వోలేటి దివాకర్
భారతదేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు స్వామి రామానుజులని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. 10వ శతాబ్దంలోనే ఆయన సోషలిస్టు భావాలతో గురువు తనకు మాత్రమే ఉపదేశించిన తారకమంత్రాన్ని ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఎలుగెత్తి చాటారన్నారు. కమ్యూనిస్టుగా తన ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రజాగాయకుడు గద్దర్ కూడా అదే భావనతో జీవిత చరమాంకంలో ముచ్చింతల్లోని శ్రీరామానుజ స్వామి వారిని దర్శించుకుని ఉండవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఉండవల్లి పుస్తక కేంద్రం మిత్రుల ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు నక్కా శ్రీనగేష్ నిర్వహణలో శుక్రవారం గద్దర్ సంస్మరణ సభ పుస్తక కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా నివాళులర్పించారు. గద్దర్ చిత్రపటానికి దండలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమంలో ఉండవల్లి సహా వామపక్షాలతో, వివిధ పార్టీలు, పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
గద్దర్ సంస్మరణ సభలో ఉండవల్లి మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడిన గద్దర్ నిజమైన కమ్యూనిస్టు అని అభివర్ణించారు. పెచ్చుమీరుతున్న మతతత్వ పాలనను గమనించి దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని కోరుకున్న సెక్యులరిస్టు అని కొనియాడారు. అందుకే ఆయన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుని, పరోక్షంగా ఆయనకు మద్దతు ప్రకటించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక కేంద్రం రాజమహేంద్రవరంలో గద్దర్ వంటి ప్రజాగాయకుడ్ని స్మరించుకోకపోతే ఇక్కడి ప్రజల్లో ఏదో తేడా ఉందని భావించే అవకాశం ఉండేదన్నారు.
ప్రసిద్ధి సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మ మాట్లాడుతూ తాను గౌతమీ గ్రంథాలయంలో పనిచేసే సమయంలో తనను చూసేందుకు గద్దర్ వచ్చానని చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయానన్నారు. గద్దర్ ను తెలుగు రాష్ట్రాలకు, దేశానికి పరిమితం చేయరాదని, ఆయన ప్రపంచ స్థాయి ప్రవచనకారుడు, వాగ్గేయకారుడని అభివర్ణించారు. సాహితీవేత్త, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావుతో కలిసి ఒకసారి గద్దర్ తోపాటు భోజనం చేసే అవకాశం లభించిందని శర్మ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు సిహెచ్ఎం కృష్ణారావు మృతి పట్ల కూడా సభలో సంతాపం ప్రకటించారు.