డా. ఆరవల్లి జగన్నాథస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ,జనసేన పొత్తు ఇతర రంగాలలోకంటే సినీ రంగంపై భాగా ఉందని అంటున్నారు. జనసేన అధినేత,నటుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వడం పట్ల నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం చెప్పడం, ఆయన వ్యాఖ్యలకు పవన్ సోదరుడు నాగబాబు ట్వీట్ లో ఘాటుగా ప్రతిస్పందించడం మాధ్యమాలలో విపరీతంగా చక్కెర్లు కొడుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన రాజకీయపరమైన వ్యాఖ్యలకు స్పందనగా నాగబాబు పేర విడుదలై లేఖలో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చినట్లుందని వారద్దరి వాదనలు విన్న వారు అంటున్నారు.`రాజకీయాల్లో అనేకసార్లు నిర్ణయాలు మారుతుంటాయి. పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తూ దాని గెలుపు కోసం కృషి చేయడంలో విస్తృత ప్రజా ప్రయోజనం ఉంది. జీహచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ, జనసేన సత్తా చాటబోతున్నాయి. ఈ దేశానికి బీజేపీతో, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం` అనేంత వరకు నాగబాబు మాటలకు ఎవరూ అభ్యంతర పెట్టడంలేదు. కానీ మిగతా వ్యాఖ్యలు తోటి నటుడిని తూలనాడినట్లుగానే ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. అభిప్రాయాలను వారి మాటల్లోనే….
మీరంటే ఇష్టం…కానీ: ప్రకాష్
‘మీరంటే (పవన్) నాకు ఇష్టం.కానీ బీజేపీతో కలవాలన్న మీ నిర్ణయం నిరాశపరిచింది. ఎవరు అబద్ధాలు చెప్పినా మీకు ప్రశ్నించేతత్వం, సత్తా, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అలాంట ప్పుడు ఇంకొకరి భుజాన ఎక్కడం ఎందుకు? మిమ్మల్ని చూసి ఎంతో మంది మీ పార్టీలోకి వస్తే నాకు నచ్చిన నాయకుడు ఆయన అని మీరు అనడం ఏమిటి? ఆయన ఓటు బ్యాంకు ఎంత? మీ ఓటు బ్యాంకు ఎంత? మీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. గెలుపు ఓటములు తర్వాత. ఈ రోజు కాకున్నా రేపైనా మీరు బలం పుంజుకుంటారు. పోటీకి సిద్ధపడిన మీరు బీజేపీ పెద్దల మాటతో వెనక్కి తగ్గితే మిమ్మల్నినమ్ముకున్నవారి మాటేమిటి? అందరినీ బలోపేతం చేయగల మీరు కూడా అలా వెళ్లిపోవడం బాగాలేదు. మీరు నాయకుడు. మీకు కలలు ఉన్నాయి.వాటిని సాకారం చేసుకునేందుకు చాలా దూరం ప్రయాణించాలి. 2014 ఎన్నికలలోఇంద్రుడు, చంద్రుడులా కనిపించి, గత ఏడాది (2019) ఎన్నికలలో మోసగాళ్లు అనిపించిన వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ మంచివారు ఎలా అయ్యారు? మీలాంటి వారు అలా చేయడం బాగాలేదు. స్థానికంగా మీరు మంచి నాయకుడు.వారు మిమ్మల్ని అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేస్తారు. బలహీనపరుస్తారు. వారిపై ఆధారపడేలా చేస్తారు. మీకు వయసుంది. సత్తా ఉంది. కాస్త ఓపికగా ఉండండి. తెలుగువారిగా ఉండండి, తెలుగుసత్తా చూపండి…`
నాగబాబు ప్రతిస్పందన
`ఎవడికి పవన్ కల్యాణ్ హాని చేశాడని ప్రతిపనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్!.నీ రాజకీయ డొల్లతనం ఏమిటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడడం నాకు ఇంకా గుర్తింది. నిర్మాతలను ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింసపెట్టావో, ఇచ్చిన డేట్స్ ను కాన్సిల్ చేసి ఎంత హింసకు గురిచేశావో ఇంకా గుర్తున్నాయి. డైరెక్టర్లను కాకాపట్టి నిర్మాతలను కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడడం ఏం తెలుసు? నీలాంటి కుహనా మేధావులు ఎంత వాగినా బీజేపీ, జనసేన కూటమిని ఆపలేరు. ప్రకాష్ రాజ్…ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కల్యాణ్ అనే ఒక మంచి మనిషి, నిస్వార్థపరుడైన నాయకుడిని విమర్శించు. మీడియా వారు అడిగారు కదా అని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటపెట్టకు….’
`కమల` అభ్యర్థుల గుర్రు
తమకు జనసేన మద్దతు లభించడం హర్షణీయమే అయినా తమకు మద్దతుగా ప్రచారం చేయకపోవడం పట్ల బీజేపీ అభ్యర్థులు, నాయకులు గుర్రుగా ఉన్నారట. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి డి. అరవింద్ తదితరులు టీఆర్ఎస్ ను గట్టిగా ఢీకొంటుంటే, ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న డివిజన్లలోనైనా పవన్ కల్యాణ్ కానీ, ఆయన పార్టీ నాయకులు గాని ప్రచారం చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారట. అగ్రనటులు కొందరు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసినప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని, ఈ తరుణంలో బీజేపీకి మద్దతుగా ప్రచారానికి వెళితే పరిశ్రమతో వైరం తెచ్చుకున్నట్లవుతుందని వెనుకాడారని చెబుతున్నారు.