ఆమె పలికిన ప్రతి పదం మధురమైన పాటై ప్రేక్షకుల్ని మైమరపించింది…
ప్రతి పాటకు జీవం పోసిన గాన కోకిల ఆమె …
తన చివరి రోజుల వరకూ సంగీత సాధనలోనే పరితపించిన కళా పిపాసి ఆమె…
దేశంలోని అత్యున్నత పురస్కారాలన్నీ ఆమె సొంతం…
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తరువాత అంతటి ఘనతను పొందిన గొప్ప గాయని ఆమె…
ఆమెనే లతా మంగేష్కర్..
భారత సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరది.
ఆమె పాడిన ప్రతి పాట ఒక అద్భుతం. భారత కోకిలగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
లతా మంగేష్కర్ 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు ఆమె మొదటి సంతానం. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ పెద్ద సంగీత కళాకారుడు. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచింది. పువ్వు పుట్టగానే మరిమళించు అన్నట్లు లతా మంగేష్కర్ చిన్నతనంలోనే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.
కుటుంబానికి పెద్ద తల లతే
అయితే, ఆమె తండ్రి దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించి 1942లో మరణించారు.. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. ఆ సమయంలో నవయుగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లత కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు.
పువ్వు పుట్టగానే మరిమలించినట్లు లతా మంగేష్కర్ చిన్నతనంలోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్‌ల వద్ద శిష్యరికం చేశారు.
‘నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్ భారీ’ అనే పాటను మరాఠీ సినిమా ‘కిటీ హాసల్’ (1942) కోసం ఆమె పాట పాడారు. అదే ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ చిత్రం విడుదల కాలేదు. అనంతరం నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన పహలీ మంగళా-గౌర్ (1942) చిత్రంలో ఒక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. మరాఠీ చిత్రం గజబాహు (1943) లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ అనే పాట ఆమె పాడిన మొదటి హిందీ పాట.
నటిగా, గాయనిగా…
ఆ తర్వాత చిముక్లా సుసార్ , గజబాహు , జీవన్ యాత్ర (1946), మందిర్ (1948) తదితర చిత్రాలలో నటించారు. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు, లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర శిక్షణ పొందారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ చిత్రం ‘ఆప్ కీ సేవా మే’ (1946) లో కూడా ఆమె పాట పాడారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం ‘బడీ మా’ (1945) చిత్రంలో లతా, అమె చెల్లెలు ఆశా కూడా చిన్న పాత్రలు పోషించారు. 1947లో పాకిస్థాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్థాన్ కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే దగ్గర సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ దగ్గర కూడా ఆమె సంగీత పాఠాలు నేర్చుకున్నారు. మొదట్లో నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన లత 1947లో ‘మజ్ బూర్’ చిత్రంతో గాయనిగా తన పాటల అధ్యాయాన్ని ప్రారంభించారు. సంగీత దర్శకుడు గులాం హైదర్ లతను గాయనిగా తీర్చిదిద్దారు. సి.రామచంద్ర లత పాటలకు ప్రాణం పోసి, ఆమె చిత్ర రంగంలో నిలదొక్కుకోవడానికి తన వంతు కృషి చేశారు.
1948లో వినాయక్ మరణించిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలో 1949లో వచ్చిన ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనేవాలా…’ పాటతో ఆమె మొదటి హిట్ అందుకున్నారు . ఈ క్రమంలో ‘అల్బేలా,’ ‘ఛత్రపతి శివాజీ,’ ‘అనార్కలీ’ చిత్రాలకు గాను లత పాడిన పాటలు మంచి విజయాలు సాధించాయి. అనంతరం ‘అందాజ్,’ ‘బడీ బహన్,’ ‘బర్సాత్,’ ‘ఆవారా,’ ‘శ్రీ 420,’ ‘దులారీ’ చిత్రాల్లోని పాటలు ఆమెను హిందీ నేపధ్యాగాయని పీఠం పై కూర్చోబెట్టాయి.
అనేకమంది సంగీత దర్శకులు
1950వ దశకంలో మంగేష్కర్ అనిల్ బిశ్వాస్, శంకర్ జైకిషన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నాథ్ హుసన్ లాల్, భగత్ రామ్, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్,రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో అనేక పాటలు పాడారు.
‘మొఘల్-ఎ-అజమ్’ (1960) చిత్రంలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. అలాగే, ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి’ (1960) సినిమాలో మీనా కుమారి నటించిన, శంకర్-జైకిషన్ స్వరపరచిన ‘అజీ దస్తాన్ హై యే’ పాట కూడా అప్పట్లో పెద్ద హిట్ అయింది. 1962లో హేమంత్ కుమార్ స్వరపరచిన ‘బీస్ సాల్ బాద్’ చిత్రంలోని ‘కహీ దీప్ జలే కహీ దిల్’ పాటకు ఆమె రెండవ ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు.
