Sunday, December 22, 2024

దేశానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభం పీవీ

అపర చాణుక్యుడిగా అనంతకీర్తిని పొందిన పీవీ నరసింహారావు శతజయంతి నేడే. ఇది వాడవాడలా వేడుక చేసుకోవాల్సిన శుభ సందర్భం. పాలకపెద్దలకు ఆయన పెద్దబాలశిక్ష. ఆ పుస్తకాన్ని తెరవాల్సిందే, చదవాల్సిందే, ఆచరించాల్సిందే. స్వపక్ష, విపక్ష పాలకులందరూ ఆయనను తలవాల్సిందే. ఆ విధానాలను కొలవాల్సిందే. మన్ మోహన్ సింగ్, వాజ్ పెయి మొదలు నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకూ అందరూ పీవీ విధానాలను గౌరవించారు. ఆచరించే ప్రయత్నం చేశారు. అదే, పీవీ చాటుకున్న విశేష పాలనా ప్రజ్ఞ, దార్శనిక ప్రతిభ. జవహర్ లాల్ నెహ్రూ మొదలు ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన ప్రధానులలో పీవీ వంటి బహుముఖ ప్రతిభామూర్తులు ఇంకొకరు లేరన్నది లోకం గుర్తించిన సత్యం. ఆయన తెచ్చిన సంస్కరణలే దేశాన్ని ఇన్నేళ్లు నిలబెట్టాయి. అవే ఆయనను మన స్మృతి పథంలో నిలిపాయి. ఆయన అధికారం చేపట్టిన నాడే ‘పీవీ శకం’ ప్రారంభమైంది. అది దేశానికి శుభశకునంగా నిలిచింది.

Also read: కశ్మీర్ మంచు కరిగేనా?

అసాధారణ అమాత్యశేఖరుడు

రాజుల కాలంలో గొప్ప మంత్రులు ఉండేవారు. రాజు, రాజ్యం, ప్రజల బాగోగులే ఉఛ్వాసనిశ్వాసలుగా ఆ మంత్రులు జీవించారు. పాలకులకు గొప్ప సలహాలను ఇచ్చారు. రాజ్యాలను కాపాడారు. పీవీ నరసింహారావు అటువంటి అమాత్యశేఖరులకు అసలుసిసలైన వారసుడు. ఆధునిక కాలంలో, ప్రజాస్వామ్య పాలనలో… రాజు, మంత్రి రెండు పాత్రలను పోషించి, భాసించిన ఘనుడు పీవీ. ఈ తరుణంలో ఒక పద్యం గుర్తుకు వస్తోంది. 1921లో ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో రాజా బొమ్మదేవర నాగన్ననాయుడు రాజాస్థానంలో చేసిన ‘సంపూర్ణ శతావధానం’ లో ఆ పద్యం చెప్పారు. ఆ పద్యం పుట్టి కూడా నేటికి నూరేళ్లు కావడం విశేషం. ఎట్టివారు మంత్రిపదవికి అర్హులు? ఇది ఒక పృచ్ఛకుడు సంధించిన ప్రశ్న. ఆ ప్రశ్నను సంధించిన పృచ్ఛకుడు సాక్షాత్తు రాజే కావడం మరో విశేషం. దీనికి కొప్పరపు కవుల పద్యరూపమైన సమాధానం. పతికిన్ భూప్రజకాప్తుడై, బహు విధోపాయంబులన్ శాత్రవ/ప్రతతిం గీడ్వడ జేసి, రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి, ధీ/ చతురుండై, పటుకార్య కౌశలుడునై సత్కీర్తులం బొల్తునే/ మతిమంతుండతడే యమాత్యపద సంభావ్యుండగున్ భూవరా – ఇదీ సంపూర్ణ పద్యం. మంత్రిగా పీఠంపై కూర్చోవలసినవారికి ఎటువంటి అర్హతలు ఉండాలో  కవులు స్పష్టంగా వివరించారు. రాజుకు, ప్రజలకు పరమ ఆప్తుడై, బహు ఉపాయాలతో శతృవులను అణచి, రాజ్యానికి ఎల్లవేళలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ, చతుర బుధ్ధిబల సంపన్నుడై, ఎటువంటి కార్యాన్నైనా అలవోకగా నిర్వహించే చాతుర్యం కలిగి, రాజ్యానికి, రాజుకు, ప్రజలకు, మంత్రిమండలికి సత్కీర్తులు కలుగజేసే మతిమంతుడు ఎవరై ఉంటారో అటువంటివారే మంత్రిపదవికి సంపూర్ణంగా అర్హులౌవుతారు రాజా!…. అని ఈ పద్యం చెప్పే తాత్పర్యం. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాజాస్థానాలలో అటువంటి ప్రధానమంత్రులు, మహామంత్రులు ఉండేవారు. అటువంటివారినే మంత్రులుగా నియమించుకొనే ప్రభువులు ఉండేవారు.పీవీ నరసింహారావు నూటికి నూరుశాతం అటువంటి విలక్షణ లక్షణ సంపన్నుడైన మంత్రీశ్వరుడే.

