నీ కెన్ని కథలు చెప్పానో కదా మిత్రమా!
చిలిపివి, గిలిగింతలు పెట్టేవి, హాయిగా నవ్వుకొనేవి
సరదాసరదా వృతాంతాలు;
అనవద్యమైన, నిర్వివాదమైన, తేలికపాటి పిట్ట కథలు,
విచిత్ర విశేషాలు, సాదాసీదా చమత్కారాలు,
హస్యాలు, వెటకారాలు…
అప్పుడప్పుడు, స్వంత డప్పు కొట్టుకోడానికి,
Modesty చూపుకోడానికి
చేసిన చిన్న చిన్న తప్పులను
నవ్వులాటల్లా వర్ణించిన ఉదంతాలు!
నేనంతవరకె చెప్పా…నీ కంతవరకె తెలుసు!
నేనుచేసిన క్షమించరాని పాపాలు,
అనుభవించిన చెప్పుకోలేని అవమానాలు,
సిగ్గుతో తలవంచుకొన్న క్షణాలు,
భయంతో, బాధతో, నోరు మూగబోయిన వేళలు
… నా పగుళ్లువారిన గుండెలోతుల్లోనే,
పదిలంగా దాచుకున్నాను సుమా!
క్షమించు మిత్రమా, క్షమించు…
తప్పనిసరిగా కప్పిఉంచిన అనేకానేక
అశ్లీల తప్పిదాలను, వింత వింత వికారాలను…
నీకు మనసువిప్పి చెప్పనందుకు.
నేను మనిషినే గా…కపటం, కుళ్లు,
మొహమాటం, దాపరికం, అహంకారం,
స్తోత్కర్ష, పరనింద, నిర్లక్ష్యం వగైరా
అన్నీ సామాన్యమే, అందరికి లాగానే!
ఎంత బరువులైన, అవి అన్నీ మోస్తూనే ఉన్నాను
… దింపలేని భారాలు, వదిలించుకోలేని ఉరుగులు,
తళతళ లాడే మోహపు మురుగులు…
ఆ బరువుకు, నా అడుగులు తడబడుతూనే ఉన్నాయి,
నా నడక నెమ్మదిస్తూనే ఉంది…
కానీ ఇక్కడ కాదు
…అక్కడ,
నా నిగూఢమైన వెన్నెముకను
మొట్ట మొదటిసారి
గట్టిగా నిటారుగా చేసి,
వాసనారాహితంగా, నగ్నంగా, నిస్సిగ్గుగా,
నా అనిర్వచనీయ విచారాలు
వివాదాస్పద వాదాలు, వివరించలేని వేదనలు
ఆయన పాదాల వద్ద కుప్పగా పోసి
నిరామయంగా నిలుచుని నిరీక్షిస్తాను!
నాకు తెలుసు, నా తప్పిదాలు లెక్కవేసి
ఆయన నవ్వడు, కోపపడడు, ఏవగించుకోడు
…ఏ భావము చూపించడు!
నిర్వికారంగా, నిర్లిప్తంగా, నిరంకుశంగా…
కేవలం ఒక్క మాటలో
తన తిరుగులేని తీర్పు వినిపిస్తాడు.
Also read: నా ఇష్టాయిష్టాలు
Also read: మా రైతు
Also read: కొందరు అంతే
Also read: రాజకీయం
Also read: ద్వంద్వాలు