వచ్చింది స్వాతంత్ర్యం ముప్పాతిక శతాబ్దం కింద
పరాయి పాలనలో బానిస బ్రతుకుకు చరమ గీతం పాడింది
తెల్లతోలు ఆధిక్యం అడుగంటింది.
దేవాలయాలను ధ్వంసం చేసిన తురుష్కుల కంటే
సంస్కృతాన్ని మనకు పరాయిని చేసిన ఆంగ్లేయులకంటే
మన చరిత్రను వక్రీకరించి విద్యా వ్యవస్థను మార్చి
మరింత అపకారం చేశారు కొందరు మేధావులు.
పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటి ప్రాజెక్టులు
ప్రభుత్వరంగ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి
జనం భక్తితో, దేశ భక్తితో ఓట్లు వేశారు.
త్యాగాలు చేసిన శాస్త్రి, నందాల తరం ప్రజాస్వామ్యం పోయి
స్వార్థ పరుల స్కాము స్వామ్యం వచ్చింది
సారా బాటిళ్లు, బిరియాని పాకెట్లకు కార్యకర్తలు వచ్చారు
కులం, మతం, ప్రాంతం పేరున ఓట్లు పడుతున్నాయ్
డబ్బు, బలం, అధికారం రాజ్యమేలుతున్నాయ్
చేవ గలిగిన నాయకులు చేష్ఠలుడిగి కూర్చున్నారు
చేతగానివాళ్ళు డబ్బుతో పార్టీ టికెట్లను, ఓట్లను కొంటున్నారు.
మిశ్రమ ఆర్థిక విధానం పోయి మార్కెట్ ఎకానమీ వచ్చింది
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జరుగుతూంది
విద్యుద్దీపాలు, నీళ్ళు, రోడ్లు పల్లె బాట పట్టాయి
అయినా పల్లె వెలవెల బోయింది పట్టణీకరణతో.
తలసరి ఆదాయం పెరిగిందన్నారు
కంప్యూటర్ ఉద్యోగాలతో ఆదాయాలు పెరిగాయి
కాని ఆహారం, పెట్రోలు సెగ పెరుగుతూనే ఉంది.
ఓటు ఎందుకు వేస్తున్నామో జనానికి తెలియదు
తమ లక్షల కోట్ల డబ్బును నాయకులు ఏం చేస్తున్నారో పట్టదు
ఎన్నికైన నాయకులకు చట్టసభల్లో ఏం చేయాలో తెలియదు
సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేంత పరిజ్ఞానం లేదు
హక్కులు ధర్నాలు తెలుసు కాని బాధ్యతలు మాత్రం పట్టవు
వీడికి కొళాయి కనెక్షను, బామ్మరిదికి కాంట్రాక్టు ఇప్పించడం మాత్రం తెలుసు.
నాయకులు తమ జీత భత్యాలు పెంచుకుంటారు
వ్యాపారులు వస్తువుల ధరలు పెంచుతారు
శ్రమ జీవులు కూలీ పెంచుతారు
ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగవు, తగ్గుతాయి.
సగటు జీవి చుట్టూ సుఖాన్నిచ్చే వస్తువులు పెరిగాయి
మోసం, ద్వేషం, ఆత్రం, తాపత్రయం, తపన మరింత పెరిగాయి
‘అలో లక్ష్మణా’ అనే బదులు ‘అయ్యో రామా’ అంటూ బతికేస్తున్నాడు.
Also read: విశ్వరాధరికం
Also read: “హరే కృష్ణ” – సమీక్ష
Also read: లాజిక్
Also read: “తెలుగు”
Also read: “మానవ జీవితంలో భగవద్గీత”