- పార్టీ వద్దని నచ్చజెప్పాం
- వైఎస్ కుటుంబానికి పదవులు కొత్త కాదు
- కష్ట, నష్టాలు భరించాల్సింది షర్మిలే
పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. లోటస్ పాండ్ లో ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల నుద్దేశించి సజ్జల మీడియా సమావేశంలో స్పష్టత నిచ్చారు. షర్మిల తమ సోదరి అని పార్టీ పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముందే తెలుసని వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ పెడితే జరిగే కష్ట నష్టాల గురించి వివరించామని పరిమితుల గురించి చెప్పామని అన్నారు. అయితే పార్టీ పెట్టాలని ఆమె తీసుకున్న నిర్ణయానికి కట్టుబడేఉన్నారని స్పష్టం చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు లేవన్న సజ్జల తెలంగాణలో పార్టీ నిర్ణయం దాని పర్యవసనాలను షర్మిలే చూసుకుంటారని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని సజ్జల స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం
పదవులు కొత్త కాదు :
షర్మిలను పార్టీలో ఎదగనీయలేదని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబానికి పదవులు కొత్త కాదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీ లో ఆమెకు పదవులు కట్టబెడితే పార్టీ కుటుంబ పాలన అనీ వారసత్వ రాజకీయాలంటూ ప్రతిపక్షాలు విమర్శించేవని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పెడుతున్న పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కి సంబంధం లేదని సజ్జల తెలిపారు. షర్మిల పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసని వ్యాఖ్యలు ఇపుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.