Saturday, December 21, 2024

భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం

ఉగ్రశ్రవసువు నైమిశారణ్యంలోని శౌనకాది మహామునులకు భారతకథ చెబుతున్నాడు:

“పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగానికి ఆస్తీకుని ప్రార్థన మేరకు ముగింపు పలికి, ఋత్విజులను, వ్యాసాది మహామునులను పూజించి, దీనులకు, అనాథలకు కోరినంత ధనాన్ని యిచ్చి, పుణ్యపురాణ కథా కాలక్షేపం సలుపుతూ కాలం వెళ్ళబుచ్చుతూ, ఒకరోజు

వైశంపాయన ప్రభృతి శిష్యవర్గాలతో,  మునిగణానేక పరివృతుడై, కనకమణి మయమైన ఉన్నతాసనంపై పరివేష్ఠించిన వ్యాసమహర్షునికి పరమ భక్తిశ్రద్ధలతో, అర్ఘ్యపాదాది విధులతో పూజించినాడు.

Also read: నిన్న – నేడు – రేపు

ఆ మహాముని ఎటువంటి వాడు?

పరమ బ్రహ్మ నిధిం, పరాశరసుతున్, బ్రహ్మర్షి ముఖ్యున్, దయా

పరు, కౌరవ్యపితామహున్, జనహితప్రారంభు, కృష్ణాజినాం

బరు, నీలాంబుద వర్ణదేహు, ననురూపప్రాంశు, నుద్యద్దివా

కర రుక్పింగ జటాకలాపు, గతరాగద్వేషు, నిర్మత్సరున్”

“పరాశర సుతుడైన ఆ మహాముని పరమ తపోనిధి, వేదనిధి, బ్రహ్మర్షులలో అగ్రగణ్యుడు, దయాపరుడు, కౌరవవంశ పితామహుడు, జనహితం కోసం పాటుపడేవాడు, కృష్ణాజిన వస్త్రుడు, నీలమేఘం వంటి దేహకాంతి కలవాడు, రూపానికి తగినట్లు పొడవైన వాడు, ఉదయభాస్కరుని కోటి మయూఖకాంతి వంటి రాగిరంగుతో భాసిల్లే జడల సమూహం కలవాడు, రాగద్వేషాలకు, మాత్సర్యానికి సుదూరుడైన వాడు.”

ఆ పరమ మునీంద్రునికి వినయవినమిత శిరస్కుడై నమస్కరించి, జనమేజయుడు ఇట్లా అడుగుతున్నాడు:

నేటి పద్యతాత్పర్యం:

“మునిగణ వంద్యుడవైన వ్యాసమహర్షీ! మీరు, భీష్మాది కురువృద్ధులు,రాజులూ కలసి, రాజ్యసంపదను విభాగించి యిచ్చినప్పటికీ, తమతమ వృత్తుల్లో వుండక, “చలించి”, అపారపరాక్రమశాలురైన  పాండవులు, కౌరవులు, ఏ కారణం చేత, మీ ఆదేశాన్ని పెడచెవిని పెట్టి, ప్రజావినాశన కారియైన కురుక్షేత్ర మహాసంగ్రామానికి తలబడినారు? తెలిసి తెలిసి మీరందరూ ఎందుచేత కౌరవపాండవులను వారింపలేక పోయినారు? ఈ గోత్రకలహం ఎందుచేత సంభవించింది? దీనికి మూలహేతువును దయతో వివరించండి!”

Also read: కృపజూడు భారతీ

ఈ విధంగా పాండవ, ధార్తరాష్ట్ర, విభేదన కథాశ్రవణ కుతూహలపరుడై ప్రశ్నించిన జనమేజయుని పట్ల కరుణతో, కృష్ణద్వైపాయనుడు, తన శిష్యుడు వైశంపాయనమునిని చూసి “శ్రీ మహాభారత కథావ్యాఖ్యానాన్ని ఆద్యంతం సవిస్తరంగా జనమేజయునికి చెప్పమ”ని నియమిస్తాడు.