నెహ్రూ చేత కన్నీరు పెట్టించిన పాట
1963 లో చైనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట ‘అయే మేరే వతన్ కే లోగో (నా దేశ ప్రజలారా)’ పాట పాడారు . ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారట.
1960లలో లత తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన్ వీరి భాగస్వామ్యం 35 సంవత్సారాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘పరస్మిని’ (1963), ‘మిస్టర్. ఎక్స్ ఇన్ బాంబే’ (1964), ‘ఆయే దిన్ బాహర్ కే’ (1966), ‘మిలన్’ (1967), ‘అనిత’ (1967), ‘షగిర్ద్’ (1968), ‘మేరే హమ్ దమ్ మే దోస్త్’ (1968), ‘ఇంతఖాం’ (1969), ‘దో రాస్తే’ (1969), ‘జీనే జీ రాహ్’ (1969) వంటి సినిమాలలో పాటలు పాడారు లతా. ‘జీనే కీ రాహ్’ సినిమాకి లత మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
ఆశాభోంస్లేకు ఓపీ నయ్యర్ బాసట
హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు అనేక మంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓ.పి.నయ్యర్ మాత్రం లతపాట తన సంగీతానికి పనికిరాదని లత సోదరి ఆషాకు లతకు సమాంతరంగా అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.
చిత్రనిర్మాతగా లత
లత సినీనిర్మాతగా మరాఠీలో ‘వాదల్’ (1953), ‘కాంచన్ గంగా’ (1954), హిందీలో ‘ఝూంఝుర్’ (1954), ‘లేకిన్’ (1990) చిత్రాలు నిర్మించారు. అలాగే సంగీత దర్శకురాలిగా ‘రాంరాంపహునా’ (1950), ‘మొహిత్యాంచి మంజుల’ (1963), మరాఠా ‘టిటుకమేల్ వాలా’ (1964), ‘స్వాథూ మాన్ సే’ (1965) తదితర చిత్రాలకు పనిచేశారు.
మరాఠీ సంగీత దర్శకులు హ్రిదయన్త్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ ఖాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారథ్యంలో పలు మరాఠీ చిత్రాలలో కూడా ఆమె అనేక పాటలు పాడారు . 1960, 1970 దశకాలలో సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి వారి సంగీత సారథ్యంలో పలు బెంగాలీ చిత్రాలలో కూడా పాటలు పాడారు. 1967లో మొదటిసారి కన్నడ చిత్రానికి పాట పాడారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ బెర్లేకర్ సంగీత దర్శకత్వం వహించారు.
అలనాటి అగ్రగాములతో పాటలు
అలనాటి అగ్ర గాయనీగాయకులతో సైతం లత అనేక పాటలు పాడారు. ముఖేష్, మన్నా డే, మహేంద్ర కపూర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఆమె సంగీత ప్రహసనం నిరంతరాయంగా కొనసాగింది.
అలాగే, 1970లలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్, రాహుల్ దేవ్ ల సంగీత దర్శకత్వంలో అనేక హిట పాటలు పాడారు. రాహుల్ దేవ్ సంగీత దర్శకత్వంలో ‘అమర్ ప్రేమ్’ (1972), ‘కరావన్’ (1971), ‘కటి పతంగ్’ (1971), ‘ఆనంద్’ (1975) వంటి చిత్రాలలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మైమరపిస్తున్నాయి.
1973లో ‘పరిచయ్’ చిత్రం కోసం పాడిన ‘బీతీ నా బితాయ్’ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట కాదలీ చెనకదలీ. ఈ పాట ‘నెల్లు’ (1974) చిత్రం లోనిది. 1975లో ‘కోరా కాగజ్’ చిత్రంలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ స్వరపరచిన ‘రూతే రూతే పియా’ పాటకు కూడా ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.
1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజళ్ళు, గణేశ్ హారతులు, సంత్ తుకారాం రాసిన అభంగ్ లు, కోలీ గేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారు. వీటిలో సంత్ తుకారాం అభంగ్ లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె సోదరుడు హృదయనాథ్ స్వరపరిచారు.
