Saturday, December 21, 2024

భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

వంశపారంపర్యంగా వచ్చిన మంచిపేరునే రాహుల్ గాంధీ కష్టపడి సంపాదించుకున్నారు. ఆయన రాజకీయ జీవితానికి మాత్రమే ఇది శుభవార్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సాఫల్యానికే పరిమితమైనది కూడా కాదు. భారత దేశ భవిష్యత్తుకు కూడా ఇది శుభవార్త కావచ్చు.

గతవారం రాహుల్ గాంధీ లోక్ సభలో అదానీ వ్యవహారంలో ప్రధాని లాలూచీని ప్రశ్నించిన తీరు ఇదివరకటి మెతక, అస్పష్ట వైఖరి కంటే భిన్నమైనది. 2019 ఎన్నికలకు ముందు రఫేల్ లావాదేవీలపైన ఒక్కడే గొంతు చించుకోవడం కంటే ఇది బలమైన దాడి. ఇది పదునుగా, ప్రశాంతంగా సాగింది. మామూలు ఉపన్యాసకళకు సంబంధించిన అంశం కాదు ఇది. ఈ విషయంలో వాస్తవాలు ఆదారంగా అధికారపార్టీపైన సాధికారికంగా, ఆత్మవిశ్వాసంతో విరుచుకుపడిన తీరు గమనార్హమైనది. అధికారపార్టీకి చెందిన వెక్కిరింతరాయుళ్ళపైన అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో రాహుల్ విమర్శలు కురిపించారు. తన సొంతపార్టీ నాయకులూ, ప్రజలూ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ అంతర్జాతీయ కుంభకోణాన్ని చాపకిందికి నెట్టడానికి దర్బారీ మీడియా (ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించే మీడియా) ఎంత ప్రయత్నించినా అదానీ-మోదీ లాలూచీపైన ఆరోపణ చాలా దూరం ప్రయాణం చేస్తుందని ఇప్పటికే స్పష్టమైపోయింది.

Also read: భారత రాజకీయాలలో ఇది ప్లాస్టిక్ యుగం, ఫ్లెక్సీలలో అర్థాలు వెతక్కండి!

ఈ రాహుల్ గాంధీని గతంలో కూడా నేను చూశాను. మీకు తేదీ కావాలంటే ఇస్తున్నాను.  అది జనవరి 30. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా చివరి సభ జరిగిన రోజు. తుది బహిరంగసభలో వాన లేదా మంచు కురిసే అవకాశాలు తొంభైశాతం ఉన్నాయని రాహుల్ సహాయకుడు బైజు రెండు రోజులు ముందుగానే నాకు చెప్పారు. ఎంతో కచ్చితంగా ముందస్తుగా ఊహించి చెప్పారు! అప్పటికే శ్రీనగర్ మంచుగడ్డగా తయారయింది. ఆ రోజు ఉదయం నుంచి మంచు పడడం (హిమపాతం) ప్రారంభించింది. మేము బహిరంగ సభ జరిగే స్టేడియంకు నడుస్తున్న దారిలో మంచుకుప్పలు ఉన్నాయి. బురద ఉంది. కాళ్ళు మంచులో కూరుకుపోతున్నాయి. సభ ప్రారంభమైన తర్వాత పెద్దపెద్ద మంచు ముద్దలు ఆకాశం నుంచి మాపైన వేగంగా పడసాగాయి.

