———
(‘TIME ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆల్ ముస్తఫాను ఇలా అడిగాడు. ” మాస్టర్, మాకు కాలం గురించి చెప్పండి.”
ఆయన ఇలా చెప్పాడు:
కొలత లేని, కొలవలేని కాలాన్ని
మీరు కొలుద్దాం అనుకుంటున్నారు!
గంటల వారి, ఋతువుల వారీ —
మీ ప్రవర్తనను సర్దుబాటు చేసుకుంటున్నారు
మీ ఆత్మమార్గాన్ని నిర్దేశించు కుంటున్నారు!
కాలాన్ని ప్రవాహంగా ఊహించుకుని
దాని ఒడ్డున కూర్చుని
ఒరవడిని పరిశీలిస్తూ ఉంటారు
అయినా, మీ ఆత్మ అనంత తత్వానికి
కాలాతీత జీవితం గురించి తెలుసు
ఇంకా, ‘ నిన్న ‘ — నేటి జ్ఞాపకం అని
‘రేపు’– ఈనాటి స్వప్నం అని కూడా తెలుసును!
అనంత విశ్వంలోకి — నక్షత్రాలు వెదజల్లిన
ఆ క్షణం పరిధిలోనే
మీ లోని పాట, మీ భావ స్రవంతి
ఉన్నాయని కూడా తెలుసు!
మీలోని ప్రేమ శక్తి పరిధులు లేనిదని
మీలో ఎవరికి మాత్రం తెలీదు!
ఒక ప్రేమ భావన నుండి మరొక ప్రేమ భావనకు
ఒక ప్రేమ చర్య నుండి మరొక ప్రేమ చర్యకు
పరిభ్రమించకుండా
ఆత్మను చుట్టుకుని ఉన్న
అవధుల్లేని ప్రేమను ఎవరు మాత్రం
అనుభూతించలేరు?
ప్రేమ మాదిరిగా కాలం కూడా
అవిభాజ్య మైనదీ
అతి వేగమైనదీ కాదా?
కానీ, మీ భావనలో కాలాన్ని రుతువులుగా
కొలవాలనుకుంటే
ప్రతి ఋతువూ — అన్ని ఋతువులనూ
చుట్టుకోనీయండి!
‘నేటి ‘ ని (ఈ రోజుని)–
గతకాలపు తల పోతలతో
భవితవ్యపు కాంక్షలతో
కౌగలించుకోనీండి!
Also read: తిమింగలము — సీతాకోకచిలుక
Also read: మార్గము
Also read: రాజదండము
Also read: అన్వేషణ
Also read: నేరమూ, శిక్షా