ప్రసిద్ధుల కుమారులతో …
1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన “సత్యం శివం సుందరం’’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘సత్యం శివం సుందరం’ అనే పాట అతిపెద్ద హిట్ గా నిలిచింది. 1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో రాహుల్ దేవ్ బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్ కొడుకు), రాజేష్ రోషన్ (రోహన్ కుమారుడు), అనూ మాలిక్ (సర్దార్ మాలిక్ కొడుకు), ఆనంద్-మిలింద్ (చిత్రగుప్త్ కుమారులు) లతో పనిచేశారు. అస్సామీ భాషలో కూడా ఆమె అనేక పాటలు పాడారు. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ చిత్రంలో ఆరారో ఆరారో పాట, సత్య చిత్రంలో వలై ఒసీ పాట పాడారు. బాలీవుడ్ లో బప్పీలహరి సంగీత సారథ్యంలో లతా అనేక హిట్ పాటలను పాడారు. 1985 నుంచి గత రెండు సంవత్సరాల క్రితం వరకు అనేక మంది సంగీత దర్శకుల సారధ్యంలో వేలాది పాటలు పాడారు. 1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డ్ లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళులర్పించారు. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ పాడటం విశేషం. 1994లో రాహుల్ దేవ్ ఆఖరి సినిమాలోని ఆఖరి పాట ‘కుచ్ నా కహో’ (‘1942: ఎ లవ్ స్టోరి’) పాట పాడారు.
రాజ్యసభ సభ్యత్వం
1999 లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆమె ఎక్కువ సభలకు హాజరుకాలేదు. 2005లో దాదాపు 14ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ నదీమ్-శ్రవణ్ సంగీత దర్శకత్వంలో ‘బేవఫా’ (2005) చిత్రంలో ‘కెసె పియా సై మై కహూ’ పాట పాడారు. ‘పేజ్ 3’ (2005) లో ‘కిత్నే అజీబ్ రిష్తే హై యహాన్ పర్’ పాట, ‘జైల్’ (2009) చిత్రంలో ‘దాతా సున్ లే,’ ‘సత్రంగీ పారాచ్యూట్’ (2011) లో ‘తేరే హస్నే సే ముఝ్కో, జీనే క్యా హై’ వంటి పాటలు పాడారు.
28 నవంబర్ 2012లో లత తన స్వంత ఆడియో లేబుల్ ఎల్.ఎం.మ్యూజిక్ ద్వారా భజనపాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్తో కలసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా “స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్” అనే ఆల్బంలో ‘ఓ జానే వాలే తుఝ్కో’ అనే టైటిల్ పాట పాడారు ఆమె. ఈ ఆల్బంను రామ్ శంకర్ స్వరపరచగా, ఎ.కె.మిశ్రా సాహిత్యం అందించారు.
నిదురపోరా తమ్ముడా లత తొలి తెలుగు పాట
ఆమె 1948 నుంచి 1978 వరకుదాదాపు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించారు. అలాగే, గానకోకిల అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. 1955లో ఏఎన్నార్, సావిత్రి నటించగా సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన `సంతానం` చిత్రంలో `నిదురపోరా తమ్ముడా` లత పాడిన తొలి తెలుగు పాట. ఈ పాట సూపర్ పాపులర్ అయ్యింది. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించగా సాలూరి రాజేశ్వరరావు కంపోజ్ చేసిన `దొరికితే దొంగలు` చిత్రంలో `శ్రీ వేంకటేశా..` అనే గీతాన్ని ఆలపించిన లతా మంగేష్కర్ చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన `ఆఖరి పోరాటం` చిత్రంలోని `తెల్లచీరకు` పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు.
పురస్కార పరంపర
భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, మహారాష్ట్ర భూషన్ పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, రాజాలక్ష్మీ అవార్డు, ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు. అప్సరా అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, తాన్ సేన్ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారం లాంటి అనేక ఉన్నత పురస్కరాలను పొందిన గొప్ప గాయని లత. సంగీత ప్రపంచంలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించిన లత 92 ఏళ్ల వయస్సులో 06 ఫిబ్రవరి 2022న ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసారు. లతామంగేష్కర్ సోదరీసోదరులు ఆషా, హృదయనాథ్, ఉషా, మీనాలు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలని ఆశించారామె. కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీత ప్రపంచంలోనే స్థిరపడింది. తనకు నచ్చిన గాయకుడు సైగల్ అని చెప్పుకునే లత ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలోనే, పాటల ప్రవాహంలోనే మునిగి తేలడం విశేషం. ఆమె గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. లతా మంగేష్కర్ మరణం ఎన్నటికీ సంగీత ప్రపంచానికి తీరని లోటుగానే మిగిలిపోతుంది.
–దాసరి దుర్గా ప్రసాద్