ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భౌగోళిక ఆకృతికి ఒక ప్రత్యేకత ఉంది. వెయ్యి కిలోమీటర్ల నిటారు సముద్రతీరంతో దేశంలోనే పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్నది. గుజరాత్ రాష్ట్రం సముద్రతీరం ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువైనా అది నిటారుగా సమాంతరంగా లేదు. ఈ తీర ప్రాంతానికి చివరి భాగంలో ఒక మూపురం లాగా రాయలసీమ ప్రాంతం కలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రకంగా సాంస్కృతికంగా తమకంటూ ప్రత్యేకత కలిగిన మూడు ప్రాంతాలు ఉన్నాయి. 1 రాయలసీమ. 2 కోస్తా ఆంధ్ర 3 ఉత్తర కోస్తా.
కృష్ణదేవరాయలు పరిపాలనలో విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైన ప్రాంతం గా నిలిచిన రాయలసీమను భౌతికంగా నల్లమల పర్వత శ్రేణులు కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి విభజిస్తున్నాయి. 1802 సంవత్సరంలో హైదరాబాద్ నిజాం సైన్య సహకార పద్ధతి (subsidiary alliance) కింద రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చారు.
ఇక ఉత్తర కోస్తా ప్రాంతాన్ని దక్షిణ కళింగ ప్రాంతం అని కూడా అంటారు. కృష్ణదేవరాయలు కటకం నుంచి పాలించుచున్న గజపతులపై చేసిన దండయాత్రల ఫలితంగా ఈ ప్రాంతానికి తెలుగు సంస్కృతి తెలుగు భాష విస్తరించింది. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఈ ప్రాంతం ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంది. ఒకరకంగా మూడు ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతాల సమాహారమే ఆంధ్ర రాష్ట్రం.
1950వ దశకంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయే సమయంలో కూడా ఈ అంతర్గత ప్రాంతీయ (sub regional) అంశాలు ప్రయోజనాలు రాజధాని నిర్ణయం అంశం నుంచి, విశ్వవిద్యాలయం ఏర్పాటు వరకు తీసుకున్న నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఆనాటి పెద్దలు ఈ అంతర్గత ప్రాంతీయ ప్రయోజనాలను, అంశాలను గుర్తించి దార్శనికతతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈ అంతర్గత ప్రాంతీయ అంశాలు ఒక స్థాయి దాటి రాజకీయాలను వికటింప చేయలేదు. ఇక 1956లో విశాల ఆంధ్ర ఏర్పడటంతో ఈ అంతర్గత ప్రాంతీయ అంశాలు మరుగున పడి అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగింది.
1956 లో విశాలాంధ్ర ఏర్పడటంతో మరొక పెద్ద ప్రాంతం తెలంగాణ తన ప్రత్యేక వ్యక్తిత్వంతో భిన్నత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో 1953 వ సంవత్సరం నాటి భిన్నత్వం ప్రత్యేకతతో మూడు ప్రాంతాలతో కలిసిన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. చారిత్రక అవగాహనతో ఆంధ్ర రాష్ట్రం లోని ఈ ప్రత్యేకతను భిన్నత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఉంటే 1950వ దశకంలో లాగానే దార్శనికతతో నిర్ణయాలు తీసుకొని ఉండేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఇతర అంశాలలో ఎంతో దార్శనికుడిగా నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో హైకోర్టు ఏర్పాటు విషయంలో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. కేవలం ఒక వర్గ ప్రయోజనాలు, స్థిరాస్తి ప్రయోజనాలు ఈ నిర్ణయం చేయడంలో ప్రధాన పాత్ర వహించాయి. అంతవరకు విశాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నివురుగప్పి ఉన్న ఈ ప్రాంతీయ అంశాలు, అపోహలకు తెరతీశారు.
2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి ఈ అంశాన్ని సునిశితంగా దార్శనికత తో పరిష్కరించడానికి మరొక అవకాశం ఉండింది. ఆయన నిర్ణయాలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా సాగాయి. ఆయన కూడా తన సంకుచిత నిర్ణయాలతో ఈ విషయాన్ని మరింత జటిలం చేశారు. అప్పటికే అమరావతి నిర్మాణం మొదలై ఒక స్థాయికి వచ్చి ఉంది కాబట్టి, దాని స్థాయిని పూర్తిగా తగ్గించి మహా నగరం అనే భ్రమను తొలగించి పరిపాలనా రాజధానిగా కొనసాగించి, హైకోర్టు రాయలసీమకు తరలించడానికి కృషిచేసి, విశాఖ నగరాన్ని మహా నగరంగా రూపు దిద్దడానికి కార్యాచరణ మొదలుపెట్టి ఉంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికి ఉండేది. దీనికి భిన్నంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ఈ సమస్యను మరింత జటిలం చేశారు. మూడు రాజధానులు అనే విధానం ఎక్కడా లేదు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఏర్పాటయి ఉన్నది. దాని అర్థం ఆ నగరాలు న్యాయ రాజధానులు అవుతాయని కాదు. అలాగే శాసనసభ సమావేశాలు ఫలానా ప్రాంతంలో జరుగుతాయని అంటారు గాని దాని అర్థం అది శాసన రాజధాని అవుతుందని కాదు. విశాఖలో స్థిరాస్తుల ప్రయోజనాలు ఈనాటి రాజధాని వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు ఉన్నది.
దార్శనికత లోపించిన ఈ ఇరువురు నాయకుల యొక్క చర్యల వలన భవిష్యత్తులో ఆంధ్రజాతి పెద్ద మూల్యం చెల్లించుకున్నా ఆశ్చర్యం లేదు. రాజధాని అంశం ఒక క్లిష్టమైన అంశంగా ప్రాంతీయ వాదనలను రెచ్చగొట్టడానికి దోహదం చేసే విధంగా నడుస్తున్నది. ఈ అంశం భవిష్యత్తులో మూడు రాష్ట్రాల నినాదానికి నాంది పలికితే దానికి పూర్తి బాధ్యత రాజకీయ పరిణితి లోపించి నిర్ణయాలు తీసుకున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వహించాల్సి ఉంటుంది.