ఆ ఊళ్లో సముద్రముంది
లేదా
సముద్ర తీరాన ఊరు.
బయటి నుంచి వచ్చే వారికి
సముద్రమొక ఆశ్చర్యం
ఊరి వారి కది అలవాటు.
ఒడ్డున కెరటాలు
మీది మీది కొస్తుంటాయి
అవి అక్కడే ఆగిపోతాయని
తెలియదు వారికి.
నురగలుగా చీలిన మున్నీటి గీతలు
చిత్రకారుని మస్తిష్కంలోని
గచ్ఛత్ మనోహరాకృతులు,
పరుచుకున్న సిల్కు వస్త్రంలా
అల్లుకున్న ఇసుక రేణువులు.
సముద్రం పైన ఆకాశానికి
ఆచ్ఛాదన లుండవు
నగ్నత్వమే దాని సౌందర్య తత్వం.
సైకత మైదానాల్లో
పాదముద్రలు
ఎక్కడికి వెళ్లి పొయ్యాయో అంతు పట్టదు
బయటి వారి కివన్ని ఉద్వేగ భరితాలు.
సముద్రం హోరు
మరో లోకపు చప్పుడులా వినిపిస్తుంది.
దూరంగా నీటి అంచు
ఆకాశాన్ని కలిసే చోట
అదొక ఊహాపోహల ఊట.
దగ్గరౌతున్న ఓడ
ప్రియురాలికి పంపే సందేశంలా
కూత పెడుతుంది.
మొన్నటికి మొన్న ఇద్దరు కవులు
సముద్రాన్ని
జేబులో వొంపుకొని వెళ్లారు.
ఊరి వారి కిదేమీ పట్టదు
సముద్రమంటే వారికి
సాయంత్రం పూట
చల్లని అలల విసన కర్ర.
సెలవు దినాల్లో
పిల్లలు నిమగ్నమయ్యే ఆట విడుపు.
బంధువుల ముందు
కాలర్ ఎగరేసే బడాయి దృశ్యం.
ఊరి వారికి
రోడ్డుకు అటువైపు సముద్రం.
ఇటు వైపు
యాంత్రిక జీవన సర్వస్వం.
అయితే ఒకటి
ఊరి వారు గానీ
బయటి వారు గానీ
మిస్సయ్యే దొకటుంది,
అది పల్లెకారుల
జల జీవన తరంగ కల్లోల ప్రపంచం.
Also read: సామూహిక
Also read: వలస చేప
Also read: చక్రం
Also read: అల్పాక్షరముల…
Also read: ముంబయిలో వర్షం