Thursday, November 21, 2024

అమెరికాతో భారత సంతతి అనుబంధం బలోపేతం

• అంగారక గ్రహంపై రోవర్ ప్రయోగంలో స్వాతీమోహన్ గురుతర పాత్ర
• అమెరికాకు ఏటా రెండు లక్షల మంది తెలుగు విద్యార్థులు
• తలసరి ఆదాయంలో ఇండియన్ అమెరికన్లు అగ్రగణ్యులు

వాషింగ్టన్ : తెలుగువారికీ, భారతీయులకూ అమెరికాతో కొంతకాలంగా పెనవేసుకున్న అనుబంధం మరింత బలోపేతం అవుతోంది. అమెరికా సమాజంలో భారతీయుల ప్రాభవాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రశంసించారు. అమెరికా గ్రాస్ డెమెస్టిక్ ప్రాడక్ట్ (జీడీపీ)లో మూడు శాతం భారత సంతతికి చెందినవారి అధీనంలో ఉండే సమాచార సాంకేతక రంగం (ఐటీ) సంస్థలు సృష్టించిందేనని ఆయన అన్నారు. బైడెన్ ప్రభుత్వంలో కీలకపదవులలో 56 మంది దాకా భారతీయులే ఉన్నారు. అంతకు ముందు ఒబామా, ట్రంప్ ప్రభుత్వాలలో సైతం భారతీయులకు పెద్దపీటే వేశారు.

వెల్లువెత్తుతున్న తెలుగు విద్యార్థులు

అదే సమయంలో అమెరికాకు తెలుగు విద్యార్థులు వెల్లువెత్తారు. పోయిన విద్యాసంవత్సరంలో భారత్ నుంచి 1,93,124 మంది విద్యార్థులు అమెరికా వెడితే వారిలో సగంమంది తెలుగువారేనని, 25 శాతం తెలుగు కుటుంబాలకు అమెరికాతో అనుబంధం ఉన్నదని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రైస్మెన్ చెప్పారు.
అంగారక గ్రహం (మార్స్)పైకి ఫిబ్రవరి 18న రోవర్ ప్రెజవరెన్స్ ను పంపిన నాసా శాస్త్రవేత్తల బృందంలో ముఖ్యురాలైన స్వాతీమోహన్ తో మాట్లాడుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయులు అమెరికా దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నారంటూ చమత్కరించారు. ‘‘స్వాతీ, మీరూ, మా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, నా ప్రసంగాల రచయిత వినయ్ రెడ్డి, తక్కిన ఇండియన్ అమెరికన్లు అంతా ఇక్కడ ప్రముఖమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకంటే రుజువు ఏమి కావాలి? మీరందరికీ కృతజ్ఞతలు. మీరంతా అద్భుతమైన వ్యక్తులు’’ అని అన్నారు.

Also Read: సంక్షోభాలు – సైన్స్ సమాధానాలు

అమెరికా సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై భారత సంతతి ప్రభావం

అమెరికా సామాజిక, ఆర్థిక వ్యవస్థపైన భారతీయులు ప్రభావం వేస్తున్నారనడానికి బైడెన్ వ్యాఖ్యలే సాక్ష్యం. మార్స్ మిషన్ లో గైడెన్స్ నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్లకు స్వాతీ మోహన్ నాయకత్వం వహించారు. అంగారక గ్రహంపైన ఎప్పుడు ఏ విధంగా రోవర్ పెజిరవెన్స్ దిగాలో నిర్దేశించడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ‘‘టచ్ డైన్ ఈజ్ కనఫమ్డ్’’ అంటూ ప్రపంచానికి ప్రకటించిన వ్యక్తి భారతీయురాలైనా స్వాతీమోహన్. దేశాధ్యక్షుడితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు పులకించిపోతున్నానంటూ స్వాతి అనడంతో, ‘నన్ను ఆటపట్టించవద్దు (ఆర్ యూ కిడ్డింగ్ మీ?). మీతో మాట్లాడే అవకాశం రావడమే నాకు గౌరవంగా భావిస్తున్నాను.

కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, స్వాతీమోహన్…

నాసా ప్రయోగాలలో భారతీయులకు అవకాశాలు లభిస్తున్నాయి.2003లో స్పెస్ షటిల్ చాలెంజర్ లో ప్రయాణం చేసిన కల్పనాచావ్లా అంతరిక్ష పడవకు ప్రమాదం సంభవించి దుర్మరణం పాలైనారు. అటు పిమ్మట అంతరిక్షానికి జయప్రదంగా వెళ్ళివచ్చిన సునీతా విలియమ్స్ భారతీయులకు గర్వకారకులైనారు. అంతరిక్షానికి వెళ్ళబోయే తొలి ప్రైవేటు స్పేస్ ఎక్స్రెప్రెస్ కు రాజాచారి నాయకత్వం వహించనున్నారు. నాసాలో పనిచేస్తున్న ఎనిమిది శాతం ఆసియావాసులలో రెండు శాతంమంది భారతీయులు ఉంటారని అంచనా.

Also Read: అమెరికా, చైనా నువ్వా-నేనా

ఇండియన్ అమెరికన్లపైన బైడెన్ విశ్వాసం

అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ (శ్వేతభవనం)లో అత్యధికంగా భారతీయులను నియమించిన ఘనత జో బైడన్ దే. జనవరి 20వ తేదీన అధికారంలోకి వచ్చిన బైడెన్ 55 మంది భారత అమెరికన్లకు (ఇండియన్ అమెరికన్స్) ఉద్యోగాలు ఇచ్చారు. వారిలో సగం మంది మహిళలు కావడం విశేషం. 2009-17లో అమెరికా అధ్యక్షుడుగా వ్యవహరించిన ఒబామా కూడా భారతీయులను కీలకమైన పదవులలో నియమించి గురుతరమైన బాధ్యతలు అప్పగించారు. కరుడుకట్టిన మితవాదిగా, శ్వేతవాదిగా ముద్రవేసుకున్న ట్రంప్ ఆధ్వర్యంలో సైతం శ్వేతసౌధంలో 36 మంది ఇండియన్ అమెరికన్లు పని చేసేవారు.

ఐటీ రంగంలో ప్రభావశీల పాత్ర

ఐటీ రంగంలో భారతీయుల ప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మైక్రోసాఫ్ట్ కు సత్యనాదెండ్ల, గూగుల్ కి సుందర్ పిచాయ్ లు నాయకత్వం వహిస్తున్నారు. 1990ల నుంచి భారతీయ సీవోలు అమెరికాలోని బహుళజాతి సంస్థలకు నేతృత్వం వహించడం సర్వసాధారణమైన అంశంగా మారింది. అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీల విభాగాలలో దాదాపు రెండు లక్షల మంది ఇండియన్ అమెరికన్లు పని చేస్తున్నారు. 2017 నాటి అంచనాల ప్రకారం అమెరికా డీజీపీలో మూడు శాతం మేరకు అక్కడి భారతీయ కంపెనీలే సృష్టిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీలో ఉన్న ఐటీ సంస్థలలో భారతీయులకు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. అమెరికాలో చదువులకోసం ఏటా రెండు లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేస్తున్నారు. విద్య పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించి స్థిరపడుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన పెట్టుబడుల కారణంగా అమెరికా వెళ్ళిన భారతీయులు అనతికాలంలోనే సంపన్నులుగా ఎదుగుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సగటు ఆదాయం మిగతా జాతులవారికంటే అధికం. అమెరికన్ ఇండియన్ల సంఖ్య 30 లక్షలవరకూ ఉంటుందని అంచనా. అమెరికా జనాభాలో ఇది ఒక శాతం. అయినప్పటికీ ఎన్నికలలో వీరి మాటకు విలువ ఉంటుంది. వీరి ప్రభావం ఎక్కువ.

Also Read: బైడెన్ స్నేహ గీతిక

‘స్టార్ ట్రెక్’ నా గమ్యం నిర్దేశించింది: స్వాతిమోహన్

Meet Dr Swati Mohan, the Indian-American scientist behind NASA's rover  landing on Mars | World News,The Indian Express