వైశంపాయనుడు జనమేజయునికి మహాభారత కథను తెలపడానికి జనమేజయుడు వ్యాసమహర్షిని కురుక్షేత్రయుద్ధానికి మూలహేతువులేమిటి? అని ప్రశ్నించడమే కారణం.

మహాభారతంలో వ్యాసుడు పాత్రధారి. మహాభారత మూలరచయిత కూడా. లిఖితమైన భారతాన్ని మౌఖికంగా భువనభువనాలలో ప్రచారం చేసింది మాత్రం ఆయన శిష్యులే. భూలోకంలో జనమేజయునికి భారతగాథను ఆమూలాగ్రంగా చెప్పినవాడు వైశంపాయనుడు.  ఆ పిదప తరతరాలుగా ఈ గాథ భూమండలంలో వ్యాప్తి చేయబడుతూనే వున్నది. అట్లా వ్యాప్తి చేసిన వారిలో ఉగ్రవ్రవసువు కూడా ఒకడు.

ఒకరు ప్రశ్నించడం, మరొకరు జవాబు చెప్పడం అనే రచనా పద్ధతి ఉపనిషత్ యుగం నుండి, ఐతిసాసిక యుగానికి సంక్రమించినట్లు బోధ పడుతున్నది. పాశ్చాత్య సాహిత్యంలో సైతం ఈ ప్రక్రియ “ప్లేటో సంభాషణలతో” మొదలై మహాకవి మిల్టన్ “పారడైజ్ లాస్ట్” కావ్యం దాకా ప్రాకింది. ఆ కావ్యంలో కవి ప్రశ్నిస్తాడు  చదువుల తల్లి (muse) సమాధానంగా కథ చెబుతుంది.

Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం

“Say first what cause moved

our grandparents in that happy state

Favoured of heaven so highly

To transgress His will for one restraint

Lords of the world besides,”

అని కవి అడుగుతాడు. జవాబుగా చదువుల తల్లి:

“The infernal serpent he it was whose guile

Stirred up with envy and revenge deceived the mother of mankind”

అని జవాబు చెప్పి కథ చెప్పడానికి ఉద్యమిస్తుంది.

కానీ భారతీయ సాహిత్యంలో వాడినంత విస్తారంగా, ప్రశ్న-జవాబుల ప్రక్రియ పాశ్చాత్య సాహిత్యంలో వాడబడలేదన్నది నిజం.

ఉపనిషత్తులు “అనుభవ” పూర్వకంగా శ్రోతను పరమార్థానికి చేరువగా తీసుకొనిపోతే, పురాణేతిసాలు  మానవగాథలే ఆధారంగా శ్రోతను సత్యానికి దగ్గరగా చేరుస్తాయి.

Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం

హిరణ్యకశిపుడు తన తనయుడు ప్రహ్లాదుణ్ణి “బిడ్డా ఏమేమి చదువుకున్నావు?” అని అడిగితే “చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ!” అంటూ ధన్యాత్ముడైన ప్రహ్లాదుడు జవాబు చెబుతాడు.

కవికులగురువు కోవెల సుప్రసన్నాచార్య గారొక వ్యాసంలో ఋగ్వేదం లోని ఒక శ్లోకాన్ని ఉటంకించినారు. ఆ శ్లోకానికి అర్దమిది:

“ఒక ప్రియురాలు తన నాథుని ముందు ఎంత నిస్సంకోచంగా తన వస్త్రాలను త్యజిస్తుందో, సత్యం కూడా యోగ్యుడైన సాధకుని ఎదుట అరమరికలు లేకుండా తన ఉనికిని చాటుతుంది!”

ఒళ్లు గగుర్పొడిచే నిర్వచనమిది.

సర్పయాగానంతరం జనమేజయుడు శాంతిదూతగా అవతరిస్తాడు. అట్టి శాంతిదూతకు కావలసిన లక్షణాలేవి?