Also read: రాజకీయం కాదంటే కుదురుతుందా?

దేశానికి వైభవ చిహ్నం పీవీ

ముఖ్యమంత్రిగా,కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు దొరకడం దేశానికి వైభవ చిహ్నం. ప్రభువుగా తనకు దక్కిన స్వాతంత్ర్యానికి పొంగిపోయి, నియంతగా మారక, ప్రజాస్వామ్యయుతంగా  పాలనను అందించారు. రాజు – మంత్రి ఇద్దరి అంతరంగాలు బాగా ఎరిగిననవాడు కాబట్టి, మంచి మంత్రులను, మంచి సలహాదారులను నియమించుకున్నారు. ” రాగ ద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహిస్తాం, అని ప్రమాణ స్వీకార మహోత్సవంనాడు అందరు మంత్రులు ప్రమాణం చేస్తారు. అదికూడా ఆత్మసాక్షిగా అంటూ ఒట్టు కూడా వేస్తారు. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే, ఎందరు ఆ ప్రమాణాన్ని పాటించారన్నది లోక విదితమే. దాన్ని అక్షరాలా పాటించినవారు అతి తక్కువమంది. వారిలో ప్రథమశ్రేణీయుడుగా గణనీయుడు పీవీ.  ఆణిముత్యాల వంటి ఎందరినో తన సలహా మండలిలో, వివిధ హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ జాబితా అతి పెద్దది. ఒక్క మన్ మోహన్ సింగ్ చాలు గొప్పగా ఉదాహరించడానికి. పాఠాలు చెప్పుకుంటున్న  ఆచార్యుడిని తీసుకువచ్చి, కేంద్రమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. తదనంతరం ఆయనే ప్రధానమంత్రిగా పదేళ్లు దేశాన్ని పాలించారు.అంతటి దార్శనికత పీవీ ప్రతిభ. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకోవాలో తెలియడం కూడా మంచి మంత్రికి వుండే మంచి లక్షణం. అందుకే,పీవీని అపరచాణుక్యుడుగా అభివర్ణిస్తారు. పీవీలో చాణుక్యుడుతో పాటు తిమ్మరసు, తిక్కన, అల్లసాని పెద్దన కూడా ఉన్నారు. చాణుక్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకు వస్తుంది.

Also read: ‘సత్య’మేవ జయతే!

ఆర్థిక సంస్కర్త

పీవీ అనగానే ఆర్ధిక సంస్కరణలు గుర్తుకు రాక తప్పవు. ‘అర్థశాస్త్రం’ లో కేవలం ఆర్ధిక అంశాలే కాదు. అనేకం ఉన్నాయి. పాలన, రాజనీతి, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’. పీవీ జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. చాణుక్యుడు /కౌటిల్యుడు ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలు పరచాడు. పీవీ కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టాడు. కాలమానాలను బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే. చాణుక్యుడు పేదలపట్ల ఎంతో దయకలిగి ఉండేవాడు. చివరి దశలో తన సంపదనంతా పేదలకే దానం చేశాడు. పీవీ తన వందలాది ఎకరాల భూమిని తొలిదశలోనే పేదలకు దానం చేశారు. చాణుక్యుడికి భయం అంటే ఏమిటో తెలియదు. పీవీ కూడా తాను చేపట్టాలను కున్న కార్యక్రమాలన్నీ నిర్భీతిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు చేపట్టినప్పుడు భూస్వాములంతా బెదిరించే ప్రయత్నం చేసినా, ఎక్కడా లొంగలేదు, తగ్గలేదు. చివరికి పదవిని కోల్పోయినా లెక్కచేయలేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పుడు కూడా ఎవరి బెదిరింపులకు చలించలేదు. ఆయన అంతరాత్మకు తప్ప దేనికీ వెరవలేదు.అందుకే, ఏ పని చేసినా త్రికరణశుద్ధితోనే ఆచరించారు. రాజు తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి, శతృవుల నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షించుకోడానికి అవలంబించాల్సిన మార్గాలను కౌటిల్యుడు వివరించాడు. విదేశీ వాణిజ్యం ఎలా చెయ్యాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో ఎలా వ్యవహరించాలి తెలిపాడు. పీవీ వాటన్నింటినీ అందిపుచ్చుకుంటూనే తనదైన మార్గంలో నడిచారు. జ్ఞానయోగిగా తాను పొందిన జ్ఞానాన్ని, ఆ మహా గ్రంథాల సారాంశాన్ని ఆధునిక మార్గంలో ఆచరణలో చూపించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నిర్దేశించిన ఆర్ధిక విధానాలకు  గౌరవం, ప్రచారం కలిపిస్తూనే, దేశ పరిస్థితులకు అనుగుణంగా, తన సరళిని జతపరచి జేజేలు కొట్టించుకున్నారు. అదే పీవీ చూపించిన లౌక్య ప్రతిభ. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా టీ ఎన్ శేషన్ ధిక్కార స్వరంతో సర్వ స్వతంత్రుడుగా వ్యవహరిస్తున్న సమయంలో,అదనంగా మరో ఇద్దరు కమీషనర్లను నియమించి, సరిచేసి సమతుల్యతను ఏర్పరచారు. ఇదీ మంత్రాంగంలో భాగమే. కౌటిల్యుడు ‘అర్ధశాస్త్ర’ రచనకు శ్రీకారం చుట్టినపుడు అర్ధశాస్త్ర ప్రవర్తకులుగా భావించే బృహస్పతికి, శుక్రాచార్యుడికి తొలి నమస్కారం సమర్పించాడు. అట్లే పీవీ కూడా చాణుక్యుడు, తిమ్మరసు మొదలు మహామంత్రులందరికీ మనసులో నమస్కారం చేసుకొని, ముందుకు సాగి వుంటారు. ఇదంతా భారతీయమైన ఆలోచనా విధానమే. పీవీ ఆసాంతం భారతీయతను అంటిపెట్టుకొని జీవించారు. కౌటిల్యుడు చాలా సూత్రాలను నిర్దేశించాడు. పెద్దల సహవాసం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు వాటన్నింటినీ పీవీ పాటించారు. చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని గ్రహించి, అమెరికాతో బంధాలను పెంచారు. అదే ఈరోజు అక్కరకు వస్తోంది.

