- ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచన
- రేపు భేటీ కానున్న నిపుణుల కమిటీ
జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై తుదినిర్ణయం స్థానిక పోలీసులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధానిలోకి ఎవరిని అనుమతించాలనేది స్థానిక పోలీసుల అధికార పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వలా వద్దా అనేది పోలీసులు నిర్ణయించుకోవాలని సూచించింది. మీరు చేయాల్సిన విధుల గురించి మేం చెప్పాల్సిన పనిలేదని కోర్టు తెలిపింది. మీ వద్ద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నపుడు కోర్టు తీర్పుకోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి: తొమ్మిదోసారి చర్చలు విఫలం
జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తే గణతంత్ర దినోత్సవాలకు ఆటంకం కలుగుతుందని ర్యాలీని నిలివేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్ లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ట్రాక్టర్ల ర్యాలీ శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల బుధవారానికి (జనవరి 20) వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు
కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ నెల 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. సాగు చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రేపు (జనవరి 19) భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతల మధ్య పదోసారి చర్చలు కూడా రేపే (జనవరి 19) జరగనున్నాయి.
ఇదీ చదవండి: సాగు చట్టాల అమలుకు సుప్రీంకోర్టు బ్రేక్