సంపద సృష్టిద్దాం – 12
ఈ వారం మనం డబ్బు గురించి కాకుండా డబ్బుకంటే విలువైన మరో అంశం గురించి మాట్లాడుకుందాం. అది సమయం. డబ్బు పోతే కూడబెట్టుకోవచ్చు. బంగారం పోతే సంపాదించుకోవచ్చు. పరువుపోయినా కొంచెం కష్టంతోనైనా తిరిగి నిలబెట్టుకోవచ్చు. కాని గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. సమయం అంత విలువైనది. కాని, ఇవ్వాళ పండు ముదుసలి నుంచి చిన్న పిల్లలవరకూ అందరి వద్దా లేనిది టైమే. ఎవరినడిగినా ఒకటే మాట ‘టైం లేదండీ’. చాలా చిత్రమైన విషయం ఏమంటే ఈ ప్రపంచంలో మన ఆర్థిక పరిస్థితులు వేరు కావచ్చును. ఒక్కొక్కరి ఆదాయాలు ఒక్కోలా ఉండొచ్చును. కాని సమయం మాత్రం అందరికీ సమానమే. రోజుకు ఇరవై నాలుగు గంటలు. అంటే 1440 నిమషాలు. 86,400 సెకనులు. ఎవ్వరికీ ఎక్కువా కాదు. తక్కువా కాదు. వాడుకోవడం, వాడుకోకపోవడం అంతా మన చేతుల్లోనే ఉంది.
Also read: బకెట్లు మోసే ప్రపంచం
24 గంటలు.. వాడుకో మానుకో
మన విజయం అంతా మన సమయాన్ని ప్రయారటైజ్ చేసుకోవడంలోనే ఉంది. అంటే మన రోజువారీ పనులకు మనమిచ్చే ప్రాధాన్యత అన్నమాట. తక్షణం చేయాల్సిన పనులకే మన కాలం కేటాయిస్తే మన టైమును లీవరేజ్ చేసుకోలేం. జీవితంలో ముఖ్యమైన పనులు, తక్షణం చేయాల్సిన పనులు రెండు ఉంటాయి. కొంచెం పెందలకడనే నిద్ర లేవడంతో మనం టైమును లీవరేజ్ చేయడానికి పునాది పడాలి. ముఖ్యమైన పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేసేస్తుంటే తక్షణం చేయాల్సిన పనులు మనకు ఉండవు. కాని దురదృష్టవశాత్తూ పరాజితులందరూ అంత ముఖ్యం కాని, తక్షణం చేయవలసిన అవసరం లేని పనులు చేస్తూనే తమ సమయాన్ని గడుపుతుంటారు. కొందరు కోటీశ్వరులు కావాలనుకుంటారు. కాని టీవీ ముందు గంటల తరబడి కూర్చుంటారు. లేదంటే స్మార్ట్ ఫోన్‌లో వాట్సప్ చాట్లు, స్టేటస్‌లు చూస్తూనో, ఫేస్‌బుక్ ఫీడ్లు చూస్తూనో, ఇన్‌స్టాగ్రాములో రీల్స్ చూస్తూనో గంటల కొద్దీ సమయాన్ని వృధా చేస్తుంటారు. మరి టైమును లీవరేజ్ చేయడం ఎలా నేర్చుకుంటారు? మళ్లీ చెప్తున్నాను. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయలు సంపాదించడం డబ్బును లీవరేజ్ చేయడం, ఒక గంట పెట్టుబడి పెట్టి దానినుంచి వెయ్యి గంటల ఫలితం పొందడం సమయాన్ని లీవరేజ్ చేయడం. సమయాన్ని పొదుపుగా వాడేవారే దానిని లీవరేజ్ చేయగలరు.
Also read: పైప్ లైన్ నిర్మిద్దాం!
చీమ, గొల్లభామల కథ మనకు తెలిసిందే. చీమలు ఎంత అల్పప్రాణులో మనం చూస్తున్నాం. వాటి నోట పట్టినంత కరిచి పట్టుకుని, ఎంతో దూరం ప్రయాణిస్తూ ఆహారాన్ని వాటి స్థావరంలో దాస్తుంటాయి. విరామం ఎరగకుండా నిరంతరంగా ఈ పని చేస్తుంటూనే ఉంటాయి. వేసవికాలం అంతా ఇదే పని. తరువాత వచ్చే వర్షాకాలంలో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వాటి ఆహారానికి ఢోకా ఉండదు. అవి బకెట్లు మోస్తూనే పైప్‌లైన్ కూడా వేసుకుంటాయన్న మాట. దానికి పూర్తి విరుద్ధంగా గొల్లభామలు ఎండాకాలం అంతా దొరికిన కాడికి తింటూ జల్సా చేస్తాయి. వర్షాకాలం తినడానికి లేక చనిపోతాయి. కేవలం బకెట్లు మోసేవారి పరిస్థితి ఇది. ప్రకృతి నేర్పించే అద్భుతమైన పాఠాలలో మెరుగైన ఆర్థిక పాఠం. సమయం లీవరేజ్ చేయడం ద్వారా అంతులేని సంపద సృష్టించగలం. ఇంతకుముందు శతాబ్దాల కంటే ఇప్పుడు సమయాన్ని లీవరేజ్ చేయడానికి అనేక అవకాశాలు పెరిగాయి. సాంకేతిక విప్లవం పుణ్యమా అని రకరకాల వ్యాపారాలు చేయడానికి అవకాశాలు పెరిగాయి. డబ్బు సంపాదించటం కూడా ఒక సైన్స్ గా భావించి, సమయాన్ని లీవరేజ్ చేసుకుని నిరంతర ఆదాయం పొందవచ్చు.
Also read: తలపోతల వలబోతలు
అడుగు – నమ్ము – పొందు
ప్రతిరోజు పొద్దున్నే లేవంగానే 1440 నిమషాలు మన అకౌంట్లో పడతాయి. మనం వాటిని ఎలాగైనా వాడుకోవచ్చు. ఖర్చు పెట్టవచ్చు. వృధా చేయవచ్చు. పెట్టుబడి పెట్టవచ్చు. లేదా తగలెయ్యనూ వచ్చు. మళ్లీ మరుసటి రోజు మరో 1440 నిమషాలు మన అకౌంట్లో జమ అవుతాయి. మరి మనం ప్రతిరోజూ ఎన్ని నిమిషాల సమయాన్ని మనకు నిరంతర ఆదాయం వచ్చేలా ఒక మంచి పైప్‌లైన్ వేయడానికి వినియోగిస్తున్నాం. ఎంత సమయాన్ని మన ఆర్థిక భద్రతకు, మన ఆర్థిక స్వేచ్ఛకు, మన ఆర్థిక వికాసానికి కేటాయిస్తున్నాం? మీరిచ్చే సమయం బట్టే మీ ఆదాయం. రోజుకు గంట, వారాంతాలలో రెండు గంటలు కేటాయించగలిగితే వారానికి తొమ్మిది గంటలన్నమాట. రోజుకు రెండు గంటలు, వారాంతాలలో మూడు గంటలయితే వారానికి పదహారు గంటలు మనం ఒక కొత్త పైప్‌లైన్ వేయడానికి వాడుకోవచ్చు.
Also read: విధాతలు మీరే!
ఇవాళ మనం చేసే ప్రతి చిన్న త్యాగానికి, రేపు పెద్ద ఫలితం ఉంటుందని నమ్మండి. మన కల పెద్దదవుతున్న కొద్దీ, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో పడే కష్టాలు చిన్నవయిపోతాయి. పరిస్థితులు మనకు అనుకూలం కావాలంటే పరిస్థితులైనా మారాలి, మనమైనా మారాలి. పరిస్థితుల్ని మనం మార్చలేం కాబట్టి మనమే మారాలన్న సత్యాన్ని గుర్తించండి. ఆ అంతర్గత మార్పు కోసమే ఈ వ్యాసాల ప్రయత్నం. మన ఆలోచనలు, మన స్పందనలు, మన పని విధానం సమూల మార్పులకు గురికావడానికే ఇదంతా. సంపన్నులు కావాలనుకునే సాహసవీరుల ఆలోచనలు విభిన్నంగా ఉండాలి.
Also read: ఇస్తుంటే తీసుకుంటాం..
తప్పక చేయండి: కోటీశ్వరులు కావాలనుకుంటున్న సాహసవీరుల కోసం సిద్ధం చేసిన వాట్సప్ గ్రూపులో చేరడానికి ఇంకా చాలామంది సందేహిస్తున్నారు. సాహసం చేయనిదే ఘనకార్యాలు సిద్ధించవు. వెంటనే 9989265444 నెంబరుకు సంపద అని రాస్తూ మీ పేరు, ఊరు వివరాలు వాట్సప్ మెసెజ్ పెట్టండి.
Also read: మనీ పర్స్ చూశారా!
– దుప్పల రవికుమార్