ఈ లక్షణాలను మహాకవి నన్నయ వ్యాసమహర్షిని వర్ఢిస్తూ చెప్పిన పద్యంలో పొందు పరచినాడు. వ్యాసుడు “దయాపరుడు”, “జనహితప్రారంభుడు”, “గతరాగ ద్వేషుడు”, “నిర్మత్సరుడు”.

ఈ పద్యంలో నన్నయ వ్యాసమహర్షిని “కౌరవ్యపితామహున్” అని సంబోధిస్తాడు. మరి ఈ పితామహుని సాత్విక గుణసంపద, ఒక్క విదురునికీ,  ఒక్క ధర్మరాజుకు తప్ప మరెవ్వరికీ ఎందుకోసం అబ్బలేదు?

ఎందుకోసం వ్యాసమహర్షి భారతగాథకు శ్రోతగా జనమేజయుణ్ఢి ఎన్నుకొన్నాడు. వ్యాసమహర్షి లో గల భూతదయ, జనహితకాంక్ష, రాగద్వేష రాహిత్యం, మాత్సర్య శూన్యత, జనమేజయునిలో కూడా వున్నందుచేత. ఇట్లా వ్యాసమహర్షి వారసత్వం తరాల పిమ్మట, జనమేజయునిలో ప్రత్యక్షం కావడం గమనింపదగిన విషయం. ఈ షృష్టి వైచిత్రాన్ని వాగనువాసనుడు అత్యంత సున్నితంగా పఠితలకు తెలియ బరుస్తున్నాడు.

Also read: తుం గ భ ద్రా న ది

“ఎందుకోసం మానవులు ఉన్నదానితో తృప్తి చెందక ఇతరుల సొమ్ముకై ఆశపడి, స్వర్గతుల్యమైన భూతల సృష్టిని నరకప్రాయం చేస్తున్నారు? ఎందుకోసం దక్షులైన వారు పూనికతో గోత్రకలహాలను నివారింపలేక పోతున్నారు? ఎందుకై మానవులు దయావిహీనులౌతున్నారు? ఎందుకై వారు లోభ, మోహ, మద, మాత్సర్యాది దుర్గుణాలకు బానిసలౌతున్నారు?”

జనమేజయుని ఈ అంతర్మథనానికి ఆయన వ్యాసమహర్షికి సంధించిన నేటి ప్రశ్నలే సాక్ష్యం.

జనమేజయుడు సత్యశోధకుడు. మానవసృష్టి గూర్చి,  జీవించడం అనే కళ గూర్చి ఆయనలో అనేక ప్రశ్నలు ఉదయించినట్లు, ఉదయిస్తున్నట్లు, నేటి ఆయన సంధించిన ప్రశ్నల పరంపరయే తెలియజేస్తుంది.

విల్ డ్యూరెంట్ రచించిన “ది స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ” అనేక గ్రంథం కడు ప్రసిధ్ధి పొందింది. మనిషి సత్యాన్ని ఎందుకు ఆన్వేషిస్తాడు?  ఈ విషయాన్ని గూర్చి “స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ” ఉపోద్గాతంలో విల్ డ్యూరెంట్ ఇట్లా అంటాడు:

“Life has meaning” we feel with Browning, “to find its meaning is my meat and drink”. So much of our lives is meaningless, a self cancelling vacillation and futility; we strive with the chaos about us and within; but we would believe all the while that there is something that is significant and vital in us, could we decipher our own souls. We want to understand; “life means constantly to transform into light and flame all that we are and meet with. We are like Mitya in “the Brothers Karamazov” —“one of those who don’t want millions, but an answer to their questions. We want to see things now as they will seem forever–“in the light of eternity”.

“To be a philosopher” said Thoreau, “is not merely to have subtle thoughts, nor even found a school, but so live, according to its dictates, a life of simplicity, independence, magnanimity and trust”.

Trust will not make us rich, but it makes us free.”

Also read: సంధ్య

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles