మానవతావాద మహాకవి: జాన్ ఎలియా
(ఒక అవిశ్రాంత అక్షరాన్వేషకుడి స్మృతిలో…)
జీవితాంతం ఒంటరి జీవిగా బతికిన ఒక భావుకుడు. తనతో సమానస్థాయి కలిగిన సహచర్యం కోసం అన్ని దిక్కులూ వెతికి వేసారి అక్షరాలకి బానిసయిన అరుదైన మనిషి. ఉర్దూ, అరబిక్, హిబ్రు, పర్షియన్, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ తదితర భాషల్నీ, వాటి మూలాల్నీ, ఆయా సాహి త్యాల్నీ ఆబగా తాగేసిన ఓ బక్కపల్చని దేహమున్న స్వాప్నికుడు. మతాన్ని, మార్క్సి జాన్ని సమన్వయం చేయగల దార్శనికుడు. కమ్యూనిస్ట్, అనార్కిస్ట్, నిహిలిస్ట్ కవిగా ప్రపంచంలో గుర్తించబడ్డ ఏకైక భారతీయ కవి. ఈ నేల మీద పుట్టి పాకిస్తాన్ కవిగా మల్చబడి దేశ దేశాల్లో తన స్వరం వినిపించినవాడు. జీవితాన్నే కవిత్వాన్వేషణలో కరిగించుకున్న మహాకవి,
ఎలియా, జాన్ ఎలియా!
ఏం చేసినా సంచలనం కలిగించే వ్యక్తులూ, ఏది రాసినా మనసుల్ని కదిలించే శక్తిగలవారి కోవలోకి వచ్చే మొట్ట మొదటి వ్యక్తి జాన్ ఎలియా. జీవితం, స్నేహం, ప్రేమ, బాధ, ఒంటరితనం అన్నిటినీ ఇముడ్చుకున్న ఆయన జీవితం దానికదే విశిష్టత కలిగిన విలక్షణ చక్రం. ఈ దేశంలో పుట్టి, పాకిస్తాన్‌కి వలసపోయి, రెండు దేశాల్లోనూ తన భావోద్వేగాల బాంధవ్యాల్ని పదిలపర్చిన ప్రయాణికుడు. ఉర్దూ సాహితీ జగత్తులో కొత్త పదాల్ని, పదబంధాల్ని కూడా సృష్టించగలిగిన తిరుగు లేని ఆగామి కవి!
పదేళ్ళ క్రితం డా. ఆవంత్స సోమసుందర్ తన ‘ఉర్దూ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు’ రచనలో చిట్టచివర్న, “నిర్భంధాగ్నుల్లో పాకిస్తాన్ విప్లవ కవి” అంటూ ఐదు పేజీలు జాన్ కోసం రాసారు. దాదాపు రెండు దశాబ్దాలుగా యూ.పి.లోని అమ్రోహలో ఇప్పటికీ ఉన్న ఆయన జన్మ స్థలాన్నీ, ఇంటినీ సందర్శించాలనేది నా కల. ఎప్పుడు అనుకున్నా ఢిల్లీ వరకూ వెళ్ళి పని చూసుకుని వచ్చేయడమే కానీ కుదిరేది కాదు. అలాంటిది ఒక అనుకోని కాంటాక్ట్ ద్వారా ఈ రోజా మాసం అందించిన బహుమతి అమ్రోహ వెళ్ళడం. అమ్రోహ చిన్న ఊరు కాదు. ఒక చారిత్రక ప్రదేశం!
డెబ్బై శాతానికి పైబడి ముస్లింలు ఉండే ఈ ఊర్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 72 ఇమామ్ బాడాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో మసీదులు, దర్గాలు, గతకాలపు చరిత్ర ఆనవాళ్ళు ఒకటేమిటి, వాహ్! అనిపించే చరిత్ర. 1857 పోరాటంలో అమరులైన వారి స్మృతులు ఇంకా ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో సాంప్రదాయ బురఖాని కాదని మహాత్మా గాంధీ బీ అమ్మగా పిల్చుకున్న ఆలీ సోదరుల తల్లి అబాదీ బానో బేగం సరిగ్గా వంద సంవత్సరాల క్రితం ఇక్కడే పుట్టారు. గాంధీ టోపి రూపకర్త ఆమె. తన ఉపన్యాసాలతో, ఉద్యమ చైతన్యంతో ఎంతో మందిని ముందుకు నడిపిన ధీశాలి!
అమ్రోహ గురించి ఇలా చెప్పుకుంటే అంతే లేదు. ఆసక్తి ఉన్న వారికోసం అంతర్జాలంలో అంతులేనంత సమాచారం ఉంది, చూడొచ్చు. అలా కొంత ప్రయత్నం చేయగా సాహిల్ ఫరూక్ అనే యువకుడు,విద్యార్థి పరిచయం అయ్యాడు. ఉత్సాహవంతుడు. తన ద్వారా ప్లాన్ చేస్కున్న ప్రయాణం. నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. ఎన్నో గజల్స్ ని నా మదిలో ఉబి కించిన జాన్ స్మృతుల్ని చూడటం, పెద్దాయన నేహాల్ అమ్రోహి నోటి నుండి ‘గౌరవ్ సాబ్’ అంటూ ప్రేమగా ఎలియా గజల్స్ వినడం మరచిపోలేని అనుభూతి!
రంజాన్ మాసంలో రోజా ఉపవాసం ఉండి కూడా రోజంతా నాతో తిరిగి అమ్రోహ యొక్క అంతరాత్మని దర్శింప జేసిన విద్యార్థి ఫరుక్ అమ్రోహికీ, అతని మిత్రులకి, అక్కడ ఆప్యా యంగా ఆదరించిన అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నాస్తికుడిగా ఉండి కూడా హిందూ, ముస్లిం ఐక్యాతా నినాదాన్ని ఎత్తి పట్టిన జాన్ ఎలియా సాక్షిగా మతోన్మాదం విద్వేషంతో పెచ్చరిల్లుతున్న వేళ, గంగా జమున సంస్కృతికి నిలువుటద్దంలా నిల్చిన అమ్రోహాకి అమలిన ప్రేమతో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ చిన్న రైటప్.
– గౌరవ్