‘ఫ్లెమింగో’ పెరుగు రామకృష్ణగారి దీర్ఘ కవిత. ఇది 2006లో విడుదలై
15 యేళ్ళు పూర్తయింది. ఇప్పటివరకు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాళం లాంటి
భారతీయ భాషల్లోకి రొమేనియ ప్రపంచ భాషలోకి
అనువాదమై ప్రచురణ అయింది. దీన్ని 15 స్టాంజాలుగా
పునఃపరిచయం చేస్తున్నాం- సం.
కాలం అనంతం
కాలం కత్తి పడవ
కాలం రెక్కల గువ్వ
కాలం ఎడారి మౌనం
కాలం సముద్ర ఘోష
కాలం కురిసే చినుకు
కాలం గుండెల్లో వణుకు
కాలం చరిత్ర భాష
కాలం నిరంతర పరీక్ష
ఒక ఆగని పయనం కాలం
ఒక ఆగిన ఆయనం కాలం
ఆయుష్షు కాలం
స్రోతస్సు కాలం
మరణం కాలం
తరుణం కాలం
లాహిరి కాలం
ఊపిరి కాలం
కాలం సాదృశ్యం
కాలం మనోహర దృశ్యం
పరమాణువు ప్రాణం కాలం
ప్రణవాణువు నాదం కాలం
చావు పుటకల జాలరి కాలం
శాంతి హింసల కాలరి కాలం
కాలం తాకని తీరం లేదు
కాలం సోకని కిరణం లేదు
బ్రహ్మ పురాతన రూపం కాలం
కర్మ అధునాతన భావం కాలం
ఇహం పరం కాలం
నిరంతరం కాలం
కాలం జీవనది
కాల ప్రవాహంలో ప్రయాణం
జీవితం..!
Perugu Ramakrishna is a versatile poet.