జోడో యాత్ర ముగింపు సభ చారిత్రాత్మకం

మంచును తట్టుకునేందుకు నేను వేసుకున్న బూట్లు అప్పటికే తడిసిపోయాయి. మంచునిండిన చల్లటి నీటిలో నా కాళ్లు గడ్డకట్టే పరిస్థితికి వచ్చాయి. చలిని తట్టుకోవడానికి నేను వేసుకున్న జాకెట్ (అది మైనస్ అయిదు డిగ్రీల చలిని తట్టుకుంటుందని పూచీ ఇచ్చారు ఉత్పత్తిదారులు, అమ్మకందారులు) మంచువానకు తట్టుకోలేకపోయింది.  వేదికపైన కప్పులేదు. ప్రజల నెత్తిన కప్పు లేనప్పుడు నాయకుల నెత్తిన కూడా కప్పు ఉండరాదని రాహుల్ గాంధీ ఆదేశం. ఈ సమావేశానికి తెగించి హాజరైన కొన్ని వందలమంది ప్రజలు నాయకుడికంటే తెలివైనవారమని నిరూపించుకున్నారు. వాళ్ళలో చాలా మంది గట్టి గొడుగులను పట్టుకొని వచ్చారు.  వేదికపైన నాయకులలో అత్యధికులు తమిళనాడు నుంచి వచ్చినవారు. వారికి హిమపాతం అనుభవం ఏమిటో తెలిసి వచ్చింది. వాతావరణం దృష్ట్యా వక్తల సంఖ్య తగ్గించాలనే సూచనను రాహుల్ తిరస్కరించారు. ప్రసంగిచడానికి ఆయన వంతు వచ్చేసరికి గంట పట్టింది. ప్రసంగం చేసేవారి నెత్తిన గొడుగు పట్టుకునే వ్యక్తిని దూరంగా వెళ్ళిపొమ్మని చెప్పడం రాహుల్ ప్రసంగానికి ముందు చేసిన మొదటిపని. ఆ తర్వాత నలభై నిమిషాలపాటు నింపాదిగా, ప్రతి వాక్యాన్ని స్పష్టంగా పలుకుతూ ప్రసంగించారు. అప్పుడే ముగిసిన భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. తన అనుమానాలనూ, శారీరకశక్తిపైన తనకున్న అతిశయాన్నీయాత్ర ఎట్లా పూర్వపక్షం చేసిందో, ఒక బాలిక రాసిన ఉత్తరం తనకు యాత్రలో ఎట్లా నడిచే శక్తిని ప్రసాదించిందో చెప్పారు. కశ్మీరీ ఫిరెన్ (జాకెట్) ను, తలటోపీని ధరించిన రాహుల్ తాను టీషర్టు మాత్రమే ధరించి మంచులో యాత్ర చేయడం గురించి మాట్లాడారు. వీధిలలో యాచిస్తున్న ముగ్గురు చిన్నారుల పరిస్థితి తనను టీ షర్టుతోనే మంచులో యాత్ర చేసేవిధంగా  ఏ విధంగా పురమాయించిందో, ప్రోద్బలం చేసిందో చెప్పారు. తన పూర్వీకులకు కశ్మీర్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. కశ్మీరీ ఆధ్యాత్మిక సంప్రదాయాలు అస్సాం, కర్ణాటక, మహారాష్ట్రలను ఎట్లా కలిపి ఉంచినాయో చెప్పారు.

Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

నాకు ఫోన్ కాలంటే భయం

జేబులో నుంచి మొబైల్ పోన్ బయటకు తీసి చూపిస్తూ తనకు ఒక ఫోన్ కాల్ ఎంత ముఖ్యమో చెప్పారు. తన పితామహి (తాతమ్మని) ఎలా కాల్చిచంపారో స్కూల్లో చదువుకుంటున్న తనకు ఈ పోన్ ద్వారానే తెలిసిందని చెప్పారు. తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తన తండ్రిని హత్య చేసిన సంగతి కూడా ఈ ఫోన్ ద్వారానే తెలిసిందని సభికులతో పంచుకున్నారు. మన సైన్యంలో సేవ చేస్తున్న జవాన్ల మరణం గురించి వారి పిల్లలకూ, కశ్మీర్ అలజడిలో మరణించినవారి గురించి వారి సంతానానికీ ఇదే విధంగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయని చెప్పారు. అటువంటి ఫోన్ కాల్స్ ను ఆపు చేయడమే తన యాత్ర ముఖ్యోద్దేశమని చెప్పారు. ఈ సంగతి చెప్పేటప్పుడు రాహుల్ గాంధీ నాటకీయత ప్రదర్శించలేదు. గొంతు గద్గదం అయినట్టు నటించలేదు. అటువంటి అభినయాలు బొత్తిగా లేవు. ఫోన్ కాల్స్ తెచ్చే మనోవ్యథ గురించీ, విషాదం గురించీ మోదీ-షా-దోవల్ వంటివారికి ఎప్పటికీ అర్థం కాదని అనడం తప్పిస్తే రాహుల్ ప్రసంగంలో రాజకీయాంశమే లేదు. రాజకీయ వ్యూహం లేదు. తెలివిగా ప్రత్యర్థులపైన దాడి చేసి బోల్తా కొట్టించాలనే ఉద్దేశం లేదు. తెలివిమీరిన జుమ్లాలు లేవు. యాత్ర తర్వాత ఏమి చేయబోతున్నారనే విషయం ప్రకటిస్తారని మా బోటి వాళ్ళు చాలామందిమి ఎదురు చూశాం. అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఇంకా ఏదో ఒకటి చెబుతారని అందరూ ఎదురు చూసే సమయంలో ఎప్పటిలాగే ఆయన తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించారు.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

