Saturday, December 21, 2024

తిరుగుబాటే ఊపిరిగా సాహసోపేతమైన జీవితం!

దేజావూ (déjà vu) అనే ఇంగ్లీషు మాటకు అర్థం మనసు పొరలలో ఏదో అనుభూతి నిక్షిప్తమై ఉన్నట్టు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను తాను ఎప్పుడో చూసినట్టూ, అనుభవించినట్టూ అనిపించడం. గీతా రామస్వామి రచించిన ‘అడుగడుగున తిరుగుబాటు’ (ప్రజా జీవితంలో పోరాటాలు) చదువుతున్నప్పుడు నాలో కలిగిన అనుభూతి అదే. ఈ మహత్తరమైన రచనలో తారసపడే వ్యక్తులలో చాలామంది నాకూ తెలిసినవారు కావడం, నక్సైలైట్ ఉద్యమంతో పరిచయడం ఉండటం, దళిత ఉద్యమంతో అనుబంధం ఉండటం కూడా కారణం కావచ్చు.

పుస్తకాలను చూపిస్తూ గీతారామాస్వామి

బోజ్జా తారకం, కె. బాలగోపాల్, కన్నబీరాన్, గద్దర్, శాంతాసిన్హా, ఓల్గా, హరగోపాల్, బిఎస్ఎన్ స్వామి, రమామెల్కోటే, సురవరం సుధాకరరెడ్డి, ఎస్ ఆర్ శంకరన్, అఖిలేశ్వరి, విశ్వేశ్వరరావు, కత్తిపద్మారావు, విజయభారతి, పాల్ దివాకర్, లలిత, విఠల్ రాజన్, శశి, గొర్రెపాటి రవీంద్రనాథ్, చేకూరి రామారావు, గవర్నర్ కృష్ణకాంత్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వంటి అనేకమందితో నాకు పరిచయాలు ఉన్నాయి. మా న్యూసైన్స్ కాలేజి ప్రిన్సిపల్ సుదర్శన్ ఇంట్లో జార్జి రెడ్డిని కలుసుకునేవాడిని. నక్సలైట్ ఉద్యమం తెలుసు. పోలీసుల జులుం చూశాను. హైదరాబాద్ లో చదువుకున్న విద్యార్థిగా, అయిదు దశాబ్దాలు జర్నలిస్టుగా పని చేసిన వ్యక్తిగా వీరందరితో పరిచయాలు ఉన్నాయి. ఈ పుస్తకం చదువుతుంటే అంతా ఏదో తెలిసినట్టు, చూసినట్టు అనిపించింది. విజయవాడలో నివసించిన పదేళ్ళలో చేసిన, చూసిన ఆదర్శ వివాహాలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులతో సంభాషణలు, ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనుభవాలు, కార్మికుల కలహాల పరిష్కారాలు కూడా గుర్తుకొచ్చాయి. కారంచేడులో దళితుల హత్యాకాండ జరిగిన వెంటనే విజయవాడలో ఉన్న నాకు కత్తి పద్మారావు ఫోన్ చేసి ఘోరం జరిగిందని ఆవేశంగా చెప్పడం, ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు అనే సీనియర్ రిపోర్టర్ నీ, మారుతి అనే ఫొటోగ్రాఫర్ నీ కారు ఇచ్చి ప్రత్యేకంగా కారంచేడుకు పంపించడం, వారు జరిగిన వివరాలన్నీ తెలుసుకొని సవివరమైన వార్తలు అందించడం, నాతోపాటు ఉన్న యువజర్నలిస్టుల బృందం విజృంభించడం, ‘పులిచంపిన లేడినెత్తురు’ అనే ప్రధాన శీర్షిక పెట్టడం, ఆ రోజు అక్కడే ఉన్న సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కి విషయం చెప్పడం, ఆయన ‘కండకావరం’ అంటూ సంపాదకీయం రాయడం, ‘ఉదయం’ పత్రికలో మొదటి పేజీతో సహా నాలుగు పేజీలు ఆ దుర్ఘటనకు సంబంధించిన వార్తలు సవివరంగా ఇవ్వడం వంటి అనేక జ్ఞాపకాలు తరుముకుంటూ వచ్చాయి. కారంచేడు కవరేజీలో ‘ఉదయం’ విజయవాడ ఎడిషన్ అద్భుతాలు చేసింది. మరే ఇతర పత్రికా అంత బాగా వార్తలూ, విశ్లేషణలూ, ఫొటోలూ ప్రచురించలేదు.

‘అడుగడుగున తిరుగుబాటు’ వంటి పుస్తకం నేను ఇంతకు ముందు చదవలేదు. ఇంత నిజాయితీగా, నిర్భీతిగా, నీతిమంతంగా రాసిన పుస్తకం వేరొకటి నాకు తారసపడలేదు. పుట్టుక నుంచీ తిరుగుబాటే. తల్లితండ్రులను ఎదిరించి, ఉద్యమంవైపు అడుగులువేయడం, విద్యార్థిగా తిరుగుబాటు చేయడం, నక్సలైటు ఉద్యమంలో పని చేయడం, నక్సలైట్ నాయకత్వంతో విభేదించడం, ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీలోని ఘజియాబాద్ లో బాల్మీకి సంతతితో కలిసి జీవించడం, వారికి చదవడం, రాయడం నేర్పించడం, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సమీపంలోని ఇబ్రహీంపట్నంలో సమాజంలో అత్యంత వెనకబడిన, వేల ఏళ్ళుగా అణచివేతకు గురవుతూన్న మాదిగలను ఉద్ధరించడానికి నడుంబిగించడం, వారితో కలిసి నిరాడంబరంగా జీవించడం, వారిని ప్రేమించడం, వారి విశ్వాసం పొందడం, గొడ్డుమాంసం తినడం, మైళ్ళకొద్దీ నడవడం, గంటలకొద్దీ మాట్లాడటం, రకరకాల వ్యక్తులతో, అధికారులతో సమాలోచనలు జరపడం, భూపోరాటాలకు నాయకత్వం  వహించడం, రాక్షస ప్రవృత్తి కలిగిన భూస్వాములనూ, పోలీసు అధికారులనూ ధైర్యంగా ఎదిరించడం, వారి మెడలు వంచడం, హత్యాప్రయత్నం నుంచి తలవెంట్రుకవాసిలో తప్పించుకోవడం, పంటలు నాశనం చేయడం, కొత్త పంటలు వేయించడం, చెట్లు పీకించడం, మోటార్లూ, పంపుసెట్లూ బావులలో వేయించడం, వేటగాళ్ళను వేటాడటం, ధర్నాలు చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం…ఒకటేమిటి? ఇన్ని పనులు  ఒక మహిళ (భర్త సిరిల్ రెడ్డి సంపూర్ణ సహకారంతో) చేయడం, కొన్ని వందలమందికి వెట్టిచాకిరీ నుండి విముక్తి కలిగించడం, భూస్వాముల కొమ్ములు విరిచి వారి అధీనంలో ఉన్న భూములను పేద మాదిగలకు ఇప్పించడం, వారి పేరుమీద రిజిస్టర్ చేయించడం, వారు సేద్యం చేసి, ఫలసాయం అనుభవిస్తుంటే చూసి ఆనందించడం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 28 వేలమంది ఓటర్లు తాను ఎవరికి ఓటు వేయమంటే వారికి వేసే విధంగా ప్రభావం వేయడం వంటి అనేక ఘనకార్యాలు గీత చేశారు. కేరళ మూలాలున్న తమిళ బ్రాహ్మణ కుటుంబంల పుట్టిన గీత తెలంగాణను కార్యక్షేత్రంగా ఎంచుకొని ఇబ్రహీంపట్నం ప్రయోగశాలలో చేసిన అనేక ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. తిరుగుబాటు మనస్తత్వం ఆమెను ఒక చోట కూర్చోనివ్వలేదు. ఏ నియంత్రణ, ఆంక్షలు, అదుపాజ్ఞలు ఆమెపైన పని చేయలేదు. తన మనసు చెప్పినట్టు నడుచుకున్నది. కుటుంబంతో, సహచరులతో, సమాజంతో, రాజకీయ వ్యవస్థతో, పోలీసులతో, రెవెన్యూ సిబ్బందితో, న్యాయవ్యవస్థతో, భూస్వాములతో నిత్యం ఘర్షణ పడుతూ, తిరుగుబాటు చేస్తూ, ఉద్యమాలు నిర్వహిస్తూ, ఎత్తుగడలు వేస్తూ, వాటిని సమర్థంగా అమలు చేస్తూ, ప్రత్యర్థులతో తలబడుతూ, సంఘర్షణ చేస్తూ సత్ఫలితాలు సాధించడం విశేషం. ఇబ్రహీంపట్నం పేదల పక్షాన నిలిచి పదేళ్ళు సాగించిన పోరాటం ఒక ఎత్తు, తక్కిన జీవితం ఒక ఎత్తు. ఇన్ని పనులు చేస్తూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను నిలబెట్టడం, అరుదైన పుస్తకాలు ప్రచురించడం, తక్కువ ధరకు పాఠకులకు మేలిరకం పుస్తకాలను అందించాలన్న లక్ష్యంతో పని చేయడం చెప్పుకోదగిన ఘనకార్యం.

ఈ పుస్తకం చదువుతుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి. చాలా సందర్భాలలో గుండె గొంతుకలోకి వచ్చింది. క్షేత్రంలో చేసిన సాహసోపేతమైన అరుదైన పనిని పుస్తకంలో కళ్ళకు కట్టడం అన్నది గీత అద్భుతమైన సారస్వత ప్రతిభకు నిదర్శనం. ప్రభాకర్ మందార అనువాదం చాలాబాగుంది. నిజానికి ఇది అనువాదంలాగా లేదు. తెలుగులోనే చేయితిరిగిన రచయిత రాసినట్టు ఉంది.

నక్సలైటు లేదా మావోయిస్టు భావజాలానికి విజయం అసాధ్యమని తెలుస్తూనే ఉంది. ఇంత పెద్ద, బలిష్టమైన రాజ్యాన్ని ఎదిరించి,  ఓడించడం అసాధ్యం. తుపాకి ద్వారా విప్లవం అన్నది దుర్లభం. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న విప్లవ వీరులంటే గౌరవం ఉన్నమాట నిజమే కానీ వారి త్యాగాలు వృధా అవుతున్నాయనే మాట ఎవ్వరూ కాదనలేనిది. 1946-51 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సాధించిన విజయాలు పోరాట విరమణ అనంతరం గల్లంతైనాయి. అదే  భూస్వాములు కాంగ్రెస్ పార్టీ నాయకుల రూపంలో పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి తమ భూములు తాము స్వాధీనం చేసుకున్నారు. 1980, 1990లలో సాగిన నక్సలైట్ ఉద్యమ ఫలితాలు సైతం సంఘటితం కాలేదు. 1955లో ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తుందనుకున్న కమ్యూనిస్టు పార్టీ ఓడిపోయినప్పటికీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోనూ, అనంతరం ఆంధ్రప్రదేశ్ లోనూ కమ్యూనిస్టు పార్టీ బలంగానే ఉండేది. 1964లొ చీలిపోయిన తర్వాత బలహీనపడిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక్క సీటు సాధించిన సీపీఐకీ, స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయిన సీపీఎంకి స్వయంగా ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. నా చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన సామాజిక కార్యక్రమాలను కూడా ఇప్పటి కమ్యూనిస్టులు చేయడం లేదు. అడవులలో పోరాడుతున్న ఎంఎల్ గ్రూపులకూ, చట్టబద్ధమైన రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకూ గీతారామస్వామి పదేళ్ళలో చేసి చూపించిన విప్లవ రాజకీయం ప్రేరణ కావాలి. దళితులను అవసరమైనంతగా పట్టించుకోకపోవడం కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం. ఈ చారిత్రక తప్పిదాన్ని దిద్దుకోవడానికి గట్టిగా ప్రయత్నించలేదు. సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం లాల్-నీల్ ప్రయోగం చేశారు కానీ అది కొనసాగలేదు. నిర్దిష్టమైన రూపం తీసుకోలేదు.

రాజ్యాంగబద్ధంగానే, చట్టాలను అమలు చేస్తూనే పేదవారికి ప్రయోజనం సమకూర్చే విధంగా పోరాటం చేయడం సాధ్యమేనని గీతారామస్వామి కార్యక్షేత్రంలో స్వయంగా సాధించి నిరూపించారు. ‘‘రాజ్యం ఏ చట్టాలనైతే చేసిందో ఆ చట్టాలే ఉల్లంఘనకు గురవుతున్నాయని ప్రత్యక్షంగా చూపిస్తూ యాక్టివిస్టులు ఉద్యమిస్తే విజయం సాధించడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. అలాంటి పోరాటాలకు భిన్న సామాజికవర్గాల నుంచి మద్దతు, సానుభూతి కూడా లభిస్తుంది. రాజ్యం కూడా తనను తాను చట్టబద్ధమైన, పాలనార్హత గల వ్యవస్థనని చెప్పుకొనేందుకైనా సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు చట్టవిరుద్ధమైన చర్యల మీద, అక్రమాల మీద మరింతగా దృష్టి పెట్టడం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించడం కూడా కొంతలో కొంత సులువు అవుతంది. అలా కాకుండా ఒక వైపు చట్టబద్ధమైన ప్రభుత్వ వ్యవస్థల పరిధిలో పని చేస్తూనే మరోవైపు రాజ్యం యొక్క చట్ట స్వభావాన్ని ప్రశ్నిస్తుండటం చాలా సంక్లిష్టమైన ప్రయాసగా తయారవుతుంది’’ అంటూ ఈ పుస్తకం 332వ పేజీలో రచయిత వెలిబుచ్చిన అభిప్రాయం సమర్థనీయమైనది. ‘‘అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ దేశంలో – వామపక్షాలే గనక అంబేడ్కర్ ని అధ్యయనం చేసివుంటే, దళిత వర్గాలతో కలసి పని చేసి వుంటే – రాజ్యాంగపరమైన అంశాలలో వారికి ఉన్న చాలా సందిగ్థతలు తొలగిపోయి, మరింత స్పష్టతతో పని చేయడం సాధ్యమయ్యేదని.’’ ఈ అభిప్రాయం నాకు చాలాకాలంగా ఉంది. ఈ పుస్తకం చదివిన తర్వాత, గీత సాధించిన విజయాలు గమనించిన అనంతరం అది మరింత దృఢపడింది.

‘‘ఉన్న వ్యవస్థలోనే కొద్దికొద్దిగా చోటు కల్పించుకోవడం, మెల్లగాదాన్ని విస్తరించుకోవడం, క్రమేపీ వాటినే ప్రజాస్వామీకరణకు బలమైన కార్యక్షేత్రాలుగా మలచుకోవడం చాలా ముఖ్యం. కొత్త వ్యవస్థలను ఆవిష్కరించే క్రమంలో –  ఉన్న వ్యవస్థలో మనకున్న అవకాశాలను ఎంత వరకూ సాధ్యమో అంత వరకూ విస్తరించడం, ఆ వ్యవస్థను గరిష్ఠస్థాయిలో అంచులవరకూ నెట్టటమన్నది చాలా ముఖ్యమైన ప్రక్రియ’’ అని రచయిత స్వానుభవంతో చెప్పిన హితవు. రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్న మావోయిస్టులను పక్కన పెట్టినా, రాజ్యాంగ పరిధిలో పని చేస్తున్న కమ్యూనిస్టులు ఎన్నికల ప్రక్రియకే పరిమితం కాకుండా ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్) చూపిన బాటను అనుసరించడం ఉత్తమమేమో ఆలోచించాలి. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టు నాయకులూ, కార్యకర్తలూ ఏమి చేస్తున్నారో, ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఇందుకు కరదీపికగా ‘అడుగడుగున తిరుగుబాటు’ ఉపయోగపడుతుంది.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles