లార్డ్ మెకాలే … ఈ పేరు వినగానే వెంటనే స్ఫురణకు వచ్చేది భారత దేశంలో ఆంగ్ల విద్యకు పునాది వేసిన వ్యక్తి. కానీ చాలా మందికి తెలియని విషయం… మెకాలే భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్ 1860) సృష్టికర్త అని. ఆయన లా కమిషన్ ఛైర్మన్ గా నేటికీ చెక్కుచెదరని మూల రూపం గల ఐ పి సి చిత్తు ప్రతి తయారు చేయబడిందని. 19వ శతాబ్దపు కవి, చరిత్రకారుడు, రాజనీతివేత్త, లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (1800 అక్టోబరు 25-1859 డిసెంబర్ 28) వర్థంతి సందర్భంగా, ఇండియన్ పీనల్ కోడ్ పూర్వాపరాలను తెలుసుకుందాం.
ఇండియన్ పీనల్ కోడ్ నిర్మాత
1830కి ముందు, భారతదేశంలో, ‘ది ఇంగ్లీష్ క్రిమినల్ లా’ అనేక చట్ట సవరణలతో నాటి ప్రెసిడెన్సీ టౌన్లు అయిన బొంబాయి, కలకత్తా, మద్రాసులలో అమలు జరిగేది. లార్డ్ మెకాలే, నాటి “ఫ్రెంచి పీనల్ కోడ్”, “లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా” అనే రెండు ప్రామాణిక గ్రంథాలను ఆదర్శంగా తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్ ‘చిత్తుప్రతి’ని తయారు చేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి ని, యాజ్ఞవల్క్య స్మృతిని, నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో ఆ నాటి పెద్దలు, పండితులు, రాజుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి. అయినా, తన అభిప్రాయాల కంటే, నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆచార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్సుతో ‘ఇండియన్ పీనల్ కోడ్’ చిత్తుప్రతి తయారు చేశాడు.
23 ఏళ్ళ తర్వాత వెలుగులోకి
ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ – కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. లార్డ్ మెకాలే తయారుచేసిన ‘చిత్తుప్రతి’ ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించాడు. అయన సుదీర్ఘ పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభ ఆమోదం పొందింది.
దీని మూలాలు ఆగ్లేయుల వలస పాలనలో
ఇండియన్ పీనల్ కోడ్ మూలాలు 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన 45వ చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి 1860 లో మొదటి లా కమిషన్ అజమాయిషిలో జరిగింది. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే). మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతీయ సమాజాలలోను, విద్యాపరంగా, వైజ్ఞానికంగా, అనేక రంగాలలో,అనేక రకాలుగా జరిగిన సమస్తమైన మార్పుల ప్రాతిపదికగా భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు, చేర్పులకు గురి అవుతూ, నేటి రూపాన్ని పొందింది.
గృహహింస, వరకట్నం ప్రత్యేక సమస్యలు
అందుకు గృహ హింస సెక్షన్ 498-ఎ ఒక ఉదాహరణగా తీసుకో వచ్చు. మన భారతీయ శిక్షాస్మృతిలో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం చట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, ఐరోపా, అమెరికా దేశాలలో లేదు కాబట్టి, వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షాస్మృతిలో లేవు. పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ను యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు “పాకిస్తాన్ పీనల్ కోడ్” (పి.పి.సి). బంగ్లాదేశ్ కూడా “బంగ్లాదేస్ పీనల్ కోడ్” పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్), మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా ఇండియన్ పీనల్ కోడ్ ను యధాతధంగా అమలు చేస్తున్నాయి.
దూరదృష్టి, అసాధారణ మేధ
ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్లో కూడా అమలులో ఉంది. కానీ, ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. “రన్‌బీర్ పీనల్ కోడ్” (ఆర్.పి.సి) అని పిలుస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే, 1859 డిసెంబరు 28 న తన 59వ ఏట మరణించిన క్రమంలో తన కృషి సాకారమై , చట్టమై, అమలు జరగటం చూడనే లేదు. నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు. 160 ఏళ్లల్లో మార్పులు ఎన్ని వచ్చినా, శిక్షాస్మృతి చెక్కు చెదరకుండా ఉన్నది అంటే మెకాలే దూరదృష్టి అమోఘం. మేధస్సు అద్భుతం. ఆయన కృషి అనితర సాధ్యం.
(డిసెంబర్ 28… లార్డ్ మెకాలే వర్ధంతి)