(‘ THE PATH’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
39. సంచారి తత్త్వాలు
——————-
కొండల మధ్యన ఒక స్త్రీ తన కుమారునితో నివసిస్తుండేది. అతడు ఆమెకు మొదటి సంతానం మరియు ఏకైక సంతానం.
వైద్యుడు పక్కన ఉండగానే ఆ పిల్లడు జ్వరంతో చనిపోతాడు. తల్లి దుఃఖంతో దిక్కుతోచని దైపోయింది. ఆమె వైద్యుని ఎదుట దుఃఖించి అతనిని ఇట్లా వేడుకుంది. “దయ చేసి చెప్పండి. నా కొడుకు బాధని తొలగించిందీ, అతని పాటని నిశ్శబ్దం చేసిందీ — ఏమిటి?”
వైద్యుడు ఇలా అన్నాడు ” అది జ్వరం అమ్మా!”
తల్లి ” జ్వరమంటే ఏమిటి?”
వైద్యుడు ” నేను వివరించలేను. అది ఒక అనంతంగా చిన్నదైన వస్తువు. అది శరీరంలో ప్రవేశిస్తుంది. మన కళ్ళతో మనం దాన్ని చూడలేము,” అన్నాడు. అప్పుడా వైద్యుడు వెళ్లి పోయాడు. ఆమె ” అనంతమైన చిన్నది. మన కళ్ళతో చూడలేము,” అని పదే పదే అనుకోసాగింది.
ఆ సాయంత్రం మత గురువు ఆమెను ఓదార్చడానికి వచ్చాడు. ఆమె బాగా ఏడ్చింది. ఏడుస్తూనే ” నేను నా కొడుకుని ఎందుకు పోగొట్టుకున్నాను? అతడు – నేను జన్మఇచ్చిన ఏకైక సంతానం.’’
ఆ మత గురువు” అమ్మాయ్! అది దైవేచ్ఛ,’’ అని సమాధానం చెప్పాడు.
ఆ యువతి “దైవమంటే ఏమిటి? ఎక్కడుంటాడు? నేనా దైవాన్ని చూసి నా గుండెల్లో కన్నీళ్లు ఆయన ముందు కారుస్తాను. నా హృదయంలో నెత్తురు ఆయన పాదాల ముందు పోస్తాను. ఆ దైవమెక్కడుంటాడో చెప్పండి?” అంది.
ఆ పూజారి ఇలా చెప్పాడు. “దైవం అనంత, విశాల స్వరూపం. మానవ దృష్టికి కనిపించడు.”
ఆ యువతి ఏడుస్తూ ఇలా అంది. “ఒక అనంత విశాల స్వరూపంయొక్క ఇచ్చతో ఒక అనంత స్వల్ప పదార్థం నా కుమారుని చంపిందన్న మాట! ఐతే మనమేమిటి? చెప్పండి. మనమేమిటి?”
అదే సమయంలో ఆ యువతి తల్లి, శవంపై కప్పే గుడ్డతో ఆ గదిలోకి వచ్చి తన కూతురు — పూజారీ మాట్లాడుకునే మాటలు వింది. అప్పుడామె ఆ గుడ్డను పక్కన పెట్టి, కూతురి చేతిని తన చేతిలోకి తీసుకొని ఇలా చెప్పింది. “అమ్మాయీ! మనకు మనమే అతి చిన్న పదార్థమూ మరియు అనంత విశాల స్వరూపమూనూ! ఇంకా ఆ రెంటికి మధ్య — మార్గం కూడా మనమే!”
Also read: రాజదండము
Also read: అన్వేషణ
Also read: నేరమూ, శిక్షా
Also read: చెెవిటి భార్య
Also read: ఒక దేవుడు మరియు చాలా మంది దేవుళ్ళు