Also read: దేశమంతటా రాజకీయాలాట!

ఆర్థిక సంస్కరణల ఫలాలు అనుభవిస్తున్నాం

భవిష్యత్తు మొత్తం శాస్త్ర, సాంకేతిక రంగాలదేనని గ్రహించి, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతానికి బలమైన పునాదులు వేశారు.ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడో కుగ్రామం నుంచి అమెరికా రాజధాని వాషింగ్ టన్ డిసీ లో ఉండేవారితో, చూస్తూ వీడియో కాల్ మాట్లాడుకునే సౌకర్యం ఈనాడు మనం అనుభవిస్తున్నాం. ఇండియా లో కూర్చొని ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్సును చేయగలుగుతున్నాం. అంబాసిడర్, ఫియట్, మారుతి వంటి నాలుగైదు మోడల్స్ తప్ప మిగిలిన కార్లు మనకు తెలియదు. ఇప్పుడు రోల్స్ రాయిస్ మొదలు అనేక విదేశీ కార్లు మన రోడ్లపై తిరుగుతున్నాయి. విమానాలలో ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు చుట్టేస్తున్నాం.ఈ సకల భోగాలన్నీ పీవీ నరసింహారావు కల్పించిన ఆర్ధిక సంస్కరణల మహాఫలమే. ఇదే దార్శనికిత, దేశభక్తికి ప్రతీక. మౌనం విలువ, మాట విలువ తెలిసిన వాడు కాబట్టే అన్ని భాషలను నేర్చుకున్నా కొన్ని సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించారు. ఒక సందర్భంలో,  స్పానిష్ లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదీ మంత్రిత్వ ప్రతిభలో భాగమే. దార్శనికత, దేశభక్తి, సకలశాస్త్ర జ్ఞానసంపద, సంయమనం,ఆచరణాశీలం కలిగిన జ్ఞానయోగి, కర్మయోగి పీవీ. మహారాజులు,చక్రవర్తుల కాలం తర్వాత, ఆధునిక యుగంలో, నేటి భారతంలో పీవీ నరసింహారావు నిస్సందేహంగా మహామంత్రి శబ్దవాచ్యుడు.అచ్చమైన ఆంధ్రుడు, స్వచ్ఛమైన భారతీయుడు. ఈ మహామనిషికి, ఈ మహామనీషికి (ప్రతిభామూర్తి) భారతప్రభుత్వం ‘భారతరత్న’ ప్రదానం చేసి, భారతీయ ఔన్నత్యాన్ని నిలబెడుతుందని ఆకాంక్షిద్దాం.భారతరత్న గౌరవాన్ని పొందిన పూర్వ ప్రధాని వాజ్ పెయి, పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కంటే పీవీ నరసింహారావు ఏ మాత్రం తక్కువవారు కారు. నిజం చెప్పాలంటే, వారిద్దరి కంటే కూడా బహుముఖ ప్రతిభామూర్తి. శతజయంతి స్మరణలో, ‘శకకర్త’ పీవీకి శతాధిక వందనాలు.

Also read: ఆచరణలో చూపించాలి ఆదర్శాలు

Previous article
Next article
Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles