- కెప్టెన్ కొహ్లీని ఊరిస్తున్న 22వ విజయం
- ఇంగ్లండ్ పై 20 స్వదేశీ విజయాల భారత్
సాంప్రదాయటెస్టు క్రికెట్లో రెండు అత్యంత ప్రధానమైన జట్లు భారత్, ఇంగ్లండ్. 89 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ గడ్డపై తన తొలిటెస్టు మ్యాచ్ ఆడిన నాటినుంచి.భారతజట్టు స్వదేశీ సిరీస్ ల్లో తన ఆధిపత్యం కొనసాగిస్తూనే వస్తోంది.
తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్యనాయుడు సారథ్యంలో భారతజట్టు.తనకు క్రికెట్ నేర్పిన ఇంగ్లండ్ తో 1932లో తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడిన నాటి నుంచి.. విరాట్ కొహ్లీ నాయకత్వంలో ఆడుతున్న ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు టెస్టుల వరకూ ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే ఇటు ఇంగ్లండ్, అటు భారత్ స్వదేశీ సిరీస్ ల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
89 ఏళ్లు-124 టెస్టులు:
1932 ప్రారంభ సిరీస్ నుంచి ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని రెండో టెస్టువరకూ భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 124 టెస్టుమ్యాచ్ లు జరిగాయి. భారత్ 27 మ్యాచ్‌లు నెగ్గితే, ఇంగ్లండ్ 49 విజయాలు నమోదు చేసింది. మరో 49 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు గత 89 సంవత్సరాల కాలంలో టెస్టు హోదా పొందిన వివిధ దేశాలతో ప్రస్తుత సిరీస్ లోని రెండో టెస్టువరకూ 548 మ్యాచ్ లు ఆడింది.ఇందులో 160 విజయాలు, 169 పరాజయాలు ఉన్నాయి. 218 టెస్టులు డ్రా ల పద్దులో చేరాయి.
Also Read: భారత టెస్టు జట్టులో తిరిగి ఉమేశ్ యాదవ్
ఇక 18వ శతాబ్దం నుంచి టెస్టు క్రికెట్ ఆడుతూ వస్తున్న ఇంగ్లండ్ జట్టు …ప్రస్తుత సిరీస్ లోని చెన్నై రెండోటెస్టు వరకూ మొత్తం 1032 మ్యాచ్ లు ఆడింది. వీటిలో 377 మ్యాచ్ లు నెగ్గి, 306 టెస్టుల్లో పరాజయాలు చవిచూసింది. మరో 349 టెస్టులను డ్రాగా ముగించింది.గత ఎనిమిది సంవత్సరాలలో భారత గడ్డపై ఇంగ్లండ్ కు చెన్నైటెస్టు విజయమే తొలిగెలుపుకాగా.చెపాక్ వేదికగా గత నాలుగేళ్ళలో భారత్ కు తొలిటెస్టు ఓటమే తొలి పరాజయంగా రికార్డుల్లో చేరింది.
విరాట్ ను ఊరిస్తున్న మరో రికార్డు:
టెస్టు క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ రికార్డు విరాట్ కొహ్లీని ఊరిస్తోంది. 2011లో ధోనీ నాయకత్వంలోనే టెస్టు అరంగేట్రం చేసిన కొహ్లీ మహీ పేరుతో ఉన్న అత్యధిక టెస్టు విజయాల రికార్డును చెన్నై విజయం ద్వారా సమం చేశాడు. ధోనీ,కొహ్లీ చెరో 21 విజయాలు సాధించిన కెప్టెన్లుగా ,సమఉజ్జీలు ఉన్నారు.
Also Read: చెపాక్ టెస్టులో అశ్విన్ రికార్డుల మోత
2014-15 సీజన్లో ధోనీ నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కొహ్లీ…ప్రస్తుత సిరీస్ లోని చెన్నై రెండోటెస్టు వరకూకోహ్లి 28 టెస్టుల్లో సారథ్యం వహించి 21 విజయాలు నమోదు చేశాడు. మరో ఐదు మ్యాచ్‌లను డ్రా కాగా, రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి ఎదురైంది. కాగా, ధోని సారథ్యంలో టీమిండియా.. భారత గడ్డపై 30 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలు నమోదు చేసింది. మూడు పరాజయాలు, ఆరు డ్రాలు ధోనీ ఖాతాలో ఉన్నాయి.
కోహ్లి కెప్టెన్సీలోనే ఐదు అతి పెద్ద విజయాలు:
భారత జట్టు ఇప్పటివరకూ మూడొందలు అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఆరు విజయాల్ని నమోదు చేసింది. పరుగుల పరంగా ఈ ఆరు అతిపెద్ద విజయాల్లో ఐదు కోహ్లి ఖాతాలోనే ఉన్నాయి. ధోనీ ఖాతాలో ఒకే ఒక్క భారీవిజయం ఉంది. 2008-09 సీజన్‌లో మొహాలీలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 320 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2015-16 సీజన్‌లో ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో టీమిండియా 337 పరుగుల తేడాతో విజయం సాధించగా, 2016-17 సీజన్‌లో ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 321 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 2019లో నార్త్ సౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 318 పరుగులతో విజేతగా నిలిస్తే… 2017లో శ్రీలంకతో గాల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టులో ఇంగ్లండ్‌పై 317 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
Also Read: భారత్ -ఇంగ్లండ్ బంధం ఏనాటిదో!
ఇంగ్లండ్ పై అతిపెద్ద గెలుపు:
ఇంగ్లండ్‌పై భారత్‌కు చెన్నై రెండోటెస్టు విజయమే అతి పెద్ద గెలుపుగా నమోదయ్యింది. 1986లో లీడ్స్ వేదికగా ముగిసిన టెస్టు లో ఇంగ్లండ్‌పై 279 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ .. 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతి పెద్ద గెలుపును నమోదు చేయడం విశేషం. అంతేకాదు భారత ఉపఖండంలో పరుగుల పరంగా ఇంగ్లండ్ కు ఇదే అతి పెద్ద ఓటమి. అంతకుముందు ఆసియా ఉపఖండంలో జరిగిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే ఇంగ్లండ్‌కు అతి పెద్ద ఓటమి ఎదురైంది కూడా భారత్‌పైనే. 2016-17 సీజన్‌లో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 246 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మరి…అహ్మదాబాద్ డే-నైట్ టెస్టులో ఏ జట్టు విజేతగా నిలుస్తుందన్న ప్రశ్న ఇప్పుడు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.