ఇక్కడ మనిషంటే మన్వంతరాల బానిసత్వం
మనిషి మనిషిగా ఎదిగినప్పుడు కదా
మానవత్వం సమానత్వం అనగల్గేది
కామరూపంలో ఉన్న క్షుద్రశక్తులే
పామరుల పాలిటి దేముళ్ళు
ప్రేతానికీ పెరుమాళ్ళకూ, తోకచుక్కకూ వేగుచుక్కకూ
జోలపాటకూ మేలుకొలుపుకూ తేడా తెలియనివాళ్ళం
మా మనసులు అమ్మకపు దినుసులు
బతుకులు సంతలో సరుకులు
అపచారాలని ఉపచారాలని నమ్ముతాం
రాచకీచకుల నోటు దుర్మార్గానికి ఓటు మానం కోల్పోతుంది
నరంలేని నాల్కల నాయకమాయావుల మాటలు బహుమానాలు
జాతికి చేస్తున్న అవమానాలు
ఇంతకీ దేశం అక్షయపాత్రా, బిక్షాపాత్రా?
ప్రజాస్వామ్యమంటే ప్రచ్ఛన్నదాస్యం.
అవినీతి మా జాతీయ నిధి
ఎడారి రాజకీయాలకు ఎండమావులదే నాయకత్వం
నేరాలే సారథులైతే నీచమార్గాలన్నీ రాజమార్గాలే
మా జనాలది విదారకమై ఔదార్యం.
స్వదేశంలో శరణార్థులు, దరిద్రమే స్థిరాస్తి.
కడుపు మంటలను కన్నీళ్ళతోనే ఆర్పుకొంటున్నారు
ఉన్నవాడికి ఊడిగం చేయడమే ప్రభుత్వ ఆదర్శం
పెరిగే తారతమ్యాలే మా ప్రజాస్వామ్యానికి పునాది
వంచననే మా బతుకు చేలకు కంచె వేసుకోటం సంప్రదాయం
పేలకు పెత్తన మీయటమే మా నెత్తుల కాచారం
మా సిద్ధాంతాలు ఆకాశమంత అవకాశవాదం
మా పతాకాలు గాలివాటం కెగిరే దారం లేని పతంగులు
మా నేతలు ఆశయాలనారాధిస్తారు ఆచరణలో నిషేధిస్తారు
అన్ని పక్షాలు జాతినెదగనీయని వటవృక్షాలు.
మహాత్ముని నామజపం ప్రవరకే పరిమితం
కాయలమ్ముకోటానికి చెట్టుపేరు అవసరం
చరిత్ర శవాగారంపై, త్యాగాల ఖజానాపై
అధికారం వీరిదేనట-వీలునామా వీరే రాసుకొన్నారు
ప్రేతాత్మలే వీరి కేతనాలు, మృతజీవులే ముక్తికి సోపానాలు
ఇక మా రాచమల్లులు – అధిష్ఠానం ముందు పిల్లులు
అంగప్రదక్షిణాలు ఆర్జిత సేవలనే నమ్ముకొన్నవాళ్ళు
అందుకే దిష్టిబొమ్మలకు ప్రతిష్టలు
ఉత్సవ విగ్రహాలకు ఉన్నత పీఠాలు
దేశీయమంటే మతం మాయాదర్పణంలో
అభూతస్వర్గం చూపించటం
జనాన్ని నమ్మటంకంటే గుడిని నమ్మడం పదిలం
తలలు వాల్చిన తత్త్వాలు, రెక్కలు తెగిన విప్లవాలు
మా మెదళ్ళను బీళ్ళుగానే ఉంచినై
ఏమైనా మా వామపక్షీయులు అఖండులు
ఎన్నికల కురుక్షేత్రంలో శిఖండులు.
ప్రాంతీయగానాలు సామాజికన్యాయాలు?
అంగలార్చేది అధికారప్రస్థానానికే
కులపోరాటాల మిణుగురు వెలుగులు చూపి
దిశచూపే ధ్రువతారలంటున్నారు
ఏది ఏమైనా చీకటిలో బతకటం ఈ జాతికి అలవాటే
వెలుగును చూడటానికి వెరపు ఉలికిపాటు
బాధ్యత తెలియని జనానికి భవిత అంధకారమే.
-జ్వలిత