మంచుకురిసిన ఆ రోజు కశ్మీర్ లోయ లోపలా, బయటా భారతీయులందరూ పట్టుకొని వేళ్ళాడదగిన, రాపాడవలసిన అంశం ఒకటి రాహుల్ గాంధీ అందించారు.  భారత దృక్పథం ఎట్లా ఉండవలసింది, ఎట్లా ఉండే అవకాశం ఇంకా ఉంది అనే విషయానికి సంబంధించిన దృష్టికోణాన్ని ఆయన సమర్పించారు. అంతరంగికంగా ప్రశాంతంగా ఉంటూ విషయ స్పష్టత ఉన్నవారికి మాత్రమే సాధ్యమైన రీతిలో అతిసరళంగా ఆయన ప్రసంగం మొదలయింది. పరిశుభ్రమైన మనసు ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే ప్రేమతో కూడిని వెచ్చని చూపులు ఆయన నుంచి వెలువడినాయి. తీవ్రమైన నిర్ణయాన్ని ప్రతిబింబించే లోతైన ప్రశాంతచిత్తంతో ఆయన ప్రసంగించారు. 3,700 కిలో మీటర్ల దూరం నడిచిన రాహుల్ గాంధీ ఆ విధంగా తన ప్రసంగం చేయాలని నేను ఊహించలేదు. కోరుకోలేదు కూడా. కానీ ఒక సారి వెనక్కి తిరిగి చూస్తే అత్యంత ప్రవీణులు రాసినదానికంటే కూడా మెరుగ్గా రాహుల్ మాట్లాడారని అనిపిస్తుంది.

నాకు మాత్రం అదే రాహుల్ గాంధీ ఆగమన సుముహూర్తం.

బెడిసికొట్టిన ‘పప్పు’ దుష్ప్రచారం

గమత్తయిన విషయం ఏమంటే ‘పప్పు’ అనే రాహుల్ గాంధీకి ఉన్న ద్వేషనామం రాహుల్ గాంధీకి పెద్ద సానుకూలమైన అంశంగా పరిణమించింది. తనపైన తన ప్రత్యర్థులు సృష్టించిన ఊహాచిత్రానికీ, నిజంగా తనకూ ఎంత తేడా ఉన్నదో నిరూపించడం రాహుల్ కి ఏమాత్రం కష్టం కాలేదు. ఒక సారి ఎండలో అడుగుపెడితే సరిపోయింది. రాహుల్ వ్యక్తిత్వానికీ, ఆయనపైన జరిగిన దుష్ప్రచారానికీ, ఊహాచిత్రానికీ మధ్య ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని ప్రజలు వెంటనే తెలుసుకున్నారు. ఈ దేశంలో ఉన్న వేడినీ, దుమ్మూధూలినీ ఒక్కరోజు కూడా తట్టుకోలేని దిల్లీ బాబాలోగ్ (భద్రజీవులు)కు ‘పప్పు’ అనే పేరు సరిపోతుంది. రోజుకు పాతిక కిలోమీటర్ల చెప్పున కొన్ని రోజులు అనాయాసంగా నడిచే సరికే రాహుల్ పై ద్వేషంతో సృష్టించిన ఆ ఊహాచిత్రం ఛిద్రమైపోయింది. నీలివార్తల ప్రచారంలో పేరుమోసిన బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం కి రాహుల్ గాంధీ నడవడం లేదనీ, అబద్ధం చెబుతున్నాడనీ నీచమైన నిందలు ప్రచారం చేయడం తప్పితే వేరే గత్యంతరం లేకపోయింది. గర్విష్టి అయిన, సంపన్నుడైన, అన్నీ ఉండి సమంజసంగా మాట్లాడటానికి అంగీకరించని పనికిమాలిన వ్యక్తికి అన్వయించే పదం ‘పప్పు’.  రాహుల్ గాంధీ అందరి చేతులూ పట్టుకొని, కొందరిని కావలించుకొని, అందరితో కలసిమెలసి మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న దృశ్యాల ఫొటోలు ముమ్మరంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిపడేసరికి  ‘పప్పు’ అనే అబద్ధాన్ని చిత్తు చేశాయి. మన దేశం గురించీ, మన దేశ ప్రజల గురించి ఏ మాత్రం అవగాహన లేని బుద్ధిహీనుడు ‘పప్పు’ అని అర్థం. ఈ యాత్రలో వందలాది మంది కార్యకర్తలూ, మేధావులూ రాహుల్ గాంధీని కలుసుకొని మాట్లాడటం ఆ అబద్ధానికి నిలువు పాతరేసింది.  రాహుల్ గాంధీ మేధో విస్తృతి చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ‘పప్పు’ అనే ఊతపదం ప్రచారం జరగడం మూలంగానే ఇదంతా సాధ్యమైంది. చివరిగా చెప్పేది ఏమంటే,  ‘పప్పు’ ఊహాచిత్రాన్ని నిర్మించినవారికి వాస్తవం మొహం పగిలే విధంగా ఎదురుదెబ్బ కొట్టింది.

