మన పెద్దలు చెప్పినట్టు, ఒక నిజాన్ని కొంతకాలం అబద్దంగా చెప్పవచ్చు. నమ్మించనూవచ్చు. ఎంతోమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ ఒక అబద్ధాన్ని ఎప్పటికీ నిజం చేయలేము. అందర్నీ ఎల్లకాలమూ, ఎప్పటికీ మోసం చేయలేం. నిప్పులాంటి ‘నిక్కమైన’ నిజాన్ని, సత్యాన్ని ఎదుర్కోవడానికి ఎంతో ధైర్యం కావాలి. సత్యాన్ని ఎదుర్కోలేనివారే నిజమైన పిరికివాళ్ళు. కేవలం పిరికివారే అసత్యాన్ని, అబద్ధాలనీ ఆశ్రయిస్తారు. సత్యమే నిజమైన, అసలైన ‘ధైర్యం’. అసత్యమే పలాయనవాదం. పిరికివారే పలాయనవాదులు. అయోగ్యులు. అసమర్ధులు. అసత్యమే… పిరికితనం. పలాయనవాదమే “ఆత్మ-హత్య”. ఈ అయోగ్యులు, అసమర్ధులు, పిరికివారు, పలాయనవాదులు, జీవనానికీ, జీవనసమరానికి, సమాజానికీ, ఈప్రపంచానికీ ఎంతమాత్రం పనికిరారు. దీన్ని జీర్ణించుకోవడం నిజంగా చాలా కష్టం. కానీ ఇదే నిజం.
నిజం ఎంతో బాధపెడుతుంది. నిజం మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏన్నో కష్ట, నష్టాల్ని మనకు తెచ్చిపెడుతుంది. నిజాన్ని ఖచ్చితంగా జీవితాంతం నిలుపుకోండి. సత్యమే జీవితం. అసత్యమే మరణం. అసత్యాలతో, అబద్దాలతో, అత్మవంచనతో బతికే బతుకు అనుక్షణం అవమానకరం. ఆత్మహత్యాసదృశం. జీవన్మరణమే. మహాత్ముడు గీతాచార్యుడు చెప్పినట్టు “స్వధర్మే నిధనం శ్రేయహా… పరధర్మో భయావహాహా…!” దీని అర్థం “స్వధర్మం” అనేది ప్రతి మనిషీ ఆచరించవలసిన, అవలంబించాల్సిన ఒక అత్యంత ధర్మబద్ధమైన అవసరమైన విషయం… “పరధర్మం” అనుకరణ అనేది అత్యంత భయానకం. స్వధర్మం అంటే ప్రతి మనిషీ తను చేయాల్సిన, ఆచరించాల్సిన తమదైన తమ పని, తాము నిర్వర్తించాల్సిన ధర్మం. ప్రతి వ్యక్తి జన్మతః తను చేయాలనుకున్న, తమదైన ఒక టాలెంట్, తనదైన ఒక నైపుణ్యం కలిగివుంటారు. వాస్తవంగా “స్వధర్మం” అంటే తన విద్యుక్త ధర్మాన్ని తాము నిర్వర్తించవలసిఉంటారు. అది వదిలేసి, “పరధర్మాన్ని” అంటే ఇతరుల ధర్మాన్ని, ఇతరుల్ని అనుకరించి, వారితో పోల్చిచూసుకుని, ఇతరులు చేయాల్సిన, చేస్తున్న పనుల్ని దేనికోసమో తాము చేయటం, అచరింపబూనుకోవడం చాలా భయంకరం అని గీతాచార్యుడు బోధించాడు.
ఇదీ చదవండి: “అగ్నిశిఖలనెవ్వరూ ఆపలేరు…”
మహాత్ముడు గౌతమ బుద్ధుడు కూడా బౌద్ధమతంలో కోరిక, తృష్ణ మరియు అజ్ఞానం బాధ యొక్క మూలాలు అని పేర్కొన్నారు. ఒకరకంగా కోరికలు బాధలకు కారణహేతువులు, మూలాధారాలు అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కలియుగంలో మాత్రం “కంపారిజన్” అంటే ఒకరితో పోలిక, మరొకరితో పోల్చి చూసుకోవడం, ఇతరులను అనుకరించడం, వేరెవర్నో అనుసరిస్తూ తమ అస్తిత్వాన్ని పోగొట్టుకోవడం అనేవే సకల అనర్థాలకు, బాధలకు, దుఃఖాలకు ప్రధాన మూలం. ముఖ్య కారణహేతువు అని తెలుసుకోండి.
ఇదీ చదవండి: అసమ్మతి మన రాజ్యాంగహక్కు
మీ జీవితం మీది…వేరొకరిది కాదు…! వేరొకరి జీవితం వారిది. మీది కాదు…! ఎవరి జీవితం వారిది. ఒకరి జీవితానికి, జీవనవిధానానికి మరొకరితో ఎలాంటి పోలికా లేనే లేదు. అనుకరణ అవసరం అసలే లేదు. ఒకరితో పోల్చుకోవడం, అనుకరించడం, పోల్చి చూసుకోవడం అనేది ప్రేరణ వరకూ అయితే పర్లేదు. కానీ, అదే జీవితం కాదు. ఆత్మన్యూనత అసలే కాకూడదు. అది ఆత్మ హననానికీ, ‘అత్మ’హత్యకు దారితీస్తుంది. భౌతిక మరణమే “అత్మ హత్య” కాదు. మానసికంగా దిగజారడం కూడా ఒకరకమైన ‘అత్మ’హత్యే…!
జై హింద్ … భారత మాతకీ జై