- అల్ప సంఖ్యాకుల పట్ల రిపబ్లికన్ల అసహనం
- ట్రంప్ విధానాలు భారతీయులకు వ్యతిరేకం
- డెమాక్రాటిక్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇండియా-అమెరికా సంబంధాలు మెరుగు
- ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వేలో వెల్లడి
నాలుగింట ముగ్గురు ఇండియన్ అమెరికన్లు (అమెరికాలో స్థిరపడిన ఇండియా సంతతివారు) నవంబర్ 3న జరిగే పోలింగ్ లో అమెరికా అధ్యక్షపదవికి డెమాక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కు ఓటు వేయబోతున్నట్టు తెలుస్తోంది. 2020 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే ప్రకారం డెమాక్రాట్ల పట్ల ఇండియన్ అమెరికన్ల వైఖరిలో ఎటువంటి తేడా లేదని తెలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ కూ, భారత ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా ఇండియన్ అమెరికన్లు మెల్లగా రిపబ్లికన్ లవైపు మొగ్గు చూపుతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు భిన్నంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి.
ఈ సర్వేలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పినవారిలో అత్యధికులు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇండియాతో రిపబ్లికన్ అధ్యక్షులు మెరుగ్గా వ్యవహరిస్తారనే వారి కంటే డెమాక్రాటిక్ పార్టీ అధ్యక్షులు సవ్యంగా వ్యవహరిస్తారనేవారి సంఖ్య రెట్టింపు ఉంది. రిపబ్లికన్ పార్టీ అల్పసంఖ్యాకుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నదనే అభిప్రాయం ఇండియన్ అమెరికన్లు వెలిబుచ్చారు. పెన్సెల్వేనియా విశ్వవిద్యాయం, జాన్ హాప్ కిన్స్, కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఈ సర్వే ఫలితాలు ప్రకటించాయి.
ఈ సర్వే ప్రకారం ఇండియన్ అమెరికన్లలో కేవలం 22 శాతం మంది ట్రంప్ కి ఓటు వేయాలని అనుకుంటున్నారు. 72 శాతం మంది బైడెన్ కు ఓటు వేస్తారు. సర్వేలో ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఇండియన్ అమెరికన్లలో 27 శాతం మంది రిపబ్లికన్లు అల్పసంఖ్యాక వర్గాల పట్ల అసహనం ప్రదర్శిస్తారని వ్యాఖ్యానించారు. న్యాయబద్ధంగా అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఉండటం కూడా తమ ప్రతికూలతకు కారణమని 15 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది దాకా ట్రంప్ పట్ల వ్యతిరేకత వెలిబుచ్చారు. ఏ పార్టీ ఇండియాతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందనే ప్రశ్నకు డెమాక్రాటిక్ పార్టీ అంటూ 39 శాతం మంది సమాధానం చెప్పగా రిపబ్లికన్ పార్టీ పేరు 20 శాతం కంటే తక్కువ మంది చెప్పారు.