కరుగుతున్న క్షణాలలో
ఏరుకొన్న అనుభవాలే
చివరకు మిగిలే శిలాజాలు.
భవిత అమృతం చిలుకుతుందో
విష పానం చేయిస్తుందో
ఎవరికెఱుక?!
జీవితం
ఫలితం తెలియని సందిగ్ద సముద్ర మథనం.
కాలం తానే చెప్పే జవాబులకు
ప్రశ్నలడగడం అనవసరం.
అక్షయ తూణీరం
నిబిఢాంధకారం నిర్లజ్జగా క్రమ్ముకొస్తుంటే
చెదరగొట్టడానికి చిరుదివ్వెల చరమ సమరం.
చమురు కాసింతే ఉన్నా చెక్కు చెదరని ధైర్యం.
ఉధృత పవనాలు ఊపివేస్తున్నా
కిరణ కరవాలాలు ఝులిపిస్తూ కడపటి కదనం.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న
పట్టు సడలని కదనకుతూహలం.
ఇంతలో ఏ తల్లి చల్లని హస్తం నుండో
జాలువారిన తైలామృత ధారలు.
ప్రభంజనుణ్ణి వెక్కిరిస్తూ గ్రక్కున
చుట్టూ పరచుకొన్న అద్దాల పరదాలు.
ఒక్కసారిగా నవజవ సత్వ ప్రచండంగా
ప్రజ్వరిల్లిన ప్రఫుల్లోజ్వల కాంతులు.
చీకటి రారాజును చిత్తు చేస్తూ
విజయావిష్కరణ చేసిన జ్వాలా పతాకాలు.
ఆలోచింపజేసే ఈ ఆనంద జ్యోతులు
ఆత్మ స్థైర్యాన్ని ఉద్బోధించే ఆశా దీపాలు.
అవిశ్రాంత యోధులకు ధైర్యమే కదా
ఆ సవిత పొదగని సహజ కవచం!
అందరికి అందని, ఊరించే అదృష్టమే కాదా
వారి వెన్నంటి ఉండే అక్షయ తూణిరం!
Also read: ఇజం
Also read: మరపు
Also read: ప్రకృతి
Also read: ఆమె
Also read: మహా ప్రస్థానం