ఆ గొర్రె హాయిగానే ఉంది
రత్తయ్య నీడలో
రోజుకో కొత్త కల కంటూ.
తన అమ్మను, నాన్నను,
అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను
రత్తయ్య ఎక్కడికో పంపాడు…
మంచిచోటికే అయ్యుంటుంది…
చల్లని గాలి, పరచుకొన్న పచ్చిక బయళ్ళు,
నిగ నిగ లాడే నిర్మల మైన
నీటితో ప్రవహించే సెలయేళ్ళు…
అక్కడికే, అక్కడికే…
నన్నూ ఒకరోజు పంపుతాడు…
ఎప్పుడో?
అతనిచేతిలో అద్దంలా
మిలమిల లాడే వెడల్పాటి కత్తి,
దానిలోకి చూస్తుంది
తనవాళ్లేమయినా కనపడుతారేమొనని!
అవును…అదే కదా తనలాంటి వాళ్ళందరిని
దూర తీరాలకు చేర్చే మాయా దర్పణం…
తన ముఖం మాత్రం కనిపిస్తుంది…
నేనెప్పుడు వెళతానూ…
అతన్ని చూస్తూ మూగగా మూలుగు తుంది.
……………
రోడ్డు ప్రక్కన పెద్ద హోర్డింగులో
అతను రెండు వేళ్ళు V లా చూపుతూ
వెకిలి నవ్వు నవ్వుతున్నాడు.
ఖద్దరు లాల్చీ, టోపీ…
వెనుక ఏదో గుర్తు…
రత్తయ్య అతని ఫోటోనే చూస్తూ
తనలో తాను గొణుగుకొన్నాడు…
“అన్నా, నా ఓటు నీకే నన్నా…
నువ్వు గెలవాలి, మా కష్టాలు తీరాలి!”
……
ఆరోజు పొద్దున్నే
గొర్రె తల తెగి క్రింద పడింది.
మధ్యాహ్నం రత్తయ్య
పోలింగ్ బూత్ లో ఓటు వేసాడు.
Also read: యుద్ధము… శాంతి
Also read: ఎరుపు-తెలుపు
Also read: వర్షం
Also read: అమ్మ
Also read: నూతన జీవితం