భారతదేశం అంటే పాములు పట్టే వారున్న దేశము అని తక్కువగా చూసేవారు! అది శాస్త్రం కాదన్నట్లుగా.
కానీ అత్యంత భయంకరమైన ప్రాణాంతకమైన పామును ఒడిసిపట్టి బుట్టలో పెట్టగలగటం అందరికీ వస్తుందా ? ఆ టెక్నిక్ అందరికీ తెలుసా ? నేర్పే వారున్నా అభ్యసించే సాహసం చేసేవారెందరు ? ప్రకృతిని ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడమే కదా శాస్త్రీయ మంటే! మా పెద్దమనవడికి కార్టూన్ సినిమాలు చూపుతుంది మా అమ్మాయి. అందులో లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ అంటూ కొన్ని ఇటుకలు పేరుస్తుంటే పడిపోయేటట్లు చూపుతూ ఒక నిర్దిష్టమైన అమరికలో మాత్రమే అవి నిలబడి దృఢంగా ఉన్నట్లు చూపుతారు ! అది భౌతికశాస్త్రాన్ని అధ్యయనం చేసినవారికి తెలుస్తుంది ! మరి వేల ఏళ్ళ క్రింద కట్టిన మన దేవాలయాల్లోని పెద్దపెద్ద రాతి అమరికలు చూడండి ! ఇన్నాళ్ళకు కూడా చెక్కుచెదరకుండా భూకంపాలను కూడా తట్టుకుని నిలబడ్డాయి అంటే భారతీయుడికి భౌతికశాస్త్రము ,సివిల్ ఇంజనీరింగ్ ల మీద పట్టు ఉన్నట్లే కదా ! బృహదీశ్వర ఆలయం ఒక్కసారి పరిశీలనగా ఆ దృష్టితో చూడండి అర్ధమవుతుంది!
ఈ మధ్యనే F.B. లో అత్యంత ప్రమాదకరమైన విషవృక్షాలతో నిండిన ఒక Dangerous పార్కు U.K లో ఉన్నట్లుగా చూశాను ! ఒక చెట్టు ఆకు కానీ ,కాయగానీ ప్రాణాలు తీసేటంత ప్రమాదకరమైనవి సృష్టిలో ఉన్నాయని కదా దాని అర్ధం ! ఉదాహరణకు గన్నేరు చెట్టు!
మరి చెట్లు ప్రాణం తీసేవి సృష్టిలో ఉన్నప్పుడు ప్రాణం నిలిపేవి కూడా ఉన్నాయి అనే కదా అర్ధం ! అలా ప్రాణం నిలిపే చెట్లను ఏ చెట్టు మన శరీరంలో ఏ బాధను నివారిస్తుందో తెలుసుకోవడం అధ్యయనం కాదా ? అది శాస్త్రీయం కాదా ? అమృతవల్లి కి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా ? అదేనండీ తిప్పతీగ ! ఎన్ని రోగాల నుండి మనలను కాపాడుతుందో!
కరోనా సమయంలో దగ్గునుండి ఉపశమనం పొందటానికి కరక్కాయ చిన్న ముక్కను బుగ్గన పెట్టుకున్న వారెందరో!
మనం తినే ఆహారం కలుగచేసే ఇబ్బందులను అధ్యయనం చేసి అవి పోవడానికి అల్లం ,వెల్లుల్లి ,జిలకర్ర,ఆవాలు,మెంతులు,ఇంగువ ఇలా పొట్టలో గ్యాసును తదితర వ్యాధులను నయం చేసే గుణమున్న పదార్ధాలను పోపులపెట్టెలోకి తెచ్చిన భారతీయుడికి శాస్త్రీయ దృక్పథం లేదా ?
ప్లాస్టిక్ క్యాన్సర్ కారకం అని పదేపదే పేపర్లలో వార్తలు చూస్తున్నాం ! కానీ పొద్దునే ప్లాస్టిక్ బ్రష్షుతో పండ్లు తోముకోవడం మానలేకపోతున్నాం ఎంతో కొంత అతిసూక్ష్మమైన ప్లాస్టిక్ పదార్ధం మన కడుపులోకి పోవడం లేదని గ్యారంటీ ఏమిటి ? ఏ అలవాట్లలేని వారికి క్యాన్సర్ వస్తున్నదే అని ఆశ్చర్యపడనక్కరలేదు ! ఈ అలవాటు ఒక్కటి చాలదా ! ప్రతిరోజూ అందరమూ చేసే పనేకదా ఇది ! చక్కటి ఆరోగ్యకరమైన క్రిమిసంహారణివేప, మౌత్ ఫ్రషెనర్ గానుగ ,కంది పుల్లలను ,పొట్టలో గ్యాసును తగ్గించే ఛార్ కోల్ ( బొగ్గు ) వీటితో పళ్ళు తోముకున్న ఒకప్పటి భారతీయుడు శాస్త్రీయజీవనం గడిపాడా ! లేక ప్లాస్టిక్ బ్రష్ లు ,పనికిరాని సుద్దపేష్టుల ఆధునిక భారతీయుడి జీవనం శాస్త్రీయమా ??
కాళ్ళకు ముఖానికి పసుపు రాసుకునే పడతులేరి నేడు? ఉన్నా అతి తక్కువ! పసుపు క్రిమిసంహారిణి క్యాన్సర్ నిరోధిస్తుంది అని చెప్పిన ఆధునికుడికంటే వేల ఏళ్ళముందే పసుపును నిత్యజీవనంలో వాడకంలో ప్రవేశపెట్టిన భారతీయుడు శాస్త్రవేత్త కాదా? పైగా చెంచాడు పసుపు పాలలో కలుపుకొని అమెరికావాడు గోల్డెన్ మిల్క్ అని తాగుతున్నాడు కాబట్టి మనమూ తాగాలని బయలుదేరే బ్యాచ్ ని చూస్తున్నాము. పసుపు చిటికెడు మించి వాడితే వేడి చేస్తుంది అని చెప్పినా వినరు!
..
ఎన్నెన్నో మూలికలు వాటి ప్రయోజనాలు పరిశీలించి పరిశోధించిన భారతీయుడు శాస్త్రవేత్తకాదా?
బృహదీశ్వరాలయం, తమిళనాడులో చోళులు నిర్మించిన ఆనకట్టలు భారతీయుడు గొప్ప సివిల్ ఇంజనీర్ అని ఋజువుకాదా!
ఆభరాణాలు కత్తులు ఖడ్గాలు ఎప్పుడో తయారుచేశారు కదా! గనిలో తవ్వకుండా అవిలభ్యం కావు కదా! అంటే మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జీ,కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ని తెలుసనే కదా!
గ్రహగతులు లెక్కపెట్టడం తెలిసింది అంటే గణితం ఖగోళవిజ్ఞానాల మేళవింపు తెలిసినవాడనేకదా భారతీయుడు.
వంట ఇంటినుండి వ్యవసాయక్షేత్రం దాకా ప్రతి క్షేత్రంలో శాస్త్రీయతే!
వరాహమిహిరుడి బృహత్సంహిత చదివితే తెలుస్తుంది సహజఎరువులు, పురుగుమందులతయారీ తెలుసునని.
ఇంత శాస్త్రీయ అవగాహనతో జీవించారు నా పూర్వీకులు.
గ్రహణం రోజు బయటకొచ్చి సమయంకాని సమయంలో భోజనం చేసి శాస్త్రీయ అవగాహన పెంపొందాలి అని అరుపులు పెడబొబ్బలు పెట్టడం మాత్రం శాస్త్రీయం కాదు!!!
వూటుకూరు జానకిరామారావు