Wednesday, January 22, 2025

వలస చేప

ఎవరో ఒకరు

ఈ ఒంటరితనం గడిస్తే చాలు.

ఢిల్లీలో ఒక రోజు

ఆఫీస్ వారు రేపటి దాకా

మీటింగ్ లేదన్నారు.

తుపాకి పేలినట్టు

చెట్టు మీది పక్షులన్నీ

ఎక్కడికో ఎగిరి పొయ్యాయి

ఇవాళంతా గడిపేదెట్లా

ఇది అనుకోని శూన్యం.

ఎవరో ఒకరు

ఈ ఒంటరితనం గడిస్తే చాలు.

IIC Guest House

అందంగానే కాదు

సాదా సీదాగా

మర్యాదస్తుల నిలయంలా వుంటుంది.

ముఖ్యంగా క్యాంపస్ నిండా

గతంలో చూడని అపురూప పుష్పాలు,

గడ్డి కూడా నును లేత పచ్చని కాంతుల్తో.

రూము కిటికీ

ఓ కదిలే కవితలా వుంటుంది.

ఎవరో ఒకరు

ఈ ఒంటరితనం గడిస్తే చాలు.

చుట్టూ మబ్బులున్నా

ఏకాకిగా వెళ్తున్న

విమానంలా వుంది నా పరిస్థితి

ఎవరో ఒకరు

ఈ ఒంటరితనం గడిస్తే చాలు.

ఎవరైనా మిత్రునికి ఫోన్ చేస్తేనో!

అబ్బో! ఇది ఢిల్లీ

అనుకోని ఆహ్వానం విడ్డూరం

పైగా ఇక్కడివి గడ్డు దూరాలు

ఈ కాలం గుంటను

ఏ మట్టితో పూడ్చాలో తెలియదు.

దూరంగా ఓ కవి కనపడ్డాడు

మొదటిసారి షిల్లాంగ్‌లో చూశాను

అక్షరాలను మింగుతూ మాట్లాడుతున్నాడు,

అమ్మో! ఇతణ్ని తట్టుకోవడం కష్టం!

కాని ఎవరో ఒకరు

ఈ ఒంటరితనం గడిస్తే చాలు.

అయితే ఒకటి

ఈ సమయావరణం

పరమ కవితాత్మకంగా వుంది

ప్రతి చిన్న దృశ్యంలో కూడా

ఏదో ప్రత్యేకత దోబూచులాడుతున్నది.

నన్ను నేను స్పర్శిస్తున్నట్టు

మాహోల్ బహు సున్నితంగా మారింది.

క్రమంగా ఆ ఎవరో ఒకరు నేనే ఐ

ఒంటరితనం కరిగి పోతున్నది.

రెండు రోజుల తర్వాత

హైదరాబాద్‌లో విమానం దిగుతుంటే

కాల్వ లోంచి నది లోకి

నది లోంచి సముద్రం లోకి

వలస బోయిన చేప

మళ్లీ కాల్వ లోకి దూకి నట్టుగా వుంది.

Also read: చక్రం

Also read: అల్పాక్షరముల…

Also read: ముంబయిలో వర్షం

Also read: అంశిక

Also read: గాలి

Dr N.Gopi
Dr N.Gopi
ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles