కామక్రొధ వగైరా అరిషడ్వర్గాలలో
అగ్రతాంబూలం కామానిది
కోరికలు అనంతం అన్నారు ఆర్థికశాస్త్రవేత్తలు
మోహానికి రాజర్షియే లోబడ్డాడు
సుమశరుడి ప్రభావం తగ్గగానే
పురిటిబిడ్డను వదిలేసింది దివ్యకాంత
కాముడి ప్రభావం నేటి చట్టసభలకూ ప్రాకింది
రేపులు మర్డర్లు మామూలైపోయాయి
తమో గుణం పెచ్చరిల్లుతోంది
ఆడ జన్మ బికుబిక్కుమంటుంది
నపుంసక జాతి బలంతో స్త్రీని
వివశను వివస్త్రను చేస్తూంది
కాముడి బలంతో కాపురుషులు
కాని పనులు యథేచ్ఛగా చేస్తున్నారు
పాపం పెరుగుతోంది
తరగాల్సిన సమయం వచ్చేసింది
దాన్ని తగలేసే ప్రయత్నం జరగాలి
తమస్సులోనుంచి ఉషస్సులోకి నడవాలి
అదిగో మూడో కన్ను
అదే జ్ఞాననేత్రం
అది తెరచుకోగానే కామ క్రోధాదులు భస్మం
కామదేవుడు బూడిదైపోతాడు
మోహం తీర్చుకొని అశరీరుడవుతాడు
మన అంతరంగాన్ని ఆవహించిన తిమిరం తొలగి
వెలుగు రేఖలు ప్రసరిస్తాయి.
జగతి మంచితో ఆనందంతో నిండుతుంది
ఇది ఈనాడే జరగాలి
ఈనాడే మీ కామ దహనం.
జీవితం ఆనందాతిశయంతో
అనేక రంగులమయం కావాలి
తెరవండి మీ మూడోకన్ను
Also read: యవ్వనం
Also read: విధి విలాసం
Also read: గుమ్మడి పువ్వు
Also read: క్షాత్రం
Also read: సాహిత్య ప్రయోజనం