Sunday, December 22, 2024

ప్రభావశీలురు

మాశర్మ

ప్రతిష్ఠాత్మకమైన టైమ్ మ్యాగజిన్ 2020 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100మంది వ్యక్తుల్లో ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. సగం భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ను కూడా  కలుపుకుంటే,  ఆరుగురు అవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 82 ఏళ్ళ మహిళ బిల్కిస్, గూగుల్, ఆల్ఫాబెట్ సీ ఈ ఓ సుందర్ పిచ్చయ్య, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, హెచ్ ఐ వి వ్యాధి గ్రస్థుల సేవలో ఉన్న  ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో, అమెరికాలో నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా రేసులో ఉన్న  కమలా హ్యారిస్ కూడా ఉండడం విశేషం. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ 2014, 2015, 2017, 2020లో  వరుసగా  ఆరేళ్లల్లో  నాలుగుసార్లు టైమ్ మ్యాగజిన్ లో స్థానం దక్కించుకొని రికార్డ్ సృష్టించారు. ఇంకొక విశేషం ఏంటంటే… 2015లో టైమ్ మ్యాగజిన్ కోసం నరేంద్రమోదీ ప్రొఫైల్ ను అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా రాశారు. ఈ కీర్తి కూడా మోదీ దక్కించుకున్నారు. అమెరికాలో ఇంకా ఎన్నికలు జరుగక ముందే ప్రభావశీలగా కమలా హ్యారిస్ నిలుచోవడం, రేపటి ఎన్నికల్లో విజయం వరిస్తుందని చెప్పడానికి ఒక సంకేతంలా భావించవచ్చు. అదే సమయంలో, అనేక విమర్శలు ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ చోటు దక్కించుకోవడం ఆశ్చర్యంగా వుంది. రేపు జరుగబోయే ఎన్నికల్లో ఈ అంశం ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే. కరోనా వైరస్ సృష్టికి మూలం చైనా అని,  ప్రపంచంలోని అనేక దేశాలు అనుమానిస్తున్న సందర్భంలో, సామ్రాజ్యకాంక్ష మితిమీరి, ఆధిపత్య పోరు కోసం నానా కుట్రలకు పాల్పడుతోందని విమర్శలు ఎదుర్కొంటున్న చైనా దేశపు అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ప్రభావశీలుడుగా ఎంపికయ్యారు. ప్రపంచ ప్రజలు వీరిలోని ఏఏ కోణాలకు ఆకర్షితులవుతున్నారో, ఇంకా సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభావశీలురుగా ఎంపికైనవారిలోని కొందరిలో ప్రతికూల అంశాలు కూడా బాగా వున్నాయి.

బిల్కిస్ కు గుర్తింపు

భారతప్రధాని నరేంద్రమోదీ ఎంపికకావడం, అదే సమయంలో, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరిగిన నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన బిల్కిస్ కూడా ఎంపికవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షహీన్ బాగ్ ఆందోళనను ముందుండి నడిపిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. 82 ఏళ్ళ వయస్సులో చలిని కూడా లెక్కచేయకుండా ఉదయం నుండి అర్ధరాత్రి వరకూ పోరాటంలో నిలిచిన ఆమె పోరాటస్ఫూర్తికి ప్రపంచ ప్రజలు చలించి ఈ ఎంపిక చేసి వుంటారు. టైమ్ మ్యాగజిన్ నరేంద్రమోదీని ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పేర్కొంటూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రపంచంలోనే  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో విభిన్న మతాల ప్రజలు వున్నారు. సర్వమత సహనం విషయంలో నరేంద్రమోదీ పలు అనుమానాలకు తావిస్తున్నారంటూ టైమ్ మ్యాగజిన్ కరెస్పాండెంట్ కార్ల్ విక్ రాశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చెయ్యడానికి పౌరసత్వ సవరణ బిల్లు మొదలైన అంశాలు కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా, మన దేశ ప్రధాని ప్రభావశీలునిగా నాలుగుసార్లు ఎంపికకావడం భారతీయులందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం.

సుందర్ పిచ్చాయ్ ప్రశంస

తమిళనాడులోని ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, తన ప్రతిభ, సృజన, కృషితో గూగుల్ వంటి దిగ్గజ కంపెనీకి సీ ఈ ఓగా నియామకం కావడం  అసాధారణ విషయం. గూగుల్ కంపెనీని విజయాల బాటలో నడిపిస్తున్న సుందర్ పిచ్చయ్య ప్రతిభకు ప్రపంచం పట్టం కట్టింది. అతని  జీవిత కథ ఎంతో విశేషమైందని టైమ్ మ్యాగజిన్ ప్రత్యేకంగా కొనియాడింది. ఇది మనందరికీ గర్వకారణం. సుందర్ పిచ్చాయ్ ఆ మధ్య బెంగళూరు వెళ్ళినప్పుడు తనకు విద్య నేర్పిన  గురువు దగ్గరికి వెళ్లి కలిసి, ఆశీస్సులు పొందారు. ఇది నేటి యువత ఎంతో స్ఫూర్తిమంతంగా తీసుకోవాల్సిన విషయం. నేడు అగ్రస్థానంలో ఉన్నా, గతాన్ని మరచిపోనితనం సుందర్ పిచ్చాయ్ వ్యక్తిత్వంలో ఒక ప్రధానమైన అంశంగా భావించాలి.  ఇటువంటి లక్షణాలు విజయవంతమైన వ్యక్తులను మరింత విశేషంగా ప్రజల హృదయాల్లో నిలబెడతాయి. ప్రతిభాశీలురులో,  కేవలం బాలీవుడ్ నుంచే కాదు, భారతసినిమా రంగం నుండి ఆయుష్మాన్ ఖురానా ఒక్కరే ఎంపికవ్వడం మరో విశేషం. 36 ఏళ్ళ ఖురానా తను పోషించిన ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చెయ్యడం ఇతన్ని విజేతగా నిల్పింది. మొత్తంమీద, టైమ్ మ్యాగజిన్ ఎంపిక చేసిన వీరందరూ ప్రపంచ ప్రజల దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతున్నారు. ప్రపంచ ప్రజలు అంటే? ప్రపంచంలోని ప్రజలందరూ కాదు. ప్రపంచ స్థాయిలో టైమ్ మ్యాగజిన్ సర్వేలో ఓట్లు వేసిన కొందరు  ప్రజలు మాత్రమే అని అర్ధం చేసుకోవాలి. వీరి ఎంపికకు ప్రభావం చూపించే అంశాల్లో,  విశేషమైన విజయాలు, లక్షణాలతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా వీరందరూ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. మనవాళ్ళు ఐదుగురు ప్రభావశీలురుగా నిలవడం మనకు ఎంతో  ఉత్తేజాన్ని ఇచ్చే సందర్భం. ప్రభావశీలురుగా పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తులు తమలో ఉన్న లోపాలను, ప్రతికూల అంశాలను సరిదిద్దుకొని ముందుకు సాగితే, మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అప్పుడు ఎల్ల లోకమూ హర్షిస్తుంది. వీరందరికీ అభినందనలు తెలుపుదాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles