Tuesday, January 21, 2025

ఆకర్షణ సిద్ధాంతమా!

ఫొటో రైటప్: ద సీక్రెట్, రచయిత్రి రొండా బైర్న్

సంపద సృష్టిద్దాం – 04

చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాలలో చదువుతున్న శక్తి నియమాలు మనకు బాగా తెలిసినవే. ఈ విశ్వంలో ప్రతీదీ పదార్దం (మేటర్)తో తయారవుతుంది. ప్రతి పదార్దమూ శక్తి రూపమే. శక్తిని కొత్తగా సృష్టించలేము. ఉన్న శక్తిని నాశనం చేయలేం. కేవలం ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చగలం. అంతే. ఈ విశ్వమంతా ఉండేది ఒకే శక్తి. మనమంతా అదే శక్తితో తయారయ్యాం. మనమే కాదు, మనం చూస్తున్న ప్రతి వస్తువూ అదే శక్తితో తయారయింది. ఇవి చాలా ప్రాథమిక విషయాలు. ఈ విశ్వంలో ఏ వస్తువూ నిలకడగా ఉండదు. తనకున్న శక్తిమేర కదులుతుంటుంది. కొన్ని శక్తిమంతంగా, కొన్ని శక్తిహీనంగా కంపిస్తూనే ఉంటాయి. ఆ కంపనానికి ఒక పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఉంటుంది. అంటే మనందరికీ ఒక ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా, మొబైల్ నెంబరున్నట్టుగా ప్రతి వస్తువుకూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందన్న మాట. ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్న వస్తువులు ఒకదానిని ఒకటి ఆకర్షించుకుంటాయి. ఇదే ఆకర్షణ సిద్ధాంతం. మనకు డబ్బు కావాలనుకుంటే డబ్బు ఫ్రీక్వెన్సీ తెలుసుకుని, మనల్ని మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకుంటే చాలు. ఎంత కావాలనుకుంటే అంత డబ్బును సొంతం చేసుకోవచ్చన్న మాట.

Also read: అంతా మన మనసులోనే…

అప్పటికే ఉన్నట్టు..

అంటే మనకు కావలసిన వస్తువు ఫ్రీక్వెన్సీ తెలుసుకుని, అదే ఫ్రీక్వెన్సీని మనం పొందితే ఆ వస్తువును పొందుతామన్న మాట. ఇందులో చాలా కీలకమైన విషయం ఏమంటే, మనం అవతలి వస్తువు ఫ్రీక్వెన్సీని ఏమీ చేయలేం. కేవలం మన ఫ్రీక్వెన్సీని మాత్రమే మనం మార్చుకోగలం. ఏదైనా సాధించగలం. అందువల్ల ముందుగా మన ఫ్రీక్వెన్సీ ఏమిటో మనం తెలుసుకోవాలి. మన శక్తి వైబ్రేషన్ ను నాలుగు అంశాలు తయారుచేస్తాయి. అవి మన భావాలు (ఫీలింగ్స్), ఆలోచనలు (థాట్స్), విశ్వాసాలు (బిలీఫ్స్), పనులు (ఏక్షన్స్). వీటిని ఎంత సానుకూలంగా ఉంచితే అంత హై పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అలవడుతుంది. మన లక్ష్యం ఉన్న ఫ్రీక్వెన్సీకి మనల్ని చేర్చడానికి సాధనం మనం ‘ అప్పటికే లక్ష్యాన్ని సాధించినట్టుగా’ భావాలు, ఆలోచనలు, నమ్మకాలు, పనులను కలిగివుండడం. మనం కొత్త కారు కావాలనుకుంటే, అప్పటికే కారు ఉన్నట్టుగా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు, పనులను ప్రదర్శించడం. కొత్త ఇల్లు కొనాలనుకున్నా అంతే. కొత్త బంధాన్ని నిలుపుకోవాలన్నా అంతే. ఏది కావాలను కుంటున్నావో.. దానిని ఆల్రెడీ మీరు పొందినట్టుగా, సాధించినట్టుగా, సొంతం చేసుకున్నట్టుగా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు, పనులలో వ్యక్తం చేస్తుండడం. కొంత అతిగా కనిపించినప్పటికీ, మరో మార్గం లేనట్టుగా చేస్తే చాలు.

బుద్ధ భగవానుడు ఇచ్చిన అనేక సందేశాల్లో ఒక విలువైన సందేశం ఇది. “నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు. నువ్వు ఏది ఫీల్ అవుతావో దానిని ఆకర్షిస్తావు. నువ్వు ఏది ఊహిస్తావో దానిని సృష్టిస్తావు” చిన్నప్పుడే మనకో కథను సిద్ధం చేశారు. అదే అల్లావుద్దీన్ అద్భుతదీపం కథ. ఎక్కడో ఎడారిలో పాతాళంలో దొరికిన పురాతన దీపపు సిమ్మెను రుద్దినపుడు అందులోంచి ఒక జినీ వచ్చి తనను ఆ చెరనుంచి విడిపించినందుకు మూడు కోరికలు తీరుస్తాడు. అలాంటి అద్భుత దీపం నిజజీవితంలో ఉండదనుకుంటాం కదా! అది మన కళ్లెదురుగానే ఉంది. అదే ఈ అనంత విశ్వం. గట్టిగా మనసులో కోరుకుంటే చాలు మూడు కాదు మూడు వేల కోరికలయినా తీరుస్తూనే ఉంటుంది. మనం అడగడమే తరువాయి. విశ్వం మన ప్రతి ఆజ్ఞను శిరసావహిస్తుంది. మీరు కోరుకునేది సిద్దించడానికి మూడు సులభమైన సోపానాలు. అడగడం, నమ్మడం, పొందడం. విశ్వాన్ని అడగడం అంటే మన మనసుకే స్పష్టంగా తెలియజేయడం. నమ్మడం అంటే స్వామిజీ వర్షం తెప్పిస్తానని కొండ వద్దకు రమ్మని చెప్పినప్పుడు, గ్రామ ప్రజలు ఎవరూ గొడుగు పట్టుకుని వెళ్లలేదు. అంటే వారు నమ్మలేదు. మీరు కోరుకున్నది అప్పటికే పొందారని విశ్వసించడమే నమ్మకం.

Also read: పోరాటంలోనే విజయం

అడుగు – నమ్ము – పొందు

ఉదాహరణకు మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు. మన దృష్టిని ‘బరువును కోల్పోవడం’లో లగ్నం చేసినంత కాలమూ మన కోరిక తీరదు. మనం తగ్గాలనుకుంటున్న బరువు గురించిన పూర్తి స్పష్టత ఉండడమే విశ్వాన్ని అడగడం. మన కోరిక తీరిన తరువాత మనమెంత బరువు తగ్గి, స్వేచ్ఛగా హాయిగా ఉంటామో అలా ప్రవర్తించడమే విశ్వాన్ని నమ్మడం. దానికోసం ఎంత తినాలో, ఏం తినాలో, ఏం చేయాలో మాత్రమే కాక ఏమేమి తినకూడదో, ఏమేం చేయకూడదో పూర్తి స్పష్టత కలిగివుంటాం.

అనతికాలంలో మరో కొత్త మీరు తయారవడం ఖాయం. అప్పు తీర్చే విషయమూ అంతే. అప్పు గురించి ఆలోచిస్తున్నంత సేపూ మన అప్పు పీడ పోదు. ‘‘అప్పు తీర్చడం”పై దృష్టి కేంద్రీకరించకండి. అప్పు తీర్చేసిన తరువాత మనకు లభించే స్వేచ్ఛ గురించి, అప్పుడు మనకొచ్చే ప్రతి రూపాయి ఎంత విలువైందో, ఎంత విలాసవంతమైనదో దాని గురించి మాత్రమే ఆలోచించండి. అప్పులేని జీవితాన్ని ఊహించాలి. అదే విశ్వాన్ని నమ్మడం. రుణభారం ఏర్పడడానికి కారణాలు, ఆదాయం వస్తుందని చేసిన రుణం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి అప్పు ఊబిగా మారడం, పెరుగుతున్న వడ్డీలు మన అసలు ఆదాయాన్ని దోచుకోవడం, మొదలైన విషయాలను కూలంకషంగా ఆలోచించండి.

తప్పక చేయండి: రోండా బైర్న్ ఒక రచయిత్రి. కొన్ని వేల సంవత్సాలుగా నిగూఢంగా ఉండిపోయిన ఈ ‘ఆకర్షణ రహస్యాన్ని తన టీవీ సినిమా ద్వారా, “ది సీక్రెట్” అనే పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఈ ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో అనువాదమైంది. మీకు తోచిన భాషలో ఆ పుస్తకం తెప్పించుకుని ఒకటికి రెండుసార్లు చదవండి.

Also read: కృతజ్ఞత చెప్తున్నారా!?

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles