మన బారిష్టరుపార్వతీశం నవలకి వందేళ్ళు!
పిఠాపురానికి వెలుగురేఖలు !
(ముగ్గురు సామ్యవాదుల పరిచయాలు)
“ప్రతి మనిషికీ మనసులోని మనస్సుంటుంది. అది మన చేతనా నిర్భూతినీ పరీక్షి స్తుంది. తప్పులు చేస్తుంటే హెచ్చరిస్తుంది. కానైతే మనం పచ్చి భౌతికవాదులమనుకుంటూ దాని పీక నులిమి చంపేస్తాం. దుర్మార్గాలే జీవన కర్తవ్యాల నుకున్నవారు చేసే ప్రథమ హత్య ఈ అంతర్వాణినే. అంతర్వాణీ మార్గదర్శకత్వం అందుకున్న వాళ్ళు ఒక గాంధీ, ఒక లెనిన్ గా, ఒక చండ్ర రాజేశ్వరరావులా రూపొందు తారు.” (పేజి 8)
– డా. ఆవంత్స సోమసుందర్
“సిద్ధాంతంలేని ఆచరణ గుడ్డిది – ఆచరణ లేని సిద్దాంతం గొడ్డుది అన్నాడు మార్స్కు మహర్షి. శ్రీ హర్షుడు ‘అథీతి బోధావరణై’ అన్నాడు నైషధంలో. అధీతి అంటే చదివిన దానిని బోధ పరచు కోవడం తాను ఆచరిం చడం – దానిని ప్రచారం చేయ డం అనే విద్య, విజ్ఞతగల పండిత హృదయుడు కమ్యూనిస్టు అవ్వా ల్సిందే! అని నా విశ్వాసం.” (పేజీ 19)
– డా. మాడభూషి భావనాచార్యులు
“ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ప్రజాస్వామిక విధానాల అమలుకు మారుపేరు ఉప్పులూరి. దళారి, పెత్తందారీ, కులతత్వ నాయకత్వాలకు సింహస్వప్నం ఆయన పేరు. దళితబహుజనులతో సహా అనేకమంది కార్యకర్తలు, ఉప్పులూరి శిక్షణలో అభివృద్ధై త్యాగశీలంగా మెరుగైన సమాజం కోసం పనిచేశారు, చేస్తున్నారు. కార్మిక వర్గం జీతభత్య పోరాటాలకు పరిమితం కాకుండా విప్లవ రాజ కీయ చైతన్యాన్ని పెంపొందించుకుని, బలమైన స్వతంత్ర రాజకీయ శక్తిగా అభివృద్ధి కావాలని నిరంతరం బోధించే వారు. కార్మిక కుటుంబాలే తన కుటుంబంగా, యూనియన్ కార్యాలయాలే ఇల్లుగా, కార్మిక పోరాటాలే ఊపిరిగా వుప్పు లూరి జీవించారు.”(పేజీ 21)
– సి. హెచ్. ఎస్. ఎన్. మూర్తి
“శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన అనుభవాలు జ్ఞాపకాలులో అంటారు, “సత్యం-శివం-సుందరం. ఇంతే కవుల ధ్యేయం” అని. సో. సు. జీవితానికి సరిగ్గా అతికినట్లు సరిపోయే వాక్యమిది. జీవితాంతం సత్యం కోసమే బతికి, శివాన్ని అంటే అందరి బాగుని ఆశించి, సుందరాన్ని జీవితంలోని సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన మహామనిషి సో.సు.”(పేజీ 30)
“డా.మాడభూషి భావనాచా ర్యులు చిన్న వ్యక్తి కాదు. తొలి తరం కమ్యూనిస్టునాయకులు. ప్రజాపోరాటాల్లో క్షేత్రస్థాయిలో పాలుపంచుకున్న వ్యక్తి. 1947 లో ప్రభుత్వం ఆయన ఆచూకీ తెలిపితే పదివేల బహుమతి ప్రకటించింది. నాగులాపల్లనే చిన్న గ్రామంలో ఉన్న మాడభూషిని పట్టుకునేందుకు ఏకంగా నాలుగు పెద్ద లారీలతో పోలీసులు రావాల్సి వచ్చిందంటే, కమ్యూనిస్టుగా ఆయన స్థైర్యం ఏపాటిదో అర్ధం అవుతుంది.” (పేజీ 33)
“పిఠాపురం నవయుగానికి నాలుగు స్తంభాలు చెలికాని భావనరావు, మాడభూషి భావనా చార్యులు, ఆవంత్స సోమ సుందర్, ఉప్పులూరి సుబ్బారావు గారు. ఈ నలుగురు పిఠాపురం పట్టణం లోనే కాదు తెలుగు రాష్ట్రంలో నవ యుగానికి నాంది పలికినవారు. వీరు మన పిఠాపురంలో జీవించడం నిజంగా గర్వకారణం. నలుగురూ కూడా అభ్యుదయ ఆలోచనలతో సామాన్యుని అభ్యున్నతి కోరినవారే.”(పేజీ 34)
– దల్లి శ్రీనివాసరావు
పిఠాపురంలో నవ్య ఒరవడికి శ్రీకారం చుట్టి, సరిగ్గా 1924 లో జన్మించిన ముగ్గురు సామ్యవాద ప్రముఖుల్ని సంక్షిప్తంగా పరిచయం చేసిన ప్రయత్నమే,’పిఠాపురానికి వెలుగురేఖలు’ పుస్తకం. ప్రపంచ సామ్యవాద మహానేత లెనిన్ శతవర్ధంతి నివాళిగా, ఈ మధ్యనే మరణించిన మా బంటీ స్మృతిలో, మరో మగ్గురు మహ నీయులు చెలికాని భావనరావు, ప్రతివాద భయంకర వెంకటాచారి, పుత్సల సత్య నారాయణలకి అంకితం ఇవ్వబడ్డ ఈ చిరు కృతి తెలుగులోనే అద్వితీయ హాస్య నవల మొక్కపాటి నరసింహ శాస్త్రి “బారిష్టరు పార్వతీశం” కి శతవార్షికోత్సవం సందర్భంలో తీసుకొస్తున్నాము !
“నేను కమ్యూనిస్టు కావడమే సహజ పరిణామం. అలాకాక మరేదైనా అయతేనే ఆశ్చర్యమూ, దుఖమూ పొందాల్సింది!’’ అన్న సోమసుందర్ మొదలు కొని, “Simple living and high thinking” అన్న మిల్టన్ సూక్తి కమ్యూనిస్టులకు వర్తిస్తుంది. నేను కమ్యూనిస్టు గానే పుట్టాను, కమ్యూనిస్టు గానే జీవించాను, కమ్యూనిస్టుగానే మరణిస్తాను.” అని గొంతెత్తి నినదించిన మాడభూషి భావనాచార్యులు వరకూ అసమానతల్ని నిరసిస్తూ మానవతను ఒక జీవన విలువగా పాటించిన తరాన్ని హృద్యంగా స్మరించుకునే ప్రయత్నంలో భాగమే ఈ చిరు కృతి. ఆ ఆదర్శాలే మానవ జీవన విధానాన్ని పరిపుష్టం చేయగల సంస్కృతి !
అలాంటి సాంస్కృతిక జవసత్వాల్ని నిబద్దతతో నిలుపు కోవడం మన బాధ్యత కావాలి. అందుకోసం కృషిచేసిన ప్రజా హితుల చరితలను కనీసం ఆ మేరకయినా గుర్తించడంలో మనం విఫలమైతే, అది మన భావదారిద్ర్యానికీ, సాంస్కృతిక క్షీణతకీ దారి తీస్తుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ భావజాల స్రవంతిని బలోపేతం చేసుకోవడం అవసరం. ఒకనాడు సమసమాజ నిర్మాణం కోసం సంకల్పించిన ముగ్గురు సామ్యవాదుల సంక్షిప్త పరిచయాలతో అనేక పరిమితుల్లో అయినంతలో స్వల్పమైన ఈ చిరు ప్రయత్నం చేసిందందుకనే. ఇది చదివిన ఏ ఒక్క వ్యక్తయినా ఇందులోని జీవితాల నుండి ఇసుమంత స్ఫూర్తి పొందినా ఈ అక్షరాలకి అంతకుమించిన సార్ధకత మరేదీ లేదని మనవి!
(మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక సమితి తరపున 11వ ప్రచురణగా వెలువడిన ఈ పుస్తకంలోని వ్యాసాల్ని పరకాల పట్టాభి రామారావు గారి “స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశ భక్తులు” గ్రంథం నుండీ, అలాగే, ఇతర అనుబంధాల్ని ఆయా సందర్భాలు, ఇంకా అంతర్జాలం నుండీ సేకరించాం. ఈ చిన్న వ్యాస సంకలనం ప్రత్యామ్నాయ చరిత్ర యొక్క అధ్యయనానికి పూనుకునే వారికొక రవంత ఊతం మాత్రమే. అలా ఆసక్తి ఉన్న ఔత్సా హికుల కోసం ఈ పుస్తకం సాఫ్ట్ కాపీ ఇలా పంపుతున్నాను. అవకాశం ఉన్న వారు మా యత్నాలకు స్వచ్ఛందంగా సహకరించ డానికి ముందుకు రావాల్సిం దిగా మనవి, విమర్శలకు ఆహ్వానం!)
– గౌరవ్