పలకరించే నక్షత్రాల నీడలో బహు దూరం ప్రయాణించా,
వ్యజన వనాలలో,
వ్యగ్ర శిలాగ్రాలపై విహారాలు చేశా.
ఎక్కడైనా ఒక్కటే!
వేయి గడపల వెనుక దాచిన గుండె గాయాల పైని
రక్తపు చెమ్మ ఎప్పటి కప్పుడు కొత్త ఎరువును
చిప్పిల్లుతూనే ఉంది.
జ్ఞాపకం మనసు లోతులోనికి
ఇంకిపోయిన వ్యసనం…
వేయి పొరల మనసులో
పొరకు పొరకు మధ్యన సుదీర్ఘ ఘర్షణ
వద్దు, లేదు, కాదు అన్నా
సద్దుమణగని నిరంతర అలాపన.
అందుకే నా గుండె చేను గట్టుపై
మరపు అనే ఒక దిష్టిబొమ్మ ను నాటా.
నిర్లిప్తంగా నిర్జీవమైన చూపులతో ఒకే వైపు
చూసే దాని నిస్సహాయత నేనెఱుఁగనిది కాదు.
ఆశా తులికాలకు ఆ విషయం తెలుసు.
అందుకే విచ్చలవిడితనం తో
స్మృతీ చటకాల వైపు చూస్తూ
తలలూపుతూ, కన్ను గీటుతూ
బహిరంగ సందేశాలు పంపడం ఆపవు.
చివరకు
నేనూర్చ పోయేది రిక్తక ధాన్యన్నే…
మరల మొదలు ..
కొత్త ఆశా బీజాలు చల్లాలి.
ఏరువాక సాగాలి.
Also read: నమ్మకం
Also read: గొర్రె
Also read: యుద్ధము… శాంతి
Also read: ఎరుపు-తెలుపు
Also read: వర్షం