Also read: భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది

పోస్టర్ నుంచి బయటకి నడిచివచ్చిన రాహుల్

అంతిమంగా, నిజమైన రాహుల్ గాంధీ పోస్టర్ నుంచి బయటకు నడిచి వచ్చారు. ఆయన లోతైన, ప్రగాఢమైన అభిప్రాయాలు ఉన్నవాడు. లౌకికత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం అనే రాజ్యాంగ విలువలకూ, ఆదర్శాలకూ సంపూర్ణంగా అంకితమైన వ్యక్తి. దేశ, విదేశీ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించగల ఆలోచనాపరుడే కాకుండా అవసరమైనప్పుడు ఆత్మపరిశీలనకు ఉపక్రమించడానికి సైతం సంకోచించని మనిషి. క్షమాగుణం కలిగిన, ద్వేషాన్ని జయించిన మానవతావాది. అధికారం అంటే ఆకలి లేని రాజకీయవేత్త. నాటకీయతకూ, అబద్ధాలకూ దూరంగా ఉంటూ సూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. నరేంద్రమోదీకి రాహుల్ ఎంత భిన్నమో స్పష్టంగా, పదునుగా తెలియజేసే లక్షణాలు ఇవన్నీ.

అయితే, ఈ మంచి లక్షణాలన్నిటినీ వమ్ముచేసే అవకాశాలు కూడా లేకపోలేదు. నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారవచ్చు. దూరదృష్టి ఈ లోకానికి దూరమైనది కావచ్చు. తపస్సుతో అహంకారం రావచ్చు. అధికార వ్యామోహం లేకపోవడం అధికారంపట్ల వైరాగ్యంగా పరిణమించవచ్చు. ఇవీ నిజాయితీతో, విలువలతో కూడుకున్న రాజకీయం ఎదుర్కొనే సమస్యలు.

Also read: ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి

నిజాయితీ, విలువలూ ఆచరణ సాధ్యమని నిరూపించాలి

ఏది నైతికంగా సమర్థనీయమో అదే రాజకీయంగా సుసాధ్యమని నిరూపించగలగాలి. లేకపోతే వాస్తవిక రాజకీయాలకు దూరంగా పారిపోతున్నారనే అపబ్రధ తప్పదు. తన దార్శనికతనూ, నిజానికి రాజ్యాంగం దార్శినికతనూ దేశ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలూ, కాంగ్రెస్ పార్టీ నాయకులూ పంచుకునే విలువలుగా చేయడం రాహుల్ గాంధీ ఎదుట ఉన్న సవాలు. కాంగ్రెస్ ను దాని ఆత్మతో జోడించాలి. అధికార వ్యామోహం లేకపోవడం మంచి లక్షణం. కానీ మంచి చేడయానికి అధికారాన్ని ఆశించకపోవడం బాధ్యతను విస్మరించడం. పార్టీలో పెరిగిన తన స్థాయిని వినియోగించుకొని పార్టీని ఎన్నికల యంత్రాంగంగా మలచుకొని విజయానికి దోహదం చేసే  బాధ్యత రాహుల్ పైన ఉన్నది. ప్రజల  హృదయాలను గెలుచుకోవాలంటే అబద్ధాలు చెప్పాలని అందరూ విశ్వసిస్తున్న రోజులలో నిజం చెప్పడం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చుననీ, స్పందింపజేయవచ్చుననీ చేతల ద్వారా రాహుల్ నిరూపించాలి.

రాజకీయాలంటే నైతికవిలువల పతాకాన్ని ఎగురవేయడంతో సరిపోదు. మనం జీవిస్తున్న అస్తవ్యస్తమైన, గందరగోళమైన ప్రపంచంలో అటువంటి విలువలను అమలు చేయడమే సిసలైన రాజకీయం. ఇది కేవలం రాహుల్ గాంధీ లేక కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాల ఎదుట ఉన్న సవాలు మాత్రమే కాదు. భారత రిపబ్లిక్ మనుగడ కోరుకునేవారందరి ఎదుటా నిలిచిన సవాలు. దేశం రాహుల్ గాంధీని తన పరిష్వంగంలో తీసుకునే సమయంలో చీకటి రాజకీయాలలో రాజకీయ కార్యాచరణను ఆచరించి చూపించే సవాలును రాహుల్  గాంధీ స్వీకరించడం అనివార్యం.  

Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు  

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles