భగవద్గీత–103
సూర్యోదయమయ్యింది. నా గది లోపల నీలిరంగు పరుచుకున్నది. సూర్యభగవానుడి కిరణాలు నా గది కిటికీకున్న నీలపు రంగు అద్దాలలోనుండివస్తూ తాముకూడా నీలిరంగు సంతరించుకున్నాయి.
బయటకు వెళ్ళి చూశాను. కిరణాలరంగు తెలుపే. ఏదో ఆలోచన తళుక్కున మదిలో మెదిలింది. అవునూ… దేవుడిని, ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని, ఈ మనుషులను ఎన్ని రంగు కళ్ళాద్దాలలోనుంచి చూస్తున్నామో కదా!
Also read: గీతలో హేతువాదం, నైతికత, ఆధ్యాత్మికత
భూమికి ఊహాజనిత హద్దులు గీసి వాటిని దేశాలంటున్నాము, మన స్థలాలంటున్నాము. సమాజాన్ని మతము అనే అద్దంలో, భాష అనే అద్దంలోనుంచి చూస్తున్నాము.
మనుషులను కులమనే అద్దం, మతమనే అద్దం, ప్రాంతము అనే అద్దం, అధికారము అనే అద్దం, పాలకుడు పాలితుడు అనే అద్దం, సేవకుడు యజమాని అద్దం. ఇలా ఎన్ని అద్దాలో…
ఇక భగవంతుడు ఉన్నాడు అనేది అన్ని మతాలు ఒప్పుకునే సత్యమే. ఆయన మనలను సృష్టించాడని అన్ని మతాలవారూ నిర్ద్వంద్వంగా ఒప్పుకుంటున్నారు.
కానీ…
ఆయన సాకారుడా? నిరాకారుడా? మళ్ళా ఈ అద్దాలు తొడుక్కొని చూస్తున్నాము. ఆయనకొకరూపమున్నదా? లేదా? ఇన్ని ఆకారాలు సృష్టించిన వాడు తానొక ఆకారాన్ని ధరించి అందులో ఒదిగిపోలేడా. ఆయన యెహోవానా, ఆయన అల్లానా, ఆయన బ్రహ్మమా?
Also read: అర్జునుడిని యోగివి కమ్మంటాడు పరమాత్మ
మామిడికాయను తెలుగువారు మామిడి అని, హిందీవారు ఆమ్ అనీ, ఇంగ్లీషువారు మ్యాంగో అనీ ఏ భాషవాడు ఆ భాషలో పిలుస్తాడు. అలాగే దేవుడిని కూడా. ఓహ్! లెక్కలేనన్ని రంగుకళ్ళద్దాలమాటున ప్రపంచాన్ని చూస్తున్నాము.
ఎలాగైతే గదినిదాటి బయటకెళ్ళిచూస్తే సూర్యకిరణాలరంగు తెల్లగా అంతటా ఒకే రకంగా కనపడుతుందో, అలాగే మన అంతరంగంలోకి ప్రయాణంచేస్తే అనంతుడు కనపడతాడు. కావలసినది ప్రయాణం చేయగల ఓర్పు నేర్పు మాత్రమే.
భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పినది ఇదే కదా!
‘‘ఏకమ్ సద్విప్రా బహుధావదంతి ‘‘ There are not many Gods. But, there are many ways to think about God. ఏకమ్ సత్ – సత్యమొక్కటే.
విప్రా బహుధా వదంతి – జ్ఞానులు రకరకాలుగా దానిని చెపుతారు. జ్ఞానం అనేది మనం తొడుక్కునే రంగు కళ్ళద్దాలలాంటిది. ఓమ్ ఇతి ఏకః అక్షరం బ్రహ్ము అక్షరం అంటే నాశనము కానిది. అది బ్రహ్మము మాత్రమే తక్కిన కనపడేవన్నీ నాశనమయ్యేవే.
Also read: ఒత్తిడి లేని బతుకుకోసం భగవద్గీత!
(సమాప్తం)