నిన్నటి మొన్నటి వరకు వైయస్సార్ కు నమ్మిన బంట్లు…ఆయన మృతితో చంద్రబాబు పక్షాన చేరిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయ గ్రహణం లో తచ్చాడుతున్నారు…అయినా తాడిపత్రి వాళ్ళ ఆస్థానం. నిజంగా చెప్పాలంటే తాడిపత్రి అభివృద్ధిలో జేసీ బ్రదర్స్ పాత్ర గణనీయం. మొన్నటి ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వల్ప మెజారిటీ తోనే దివాకరరెడ్డి కుమారుణ్ణి ఓడించాడు. తాడిపత్రి మున్సిపాలిటీనీ అత్యంత పేరు ప్రఖ్యాతులు గల మున్సిపాలిటీగా తీర్చి దిద్దిన ఘనత జేసీ కుటుంబీకులదే! ఒక్క సారిగా వార్తల్లోకి ఎక్కిన తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ధారెడ్డి, దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి విధ్వంసం సృష్టించారని వస్తున్న కథనాలు…హైదరాబాద్ పర్యటనలో ఉండి, ఈ వార్త తెలియగానే నేరుగా తాడిపత్రి ఇంటికి చేరుకున్న జేసీ ప్రభాకరరెడ్డి తను లేనప్పుడు తన ఇంట్లోకి వచ్చి తాను కూర్చునే సోఫాలో కూర్చున్న పెద్దా రెడ్డి వైఖరి కి మండిపడ్డాడు.
పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని తగులపెట్టిన జేసీ అనుచరులు
వెంటనే ఆ సోఫాను జేసీ అనుచరులు కాల్చేయడం తో తాడిపత్రి రగిలిపోయింది. మాటల యుద్ధంతో పోలీసులు అలెర్ట్ అయ్యి శాంతి భద్రతల స్థాపనకు రాత్రి పగలు కాపాల కాసే పరిస్థితి దాపురించింది. తాడిపత్రి లో ప్రశాంత వాతావరణం కాస్తా నిప్పుల కుంపటి గా మారింది. రాజకీయంగా బద్ద శత్రువులైన పెద్ధారెడ్డి, జేసీ బ్రదర్స్ మధ్య సఖ్యత మాట దేవుడెరుగు ఇప్పుడు ఒకరి నొకరు నరుక్కుం టామ్ అనుకునే వరకు పరిస్థితులు వెళ్ళాయి. నిజానికి వైఎస్ జగన్ తన దారికి తెచ్చుకోవడానికి జేసీ బ్రదర్స్ పైన అన్ని విధాల వత్తిడి తెస్తూనే ఉన్నారు. ఆయన వ్యాపార, రాజకీయాలపై దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. అనంతపురం రాజకీయ సమీకరణలో జగన్ దారికి రాకుండా చంద్రబాబు పక్షాన చేరినప్పటి నుండి జేసీ బ్రదర్స్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు జేసీ, పెద్దారెడ్డి కుటుంబాలు ఫ్యాక్షన్ నీడన పయనిస్తున్నాయి.
దివారకర్ మాటల ఈటెలు
జేసీ దివాకర్ రెడ్డి తన చేతులకు రక్తం అంటలేదని అంటూనే తన మాటలతో ఎవరిని వదలరు. అవసరమైతే చంద్రబాబు పై కూడా మండి పడ్డ ఘనచరిత్ర జేసీకి ఉంది. వాళ్ల దూకుడు ను తట్టుకొని అటు వైయస్సార్, ఇటు చంద్రబాబు సర్దుకు పోయారు. కానీ నోటికి ఎంత వస్తే అంత మాటలు అనడంలో అన్నదమ్ములు ఇద్దరూ వెనక్కి పోరు. అనంతపురం జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న జేసీ తాడిపత్రి లో మాత్రం మకుటం లేని మహరాజే.
మళ్ళీ పడగ విప్పిన ఫ్యాక్షన్
పోయిన శాసనసభ ఎన్నికల్లో జగన్ హవాలో పెద్ధారెడ్డి గెలిచాడు కానీ లేకపోతే జేసీ రాజకీయ స్థితి మరో విధంగా ఉండేది. ఇప్పుడు అధికారం దూరమై, హైదరాబాద్ కు పరిమితమైన జేసీ బ్రదర్స్ మొన్నటి సంఘటనతో తిరిగి తాడిపత్రి వేదిక గా రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. దీని పరిణామాలు ఎటు దారి తీసినా మళ్ళీ అనంత పురం జిల్లాలో ఫ్యాక్షన్ పడగ విప్పిన మాట వాస్తవం. తాడిపత్రి ఘన చరిత్ర మాములిది కాదు. తాడిపత్రి పురపాలక సంఘం కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. కార్పొరేట్ కార్యాలయం తరహాలో సెంట్రల్ ఏసీతో నిర్మించారు. దీన్ని చూసినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దారు. వీధుల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు.
ప్లాస్టిక్స్ వాడకంపైన నిషేధం
2006లో తాడిపత్రి పురపాలక సంఘం పాలకవర్గం తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించింది. దశలవారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాలకవర్గం కృషితో నేడు ప్లాస్టిక్ కవర్ల వినియోగం వందశాతం తగ్గింది. ఇంటర్ పాఠ్యాంశాల్లోనూ తాడిపత్రిలో ప్లాస్టిక్ నిషేధం గురించి చేర్చారు.
ఆదర్శ మునిసిపాలిటీలో కత్తులూ, గొడ్డలూ
తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీ పథకం అమలు అవుతోంది. అయితే పట్టణంలో 25444 నివాస గృహాలు ఉండగా 13వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ పథకం అనుసంధానం కాగా ఇంకా మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి పురపాలక సంఘం కృషి చేస్తోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇలాంటి గొప్ప మున్సిపాలిటీ లో కత్తులు గొడ్డళ్లు స్వైర విహారం చేయడం సామాన్యులకు అంతు పట్టడం లేదు. నిజానికి పెద్ధారెడ్డి సామరస్య వాతావరణం కోసం చూస్తే జేసీ బ్రదర్స్ ఇంట్లో ఉన్నప్పుడే వారికి కబురు పెట్టీ వెళితే సామరస్య వాతావరణం ఏర్పడేదే! ఆయన ఇంట్లో లేనప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి గల వ్యక్తి వెళ్ళడం విమర్శలకు తావు ఇచ్చింది…ఇక ఆధిపత్య పోరాటం మాటల యుద్ధం మొదలైంది. లేనిపోని పంచాయితీ అంటే ఇదే!