• స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
• ప్రభుత్వ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్రం ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేసినట్లు ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు . రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చిన విషయాన్ని రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. వ్యాక్సినేషన్ కు 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని తెలిపారు. వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని యథావిధిగా జరపాలని స్పష్టం చేసింది.
ఇది చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
పంచాయతీ ఎన్నికల విచారణపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగానే స్పందించినట్లు తీర్పును బట్టి అర్థమవుతోంది. ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి. ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం సబబు కాదు, ఏదో ఒక వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు. ఇది రాజకీయ ప్రక్రియలో భాగం. మీరు ఎన్నికల కమిషనర్ పై రాసిన విధానం మీ ఆలోచనా సరళిని ప్రతిబింబిస్తున్నాయని విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు.
ఇది చదవండి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు
ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ:
పంచాయతీ ఎన్నికలను జరపాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంకాకపోవడంతో ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 9, 13,17,21, తేదీలలో పోలింగ్ జరగనుంది.