Sunday, December 22, 2024

సునామీలపై అవగాహన అవసరం

సునామీలు అరుదుగా సంభవిస్తాయి. వస్తే మాత్రం మానవాళికి అమితంగా నష్టం చేకూరుస్తాయి. క్షణాల్లో ప్రాణాలను   కబళిస్తాయి. ఊరూవాడ మొత్తాన్ని ఏకం చేస్తాయి. భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టానికి కారణ భూతాలు అవుతాయి. సునామీ లపై ప్రజలలో అవగాహన స్థాయి పెంచేందుకు ప్రతియేటా నవంబర్‌ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. క్రీ.పూ. 426 ఆరంభంలో  గ్రీకు చరిత్ర కారుడు తుసైదిదేస్  తన పుస్తకం పెలిపొంనేసియన్ యుద్ధ చరిత్రలో సునామి కలుగచేసే కారణముల గురించి చర్చించి, అవి భూకంపం వల్లే సంభవిస్తాయని చెప్పాడు.

ప్రపంచ వ్యాప్తంగా వందేళ్లలో 58 సునామీలు సంభవించాయి. రెండున్నర లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2004లో వచ్చిన సునామీతో సుమారు 2,40,000 మంది వరకు అసువులు బాసారు. మరో 48,000 మంది కనిపించకుండా పోయిన విషయం విదితమే. ఈ సునామీ 14దేశాల వారిని ప్రభావితం చేసింది. అంతకు ముందు 1960 మేలోనూ, 1945 నవంబర్‌లోనూ సునామీలు సంభవించాయి.

జపాన్ రైతు అసాధారణ ప్రేరణ

జపాన్ కు చెందిన గోహి అనే రైతు 1985లో సముద్రం వెనక్కి వెళ్లడాన్ని గుర్తించాడు. శబ్ద తరంగాల్లో మార్పును గమనించాడు. దీంతో సునామీ రాబోతుందని గుర్తించాడు. ప్రజలకు హెచ్చరిక చేయడానికి తన వరిపొలం మొత్తాన్ని తగుల బెట్టాడు. ఈ మంటల ద్వారా ప్రజలు రానున్న ఉపద్రవాన్ని గుర్తిస్తారని భావించి రైతు  ప్రజల ప్రాణరక్షణకు పూనుకున్నాడు. ఇలా ఆయన ప్రేరణతో “వరల్డ్ సునామీ అవేర్నెస్ డే” వచ్చింది. అప్పటి వరకు సునామీపై ముందస్తు సమాచారం అందించే కేంద్రం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహా సముద్ర సమాచార సేవలు అందుతుండడంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005 నుంచి 2007 వరకు ఆపరేషన్ ప్రక్రియ కొనసాగింది. 2007లో పూర్తి స్థాయిలో “ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టం” కేంద్రంగా అవతరించింది. మత్స్యకారులకు ఉపయోగకర సేవల కోసం హైదరాబాద్ లో 1999లో ప్రగతినగర్ సమీపంలో పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది.

సునామీ ముందు భూప్రకంపణ

సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్ కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్ కు చేరుతుంది. ఆ తర్వాత భూకంపం ప్రభావంతో సునామీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టి సారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కి.మీ దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. సునామీ అన్న పదం జపనీస్‌ భాషకు చెందింది. హార్బర్‌ కెరటం అని దీని అర్థం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి.

సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్‌ విమానం స్పీడ్‌తో ఇది సమానం. ప్రపంచంలో జపాన్‌ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పు మరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది.

హైద‌రాబాద్‌లో సునామీ హెచ్చ‌రిక కేంద్రం ఇంకాయిస్‌

హిందూ మహాసముద్రంతో అనుబంధంగా ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన హైదరాబాద్ నుంచే వెళ్తుంటాయని  చాలా మందికి తెలియని విషయం.  సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక.. సముద్రపు అలల ఎత్తు.. వేగం.. వాటి తీవ్రత ఏమేర ఉంటుందో నిమిషాల్లో భారత్ తో పాటు ఆయా దేశాలకు చేరవేసే ‘విజ్ఞాన వాహిని’ భాగ్యనగర సొంతమనే విషయం గర్వకారణం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢ విల్లుతోంది. ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్ లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి వారికి చేరవేసే కేంద్రంగా మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలానికి “ఓషియన్ స్టేట్ పోర్కాస్ట్ సేవలను” ప్రారంభించింది. సముద్ర భాగంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందించే సేవలకు అంకురార్పణ చేసింది. సునామీ, సముద్ర విపత్తులపై ఇంకాయిస్ విస్తృతమైన అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సునామీ మాక్ డ్రిల్స్  నిర్వహిస్తున్నారు. సునామీ వచ్చే సమయంలో సంకేతాలు ఏవిధంగా ఉంటాయి, ప్రకృతి పరంగా జరిగే మార్పులు, ప్రమాదం నుంచి బయట పడేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.

దేశాల‌కు స‌ల‌హాలు ఇక్క‌డి నుంచే..

ఆయా ఆధునిక పరికరాల ద్వారా సునామీ రాకను గుర్తించడమే కాకుండా తీరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది, ఎంత ఎత్తులో కెరటాలు వస్తాయి, దాని తీవ్రత ఏమేర ఉంటుందో ఇంకాయిస్ అంచనా వేస్తుంది. అలా సేకరించిన సమాచారాన్ని జిల్లా స్థాయిలో ఉండే డిస్ట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, రాష్ట్ర స్థాయిలో ఉండే ఎస్ఈఓసీ (స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్), జాతీయ స్థాయిలో ఉండే ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ), ఎంహెచ్ఏ (మినిస్ట్రీ ఆఫ్ హోం సైన్సెస్)లకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడు స్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తుంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది.

(ప్రపంచ సునామీ అవగాహన దినం సందర్భంగా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles