునిపోయి సరస్సు ఎండిపోయే దుస్థితికి వచ్చిన ఘనత నేటి సభ్యసమాజానిదే అని చెప్పవచ్చు.

పులికాట్ సరస్సు ప్రాధాన్యం

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కోరమాండల్ కోస్టుకే అందాల్ని ఆపాదించిన ఈ సరస్సు ఒరిస్సా తీరంలోని చిల్కా సరస్సు తరువాత అతి పెద్ద సరస్సు గా చెప్పుకోవచ్చు.షుమారు 597 చ.కి.మీల విస్తీర్ణంతో, ఒక మీటరు లోతైన ఈ జలాశయం బకింగ్ హామ్ కెనాల్ లో అంతర్భాగమే అని చెప్పవచ్చు. కెనాల్ అభివృద్ధి పనులు ఎంత వేగంగా పూర్తవుతాయే, అంతే ఉధృత్తితో ఈ సరస్సు ‘జలకళ’తో ఉట్టి పడుతుందనటంలో సందేహం లేదు.

డచ్, పోర్చిగీసు, బ్రిటీషు పాలనలో మత్స సంపదకు ఎంతో పేరేన్నిక గల ఈ సరస్సును స్థానిక పల్లెకార్లు ‘పల్లై కట్టే’గా పిలుచుకునేవారు వాడుక బాషలో. మత్స్యకార్లను పల్లెకార్లు అని కూడా అంటారు. కాబట్టి వారి కరకట్ట గా వాడుకలో వుండేది.తమిళ్ భాష పోలికగా. పులికాట్ సరస్సు చుట్టూ వున్న వారి ఆవాస ప్రాంతాల్ని ‘కుప్పాలు’ అని కూడా పిలవటం కద్దు. కాలక్రమేణా పులికాట్ సరస్సుగా విదేశీ పాలకులు నామకరణం చేసినట్లు రికార్డుల్లో నమోదయింది. ఇరుక్కం, వేనాడు ఇత్యాది ద్వీప సముదాయాలు చెప్పుకోదగ్గ పర్యాటక కేంద్రాలు ఈ సరస్సు మధ్యలో ఉండటం విశేషం. రాష్ట్ర పర్యాటక శాఖ అద్యర్వంలో పర్యాటకుల సౌకార్యార్ధం వి.వి. పాలెం (తడ)సమీపాన ఏర్పాటు చేయడం జరిగినా ప్రస్తుతం మూతబడి వుండటం శోచనీయం. మత్సకార్ల యువతీ, యువకుల్ని ప్రోత్సహిస్తూ, ఈ సౌకర్యాన్ని పున:ప్రారంభిస్తే, విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వారమవుతాము.

సంవత్సరంలో దాదాపు 9 నెలలు నీటి వనరు కరువై ఎండిపోతున్న ఈ సరస్సు గత సంవత్సరం సంభవించిన ‘నివార్’ తుపాను పుణ్యమా అని పూర్తిగా నిండిపోయింది. రాష్ట్ర అరణ్య శాఖ నివేదికల ప్రాతిపదికగా జూన్/జులై మాసాల వరకు ఈ సరస్సులో నీటి నిల్వ వుంటుందని అంచనా. పేరుకు పోయిన పూడికను దశాబ్దాలుగా తీయకపోవటంతో, అటు తమిళనాడు ఇటు ఆంధ్ర ప్రాంత మత్స్యకార్లు జీవనోపాది కోల్పోయి, చాలీచాలని మత్స్య సంపద కోసం రెండు రాష్ట్రాల కార్మికులు పోటీపడి తరచూ కొట్లాటలకు దారితీయటం ఈ ప్రాంతంలో అనునిత్యం గోచరించే అమానుషమైన దుష్పరిణామం. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది ఈ సమస్య పరిష్కార దిశగా. పూడిక తీయటంలో ఏమాత్రం జ్యాప్యం జరిగినా, సరస్సు ఆనవాళ్ళు కను మరుగయ్యే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.

శ్రీహరికోట పుటికాట్ పనులకు ఆటంకమా?

అంతర్జాతీయ పెరెన్నిక గన్న శ్రీ హరి కోట-షార్- రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు పులికాట్ సరస్సు పూడిక పనుల్ని ఆటంక పరుస్తుందన్న స్థానికుల వాదనలో నిజం లేక పోలేదు. పూడిక తీస్తే, షార్ పరిసర ప్రాంతాలు ఉప్పనీటి  వ్యాప్తితో, భూగర్భ జలాలు ఉప్పు కయ్యాలు అయ్యే ప్రమాదం ఉందని శ్రీహరికోట అధికార్లు అడ్డు పడుతున్న దిశలో, ఈ సమస్యకు టెక్నాలజీ యుగంలో పరిష్కారం కనుక్కోవటం కష్టమైన పని కాదు. అడవి ముందా? ఆటవికులు ముందా? అరణ్య చట్టాల  కట్టు దిట్టాలు ముందా అన్న చందంగా, సరస్సు ముందా? షార్ ముందా? అన్న ధర్మ సందేహానికి త్వరలో జవాబు ఇవ్వాల్సిన బాధ్యత షార్ సైంటిస్టులపై ఎంతైన వుంది.

 సూళ్ళూరు పేట సమీపాన గల  సరస్సు ఫ్లెమింగ్ వలస పక్షుల నిలయం అని కూడా మనకందరికి తెలిసిందే. ‘పులికాట్ సరస్సు వన్య ప్రాణాల సంరక్షణా కేంద్రం అంతార్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది (IAA Code No:1N261). ప్రతి సంవత్సరం సెప్టెంబర్-డిశెంబర్ మాసాల్లో (సీజన్) వలస పక్షుల్ని వీక్షించటానికి ఫ్లె మ్మింగ్ పక్షుల ఫెస్టివల్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు నిర్వహించటం ఈ ప్రాంతానికే గర్వకారణం. గత సంవత్సర కాలంగా ‘కరోనా వ్యాధి నిరోధక చర్య’ గా ఈ ఉత్సవాలు నిర్వహించటం వీలుపడలేదు.

కొసమెరుపు: కాకినాడ కెనాల్ పునరుద్ధరించి స్వప్నసాకారం

చెప్పటం సులువు. చేయటం కష్టం అన్నది నానుడి. పాతికేళ్ళ క్రిందట మాట. నేను కాకినాడ పోర్టు (చిన్న రేవుల) డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులవి. బకింగ్ హామ్ కెనాల్ అంతర్భాగమైన కాకినాడ కెనాలు ఏలూరు కెనాల్ తో తాడేపల్లిగూడెం వద్ద గోదావరి జలాలతో కలిపే జల రవాణా మార్గాన్ని ప్రయోగాత్మకంగా పునరుద్ధరించాలన్న తపన. పూర్వ వైభవాన్ని చాటి చెప్పాలన్న పట్టుదల. పదవిరీత్యా లభ్యమైన అధికారాలను జోడించి ప్రజోపయోగమైన పని చేపట్టాలన్న కాంక్ష. వెరసి కాకినాడ కెనాల్ ను వినియోగంలోకి తేవాలన్న కల ఫలించింది. నాతో పాటు పని చేస్తున్న  అప్పటి మెరైన్ ఇంజనీరు రామకృష్ణారెడ్డి కృషి, ధవళేశ్వరం ఇరిగేషన్ ఇంజనీర్ల సహకారంతో  6 నెలలు దీక్షగా పనిచేస్తూ, తుప్పు పట్టిన పాత స్లూయీసును, లాక్ లను తిరిగి వాడుకలోకి తేవటం, కాలువ గట్టులకు అవసరమైన చిన్న మరమత్తుల నిర్వహణలో ఎట్టకేలకు కాలువను తిరిగి వాడుకలోకి తేవటం వీలైంది. తాడేపల్లి గూడెం వద్ద గోయోంకా గ్రూపు వారి – ఫుడ్ -ఫాట్స్- పర్టిలైజర్స -ట్రిపుల్ యఫ్ -కంపెనికి చెందిన రైస్ బ్రాన్(తవుడు) ను కాకినాడ యాకరేజ్ పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్న దిశలో రోడ్డు మార్గం లో లోరీల ద్వారా కాకుండా జల మార్గం(కాకినాడ కెనాల్) గుండా నాటు బోట్ల వ్యవస్థను ఉపయోగించుకుని డైరెక్టుగా ప్యాక్టరీ నుండి నడి సముద్రం లో లంగరు వేయబడ్డ షిప్ (వెస్సల్) లోకి చేరవేయటం ఎంతో తృప్తినిచ్చిందని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బండెనక బండి కట్టి’ అన్న తెలంగాణ జానపదాన్ని ఊతంగా ‘బోటు వెనుక బోటును కట్టి’ కాలువ మార్గంలో ఎగుమతి సరకును రవాణా చేయటం ఆ రోజుల్లో కాకినాడ పోర్టు సాధించిన ఘన విజయం అని చెప్పకోవచ్చు. మనస్సు ఉండాలేగానీ, మార్గం అదే తెరుచుకుంటుదన్నచందంగా, ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ వుండదని నిరూపించాం. ఆనాడు. ఆ ప్రయత్నాన్ని కొనసాగించక పోవటం ప్రభుత్వ తప్పిదమే. బకింగ్ హామ్ కెనాల్ నిర్వహణ, అపరేషన్ సుసాధ్యమే అన్న భరోసా కల్పించడమే ఆనాటి ప్రయోగాత్మక ప్రయత్నం ముఖ్య ఉద్దేశం.

.

Srinivasulu Dasari
Srinivasulu Dasari
మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అయనకు పేదల పక్షపాతిగా, ప్రజల తరఫున నిలిచే అధికారిగా పేరుంది. అనేక రంగాలలో అనేక హోదాలలో పని చేసి విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles