ఏ పార్టీలోనైనా చిన్న చిన్న విభేదాలు, గ్రూపులు ఉండడం సహజమనీ, అలాగే వైసీపీలో కూడా ఉన్నాయనీ, అయితే వాటిని సమన్వయం చేసి, అందరినీ పార్టీ విజయానికి కృషిచేసేలా చేస్తామని వైసిపి రాజమహేంద్రవరం నగర కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్పారు. పార్టీలో అందరినీ సమన్వయ పరిచి, వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు. సిటీ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సిటీలో నాయకుల మధ్య సమన్వయం సాధించాలని చెప్పారని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక వైద్యుడు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ప్రజలకు మేలు చేయవచ్చో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. వైసిపిలోకి చేరిందే తడవుగా పార్టీ సిటీ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారని ఆయన పేర్కొంటూ, తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు.
Also read: అందుకే పోలవరం నిధులు ఆపేశారు: పురందేశ్వరి వ్యాఖ్య
ఇప్పటికే గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వార్డుల్లోకి వెళ్ళినపుడు ప్రజలు సాదరంగా ఆహ్వానించారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ ని గెలిపించి మరోసారి సీఎం చేస్తామని అంటున్నారని డాక్టర్ గూడూరి చెప్పారు. ఇప్పటికే చాలామందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంకా ఎక్కడైనా అందకపోతే వాటిని సరిచేసి, పథకాలు అందేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. రాజమండ్రిలో డ్రైనేజి వ్యవస్థ , పారిశుధ్యం మరింత మెరుగు పర్చడం లక్ష్యమని ఆయన చెప్పారు.
శుక్రవారం పార్టీ కార్యాలయ ప్రారంభానికి వైసిపి జిల్లా అధ్యక్షుడు , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్ రామ్, బిసి జేఏసీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు హాజరవుతారని ఆయన తెలిపారు.
Also read: పిల్లికి పెద్ద పీట సరిపోలేదట!…కొడుకు కోసం పిల్లి రాజకీయ గిల్లుడు!