బెంగళూరు పుట్టిన స్వాతీమోహన్ ఏడాది పసిపిల్లగానే అమెరికా గడ్డపైన కాలుమోపింది. అసలు పిల్లల వైద్యురాలు (పిడియాట్రీషియన్) కావాలని అనుకున్నారు. తర్వాత అంతరిక్ష శాస్త్రజ్ఞురాలు కావాలనుకున్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. మాసాచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటిక్స్ లో పీహెచ్ డీ చేశారు. మార్స్ 2020 మిషన్ లో ప్రారంభంలోనే 2013లో చేరారు. ‘‘నా చిన్నతనంలో స్టార్ ట్రెక్ అనే సీరియల్ చూసినప్పుడే నాసా దిశగా నా తొలి అడుగులు పడినాయి. అదే నా గమ్యాన్ని నిర్దేశించింది. జెట్ ప్రొపెల్షన్ లేబొరేటరీ (జెపీఎల్ )లో ఇదే నా తొలి మిషన్. ఇందులో భాగమైనందుకూ, అద్భుతమైన జట్టులో కలిసి పనిచేస్తున్నందుకూ చాలా ఆనందంగా ఉంది,’’ అంటూ ఆమె ప్రెసిడెంట్ బైడెన్ తో అన్నారు.

తొలి ప్రయోగం జయప్రదం

Mars Exploration Rover - Wikipedia

పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహం పైన దిగిన తర్వాత జరిపిన తొలి ప్రయోగం జయప్రదంగా సాగిందని నాసా అధికారులు వెల్లడించారు. ఆరు కాళ్ళున్న రోవర్ గురువారంనాడు 33 నిమిషాలలో అంగారక గ్రహంపైన 6.5 మీటర్లు (21.3 అడుగులు) కదిలింది. నాలుగు మీటర్లు ముందుకు వెళ్ళి 150 డిగ్రీలు ఎడమచేతివైపు తిరిగి మళ్ళీ రెండున్నర మీటర్ల వెనక్కు తగ్గి కుదురుకున్నది. ‘‘పర్సెవెరెన్స్ టైర్లను తిప్పడానికి చేసిన తొలి ప్రయత్నం ఇదే,’’ అని నాసా ఇంజనీర్ అనాయిస్ జారిఫియన్ అన్నారు. అంగారక గ్రహయానానికీ, ఆ యానం పర్యవేక్షిస్తున్న సభ్యులకూ ఇది ఒక మైలురాయి వంటి పరిణామం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇంకాస్త ఎక్కువ దూరం రోవర్ ని నడిపిస్తామని చెప్పారు. అంగారకుడి ఉపరితలంపైన మరింత పెద్ద రోవర్లను పంపడానికి ఏయే దారులు ఉన్నాయో పరిశీలిస్తున్నామని ఇంజనీర్లు చెప్పారు. రోవర్ లో ఒక డ్రోన్ హెలికాప్టర్ తీసుకువెళ్ళారు. దాన్ని ప్రయోగించడానికి ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని మార్స్ మిషన్ డిప్యూటీ మేనేజర్ రాబర్ట్ హాగ్ తెలిపారు. తమ మిషన్ కు ఇంతవరకూ ఎటువంటి సమస్యలూ ఎదురు కాలేదని హాగ్ వ్యాఖ్యానించారు. రోవర్ అంగారక గ్రహంపైన రెండు సంవత్సరాలకు పైగానే ఉంటుంది. గ్రహం ఉపరితలంపైన గల రాళ్ళనూ, మట్టినీ ప్రయోగాలకోసం సేకరిస్తుంది. టన్ను బరువున్న ఈ రోవర్ ఎస్ యూవీ కారు సైజు ఉంటుంది. ఏడు అడుగుల రొబో చేయి ఈ యంత్రంలో ఉంటుంది. 19 కెమెరాలూ, రెండు మైక్రోఫోన్లూ ఇందులో ఉన్నాయి. గురువారం సాయంత్రం వరకూ 7,000 ఫొటోలు తీసి పంపించింది.

Also Read: అంగారకుడిపై రోవర్ క్యాట్ వాక్ అదరహో!

ఎప్పటికైనా మనిషిని పంపాలని అమెరికా ఆకాంక్ష

అంగారకగ్రహంపైన అడుగుపెట్టిన యంత్రాలలో ఇది అయిదవది. లోగడ అడుగుపెట్టిన నాలుగు యంత్రాలు కూడా అమెరికా పంపినవే. ఈ గ్రహం పరిశోధనలో అమెరికా అగ్రగామిగా ఉంది. ఎప్పటికైనా ఈ గ్రహం పైకి మనుషులతో కూడిన అంతరిక్ష పడవను పంపించాలని అమెరికా ఆకాంక్ష. ఈ లక్ష్య సాధనకు ఇంకా చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles