Monday, January 27, 2025

ముంచుకొస్తున్న మూడో కరోనా ముప్పు

కరోనా వైరస్ మానవాళికి సోకడం వెనకాల మానవ తప్పిదాలు ఉన్నట్లే, ఇంత మూల్యం చెల్లించుకుంటూ కూడా అలసత్వాన్ని ప్రదర్శించడం క్షమార్హమైన విషయం కాదు. స్వయం క్రమశిక్షణ పాటిస్తే చాలు, చాలావరకూ ముప్పు తప్పుతుందని నిపుణులు నెత్తినోరూ మొత్తుకుంటున్న వేళ, మళ్ళీ పాత తప్పులే చేస్తున్న సమాజాలను, చోద్యం చూస్తున్న వ్యవస్థలను ఏమనాలి అనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో కాంవడ్ యాత్రకు అనుమతి ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ అక్షింతలు వేసింది. ఈ జులై 25 నుంచి కాంవడ్ యాత్రకు యుపీ ప్రభుత్వం అనుమతులను మంజూరు చేయడం తాజాగా చర్చనీయాంశమైంది. శ్రావణమాసంలో పదిహేను రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. అందులో భాగంగా భక్తులు గంగానదీ జలాలను సేకరిస్తారు. కఠిన ఆంక్షల మధ్య పరిమిత సంఖ్యలో యాత్ర జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నా, వేలాదిమంది జమకూడే ఈ తంతులో భౌతిక దూరం పాటించడం సాధ్యమా, డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి భయకంపితం చేస్తున్న ఈ తరుణంలో అలసత్వాన్ని ఆనక ఆదుకునేది ఎవరు? ఈ ఉత్సవంతో ఉత్తరాఖండ్ కు కూడా అనుబంధం ఉంది. మూడో వేవ్ ముప్పుకు భయపడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంవడ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పక్క రాష్ట్ర నుంచైనా పాఠం నేర్చుకోవాల్సిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే నష్టపోయేది సామాన్య ప్రజ. న్యాయస్థానాలు రంగంలోకి దిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ ప్రభుత్వాలు మొద్దునిద్దురపోతుంటే ఎట్లా అని నిపుణులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతులను ఇచ్చాయి. జనసందోహం గుమిగూడే ప్రాంతాల విషయంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. దానికి మించి, ప్రజలు స్వయం క్రమశిక్షణ పాటించాలి.

Also read: బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో యువతకు ప్రాధాన్యం

ప్రధాని హెచ్చరికలూ బేఖాతరా?

మూడో వేవ్, డెల్ట్లా ప్లస్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం పదే పదే అటు ప్రభుత్వాలను – ఇటు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ మొదలైన చోట్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అధికార బిజెపి మొదలు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం పేరిట విశృంఖలంగా ప్రవర్తించాయి. మొన్న జరిగిన కుంభమేళా కూడా అదే తీరులో నడిచింది. హరిద్వార్ లోని పవిత్ర గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని, పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారనే విశ్వాసాల నడుమ కోవిడ్ వ్యాప్తి భయాన్ని మరచి, వేలాదిమంది జలకాలాడారు. ఆ విధంగా  కరోనా ఉధృతికి  కారకులయ్యారు. స్నానం చేయడం వల్ల పాపం పోయిందో లేదో తెలియదు కానీ మళ్ళీ మరో పెద్దపాపం చేశారు. ఈ పాపంలో  అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలదే పెద్దవాటా. గతంలో వలె కాక, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాంవడ్ యాత్రను రద్దు చేశారు. అందుకు ఆయనను అభినందించాలి. లాక్ డౌన్ సడలింపుల వేళ, తాజాగా మళ్ళీ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. కేరళలో పరిణామాలు మళ్ళీ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో రమారామి 76శాతం కేసులు కేరళ,మహారాష్ట్ర, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దేశంలోని 58 జిల్లాల్లో 10శాతం పైగా పాజిటివిటీ నడుస్తోంది. నైనిటాల్, కులుమనాలి మొదలైన పర్యాటక ప్రాంతలకు  అనుమతులు వచ్చేశాయి. అక్కడ కూడా సందర్శకుల తాకిడి పెరిగేలా ఉంది.

Also read: విశాఖ ఉక్కు: రాజకీయనేతల వైఫల్యం

వాక్సినేషన్ లో వెనకపడుతున్నాం

ప్రస్తుతం వ్యాక్సిన్ ను అత్యంత రక్షణా కవచంగా ప్రచారం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరిట ప్రక్రియను వేగవంతంగా నడుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రతిన పూనింది. కొన్నాళ్ళు కాస్త హడావిడి జరిగినా, ప్రస్తుతం మళ్ళీ పలచబడిందని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు రోజుకు సగటున 62లక్షలమందికి వ్యాక్సిన్ ను అందించారు. అది ఇప్పుడు 35-40 లక్షలకు పడిపోయింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు కేవలం 7.7 శాతం మంది మాత్రమే. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం. ఆ లోపు అన్ని డోసుల వ్యాక్సిన్ అందినవారి సంఖ్య గణనీయంగా పెరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) హెచ్చరిస్తోంది. డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తామని పాలక పెద్దలు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న వేగాన్ని గమనిస్తే పాలకుల మాటలు ఆచరణలో నిలబడేనా  అనే అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా కబంధ హస్తాల నుంచి ప్రజలను విముక్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మూడో వేవ్ ముప్పు నుంచి ప్రజలను రక్షించడం వారి పనే.అనుమతులు మంజూరు చేసే దశలో ఆచితూచి అడుగు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. స్వయం క్రమశిక్షణ ప్రజల చేతుల్లోనే ఉంది.మూడో ముప్పు నుంచి తప్పించుకోవడంలో అందరూ కలిసి సాగాల్సిందే.

Also read: అల్లకల్లోలం దిశగా ఆఫ్ఘానిస్థాన్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles