ఆడపిల్ల అంటేనే అదృష్టం….అమావాస్య రోజు పుడితే చాలు బంగారు బుట్టలో పడ్డట్టే అంటారు! బుట్ట అంటే మెట్టిల్లు! పుట్టింట్లో కష్టాలు లేకుండా పెంచిన అమ్మాయి అత్తారింట్లో అణుకువ ప్రదర్శించి అందరి మెప్పు పొందాలని తల్లి అణువణువు ఆమెకు హితబోధ చేస్తూనే ఉంటుంది! బాల్యంలో కాళ్లకు పట్టగొలుసులు వేసుకొని ఇంట్లో ఎగురుతుంటే ఆ సవ్వడికి ఆనందం పడుతూనే “మెట్టింట్లో ఈ దూకుడు పనికిరాదమ్మాయ్” అంటూ సుతి మెత్తగా మందలిస్తుంది! మగపిల్లాడికి ఏ టీ షర్ట్ వేసి, నిక్కర్ వేసినా అడిగేవారు ఉండరు కానీ…ఆడపిల్ల బయటకు వెళుతుంది అంటే చూడ ముచ్చటగా తయారు చేసి.. దిష్టి తీసి మరి నాన్న వెంట బయటకు పంపే తల్లులు గుమ్మం నుండి ఆ పిల్ల దూరమయ్యే వరకు చూసి అప్రయత్నంగానే వచ్చే కన్నీటి బోట్టును చీర కొంగుతో తుడుచుకుంటుంది! ఆడపిల్ల అంటే అల్లారు ముద్దే కాదు అపరంజి బొమ్మలా హృదయానికి హత్తుకొని చూసే అమ్మ ఒడిని అనునిత్యం గుర్తుకు తెచ్చుకుంటూ ఆనంద బాష్పాలు విడిచే ఆ అమ్మాయి ప్రతి నిత్యం అమ్మ చెప్పే మాటలు నెమరేసుకుంటూ మెట్టినిట్లో కాపురం చేస్తుంది! కొద్దిగా అలసట తో పొద్దెక్కి లేస్తే ‘ఇదేనా మీ అమ్మ నేర్పిన నడవడిక” అంటూ అత్తగారు ఎక్కడ తన అమ్మను ఆడి పోసుకుంటుందో అని అలారం పెట్టుకొని లేచి పుట్టింటి గౌరవానికి భంగం రాకుండా చూసేది ఒక్క ఆడ పిల్లే!! అలాంటి కూతురు ప్రతి ఇంట్లో ఉండాలని ఉవ్విళ్లూరే వారికి అదృష్టం వరించక మగపిల్లలు పుడితే వచ్చే కోడలిని కన్న బిడ్డలా చూసుకునే కొంతమంది అత్తలు కూడా ఉంటారు! విధి వక్రించి అత్తపెట్టే ఆరళ్ళు భరించి ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోలేని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉన్నా చున్నీ ని నోట్లో కుక్కుకొని పుట్టింటి వారికి తన బాధలు చెప్పుకోలేని ఆత్మ గౌరవం ఉన్న ఆడపడుచులు చాలా ఇళ్లల్లో ఉంటారు! అలాంటి స్థితిలో ఒక అమ్మే ఆమెకు ఊరట! అమ్మే అండ దండ!! అత్తారింట్లో బిడ్డకు ఎలాంటి కష్టం వచ్చినా సర్ది చెప్పి…మెట్టింటి వారికి “చిన్న పిల్ల…ఆమె తప్పులకు నేనే బాధ్యత”, అంటూ వినమ్రతగా చేతులెత్తి వియ్యంకురాలికి సర్ది చెప్పే అమ్మను ఏ కూతురు కూడా నిమిషం దూరమయితే భరిస్తుందా?
Also Read: ఆత్మ విశ్వాసమే మీ ఆయుధం!
పెళ్లి అయ్యి ఏడడుగులు నడిచి మెట్టినింట్లో అడుగుపెట్టే ముందు జరిగే “అప్పగింతలప్పుడు” తల్లి కన్నీళ్లు పౌర్ణమి నాటి అలల్లాగ ఎగిసిపడతాయి. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాదు! అత్తారింట్లో అడబిడ్డలతో , తోటికొడళ్లతో, భర్తతో, బావలతో, మరుదులతో, ఇరుగు పొరుగు వారితో నోటా మాట రాకుండా “మెసులుకో తల్లి” లేదా అందరూ ఒక్కటై నిన్ను ఒంటరి వారిని చేస్తారు. అవసర మున్నప్పుడు మాత్రమే అందరితో మాట్లాడు. అను నిత్యం పుట్టింటి వారి బాగోగులు చూసినట్టే మెట్టింటి బంధువులను చూస్తేనే నా పెంపకాన్ని పోగుడుతారు” అమ్మ అంటూ కన్నీళ్లతో సాగనంపే తల్లిని ఏ బిడ్డ మరవదు. ఈనాటి తల్లుల మాత్రం అత్తలేని ఇల్లు, ఉన్నా అల్లుడు దూరంగా ఉద్యోగం చేస్తున్నాడా? ఒక వేళ అత్త మామ తన కూతురుతో ఎన్నాళ్లు కలసి ఉంటారు. అడబిడ్డల ఉన్న ఇంటికి ఇవ్వాలా వద్దా? అనే తల్లుల వల్ల ఈ నాటి తరంలో అప్పగింతలు లేవు. ఏడుపులు లేవు. అమ్మాయికి బాధరబంధీలు లేక పోవడం వల్ల తలబరుసుతో భర్తకు తలతిక్క సమాధానాలు చెప్పే కూతుళ్ళ ను తరిమి కొట్టే మొగుళ్లు ఉండడం…కూతురు విడాకులకు ప్రోత్సాహం ఇచ్చే తల్లుల వల్ల కూతురు.
పుట్టింటికి చేరి నప్పుడు ఇరుగు పొరుగు వాళ్లు అత్తను తిట్టరు….
తల్లి పెంపకం వల్లే కూతురు ఉరేగుతుందని, ఉన్న మొగుడి తోనే కాపురం చేయలేదు..ఇంకొకనితో కాపురం చేస్తే తెంపి ముడేసిన తాడు లాగా కాపురం మున్నాళ్ల ముచ్చటే అవుతుంది అంటూ అమ్మలక్కలు కోడై కూస్తారు!! అమెరికాలో ఉండనీ ఆస్ట్రేలియాలో ఉండనీ మొదటి కాన్పుకు తల్లి దగ్గర ఉంటేనే అమ్మాయికి సుఖ ప్రసవం…! కట్టుకున్న మొగుడు.. మెట్టింటి బంధువులు ఎంతమంది ఉన్నా పురుడు పోసుకున్న శిశువును ఆయమ్మ ఆమె తల్లికి అందిస్తుంది! కూతురు కాన్పు కోసం వచ్చిన తల్లి ఇచ్చిన పాత చీరలతో శిశువు తల అద్ది శరీరం అంతా తుడిచి తన తల్లిని తలుచుకొని తన అమ్మ నేర్పిన తీరుగా శిశువు తలంటి, స్నానం పోసి నుదుటిపై దిష్టి చుక్క పెట్టి నిండుగా బట్టలు కట్టి నంత సేపు తన ముద్దుల కూతురు సోయగాన్ని బాలింతగా మంచం మీద నుండి చూస్తూ, అమ్మ తన కూతురు కు చేసే సపర్యలకు తన్మయత్వం చెందే కూతుళ్లు అమ్మ చేసిన సేవను జీవితాంతం మరుస్తారా? తన మనవరాలికి జోల పాట పాడుతూ నిద్ర పుచ్చే ఘట్టాలు ప్రతి కూతురు మనసులో నిక్షిప్తం అవుతాయి. అందుకే అమ్మమ్మ కు చనువయ్యే పిల్లలు అమ్మ దగ్గరి లాగా అమ్మమ్మ దగ్గర కూడా ఆత్మీయత గారాబం చూపిస్తారు! మహిళల అవసరాలు నిశబ్ధం గా గమనించి శిశువును తల్లి పొత్తిల్లో ఉంచే ఇంటర్ జనరేషన్ హెరిడీటీ తల్లి నుండి కుమార్తెకు వెళుతుంది! అందుకే పితృస్వామ్య వ్యవస్థలో కూడా మాతృత్వం విలువలు నేర్పే తల్లి దండ్రులు ఉన్నారు కాబట్టే ఆడపిల్ల జీవితం పుట్టింటి జ్ఞాపకాల వల్లే అన్ని బాధలు మరుస్తుంది! భర్త సతాయించినా, ఆడబిడ్డ అరిచినా, అత్త ఆరళ్ళు పెట్టినా అమ్మతో ఆ దుఃఖం పంచుకున్న కాసేపటికి కూతురుకు వెయ్యేనుగుల బలం వస్తుంది! వంట పని, ఇంటి పని చిటికెలో చేసి, అత్తను సంతృప్తి పరిచి ‘నా కోడలు’ అని సగర్వంగా చెబుతున్నప్పుడే తల్లి ప్రేమ ఆకాశానికి అంటుతుంది! కూతురును కాలికి మట్టి అంటకుండా పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగం వచ్చిన తరువాత కంపెనీలో ఒకరిని ప్రేమించిన కూతురును మందలించకుండా “నా పెంపకం…ఇంతేనా” అమ్మా అంటే…లేదమ్మా నీకు యోగ్యుడైన అల్లుడిని తెచ్చానని ఈడు జోడు అణుకువ అనురాగం, ప్రేమ ఆప్యాయత ఉన్న జోడి ని చూపిస్తే భుజం మీద తట్టి ‘గొహెడ్” అనే కూతురు మనసు ఏరిగే తల్లులు కూడా ఉంటారు!
వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి,
వినాస్త్రీయ జీవం నాస్తి
వినాస్త్రీయ సృష్టి ఎవనాస్తి అంటారు! స్త్రీ లేకపోతే జీవం,గమనం, జననం, అసలు సృష్టే లేదని దీని అర్థం! అందుకే ఈ సృష్టికి మూలం స్త్రీ! అందులో మాతృమూర్తి అంటేనే నడిచే దేవత!!
Also Read: అమ్మ జోల పాటలో ఉన్న నిద్ర ఇప్పుడేది?