————————–
(‘THE TWO HUNTERS ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
46. సంచారి తత్త్వాలు
—————————-
మే నెలలో ఒక రోజు ఆనందమూ, దుఃఖమూ ఒక సరస్సు చెంత కలుసుకున్నాయి. ఒకరికొకరు అభివాదం చేసుకున్నాయి. నీళ్లు ప్రశాంతంగా పారే చోట ఆ రెండూ కూర్చొని మాట్లాడుకోసాగాయి
అవనిపైనున్న అందాలూ, అరణ్యంలో, కొండలలో — రోజువారీ జీవితంలో ఉన్న వైచిత్ర్యాలూ ఉదయ — సాయం సంధ్యలలో వినపడే సంగీతము — వీటన్నిటి గురించి’ ఆనందం’ మాట్లాడింది.
‘దుఃఖం’ కూడా మాట్లాడింది. ఆనందం చెప్పిన వన్నీ దుఃఖం కూడా ఒప్పుకుంది. ఎందుకంటే సూర్యాస్తమయము, దాని అందాలు దుఃఖానికి తెలుసు. పొలాల్లో, కొండల్లో — మే నెలలో ఎట్లా ఉంటుందో ‘దుఃఖం’ అనర్గళంగా మాట్లాడింది.
‘ఆనందము,’ ‘దుఃఖము’ –చాలా సేపు మాట్లాడుకున్నాయి. తమకు తెలిసిన అన్ని విషయాల మీదా ఒక అంగీకారానికి వచ్చాయి.
అప్పుడు, సరస్సు రెండోవైపున ఇద్దరు వేటగాళ్లు వెళుతున్నారు. వారిలో ఒకతను సరస్సు మీదుగా చూస్తూ ఇలా అన్నాడు.” అవతలి వైపు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?” రెండో అతను ” నువ్వు ఇద్దరు అన్నావా? నేనొకరినే చూస్తున్నాను.” అన్నాడు.
మొదటి వేటగాడు “కానీ ఇద్దరు ఉన్నారు.” అన్నాడు. రెండో వేటగాడు ” నేనొకరినే చూడగలుగుతున్నాను. నీటిలో ప్రతిబింబం కూడా ఒకటే.'”
“లేదు. ఇద్దరు ఉన్నారు.” మొదటి వేటగాడు అన్నాడు “నిశ్చలమైన నీటిలో ప్రతిబింబం కూడా ఇద్దరిదే. “
రెండో వేటగాడు ” నాకు ఒక్కడే కనిపిస్తున్నాడు.” అన్నాడు.
మొదటి వేటగాడు ” నాకిద్దరు స్పష్టంగా కనిపిస్తున్నారు.” అన్నాడు.
ఈ రోజుకి కూడా — రెండో వేటగాడు “మొదటి అతనికి, ఒకటి — రెండుగా కనిపిస్తాయి.” అంటాడు.
మొదటి వేటగాడు “నా మిత్రుడు కొంచెం గుడ్డి వాడు.” అంటూ ఉంటాడు.
Also read: నది
Also read: ఆనందం
Also read: దేవుణ్ణి కనుగొనటం
Also read: డెభ్భై ఏళ్ళు
Also read: ప్రార్థన