Sunday, December 22, 2024

మేటి కథకుడైన కథానాయకుడు పీవీ

మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) అసాధారణమైన వ్యక్తి. ఒక చిన్న గ్రామంలో పుట్టి మరో చిన్న గ్రామానికి దత్తతకు పోయి ఈ దేశానికి ప్రదానమంత్రి కావడం సామాన్యమైన విషయం కాదు. వెనుకబడిన హైదరాబాద్ సంస్థానంలో పుట్టిపెరిగిన వ్యక్తి దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. నిజానికి పీవీ కూడా కలగనలేదు. కేంద్ర మంత్రి పదవితో చాలనుకొని 1991 ఎన్నికలలో పోటీ చేయకుండా రాజ్యసభ సభ్యుడిగా అవసరమైతే సేవ చేయాలని అనుకున్నారు. ప్రత్యామ్నాయంగా కుర్తాళం పీఠాధిపత్యం ఉన్నది. అదీకాకపోతే హైదరాబాద్ బేగంపేటలో స్వామీరామానందతీర్థ ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రజాసేవ కొనసాగించాలని అనుకున్నారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని  రాజీవ్ గాంధీని శ్రీలంక పులుల ప్రతినిధి మానవ బాంబై పాదాల దగ్గర పేలి హత్య చేయడంతో రాజకీయం అడ్డం తిరిగింది. మలి దశలో కాంగ్రెస్ కు రాజీవ్ మృతి కారణంగా సానుభూతి పవనాలు వీచడంతో అదిక సీట్లు వచ్చాయి. చివరికి అతిపెద్ద పార్టీగా అవతరించింది. సోనియా దు:ఖసాగరంలో మునిగి ఉన్న సమయంలో ఫొతేదార్, నట్వర్ సింగ్, అలెగ్జాండర్ వంటి సన్నిహితుల సలహా మేరకు ముందు శంకర్ దయాళ్ శర్మకు ప్రధాని పదవి ఇవ్వజూపారు. అనారోగ్య కారణంగా తన వల్ల కాదని శర్మ చెప్పిన తర్వాత పీఎన్ హక్సర్ సలహా మేరకు పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని, ఆ తర్వాత ప్రధాని పదవిని అప్పగించాలని నిర్ణయించడం అందరికీ తెలిసిందే.

పీవీ రాజకీయ జీవితంపైన చాలా రచనలు వచ్చాయి. ఆయన సాహిత్య జీవితంపైన తగినంత చర్చ జరగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూనికతో పీవీ శతజయంత్యుత్సవాలు సంవత్సరం పొడుగునా జరగడంతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రభుత్వం నడిపే తెలంగాణ మాసపత్రికలో పీవీపైన వ్యాసాలు పుంఖానుపుంఖంగా ప్రచురించారు. మరణించిన తర్వాత పదిహేనేళ్ళకు పీవీకి తెలంగాణలో తగిన గుర్తింపు లభించింది. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాలలో కూడా పీవీ జ్ఞాపకార్థం సభలూ, సమావేశాలు జరిగాయి. కోవిద్ మహమ్మారి లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ సభలు జరిగి ఉండేవి. జూన్ 28న శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై పీవీ రచించిన నాలుగు పుస్తకాలనూ, పీవీపైన రచించిన నాలుగు పుస్తకాలనూ విడుదల చేయనున్నారు.

జీవితమే వైవిధ్యభరితం

పీవీ రాజకీయాలలోకి వెళ్ళకుండా ఉంటే ఒక విశ్వనాథ సత్యనారాయణ లేదా ఒక దాశరథి కృష్ణమాచార్య లేదా వానమామలై వరదాచారి అయ్యేవారు. అంతకంటే మించిపోయి ఉండేవారు. తెలంగాణలో ఒక మారూమూల గ్రామంలో పుట్టిన వ్యక్తికి 14 భాషలలో ప్రావీణ్యం ఎట్లా అబ్బింది? చదువలలో ప్రథముడిగా ఎట్లా నిలిచాడు? సాహిత్యంలోని సకల ప్రక్రియలలో  ఎట్లా అక్షర సేద్యం చేయడగలిగాడు? పీవీ జీవితంలోనే ఈ వైవిధ్యం ఉన్నది. అందరిలాంటి జీవితం కాదు ఆయనది. అనేక మలుపులు ఉన్నాయి. ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆయన జీవితం ఎటు తీసుకొని వెడితే అటు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెడితే అక్కడ రాణించే ప్రయత్నం చేశారు. స్వతహాగా సున్నిత మనస్కుడు, మితభాషి, వివేకవంతుడు, సాహసి, జిజ్ఞాసి, ఏకసంతాగ్రాహి, అసాధారణమైన ధారణశక్తి కలిగిన మేధావి. ఆయన జీవించిన విధానం కూడా సాహిత్యరంగంలో ఎదగడానికి దోహదం చేసింది. చిన్నతనంలో వంగరలో అక్షరాభ్యాసం చేసి, అక్కగారింటికి వెళ్ళి అక్కడ ఆరో తరగతి వరకూ చదువుకొని, హనుమకొండ వెళ్ళి అక్కడ ఏడు నుంచి పదో తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. తెలంగాణలో బాలలందరిలాగే ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బట్టితిన్…’ అని పెదబాలశిక్షతో ప్రారంభించి, సుమతీశతకంతో ముందడుగు వేసి సాహిత్యయాత్ర ప్రారంభించారు.  హనుమకొండలో గార్లపాటి రాఘవరెడ్డి శిష్యరికంలో సంస్కృతాంధ్ర భాషలపై పట్టు సాధించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఇంటర్ చదివి ఉంటే ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషులతోనే ఆగిపోయి ఉండేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పీవీని, మరికొంతమంది విద్యార్థులను వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు  బహిష్కరించడం ఆయన పాలిట వరమై కూర్చుంది. నాగపూర్ విశ్వవిద్యాలయం కులపతి అనుమతితో అక్కడికి ఇంటర్మీడియట్ చదివేందుకు వెళ్ళారు. మామూలుగా ఇంటర్ చదవితే మరాఠీ రాకపోవును. ఇంటర్ చదువుతూనే మరాఠీ చదవడం, రాయడం నేర్చుకున్నారు. మరాఠీ పత్రికలకు వ్యాసాలు రాశారు. సినిమాలు చూసి వాటిలోని హాస్య సన్నివేశాలపైన సమీక్షలు రాసేవారు. రంగస్థల నాటకాలు చూసి వాటిని సమీక్షించేవారు. ప్రతి ఆదివారం సంగీక కచ్చేరికి వెళ్ళేవారు సహాధ్యాయి పి. నారాయణరావుతో సంగీతం గురించి చర్చించేవారు. పటాస్కర్, పట్వర్థన్ వంటి హిందూస్థానీ విద్యాంసుల బాణీలు విని  తన్మయత్వం చెందేవారు.

రాజకీయ పరిజ్ఞానం

రాజకీయ సభలకు హాజరయ్యేవారు. హిందూమహాసభ సమావేశాలకు హాజరై వీరసావర్కర్ ఉపన్యాసం విన్నారు. నాగపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను కలుసుకొని ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. త్రిపుర కాంగ్రెస్ మహాసభలకు హాజరై అక్కడ సుభాష్ చంద్రబోస్ నీ, జవహర్ లాల్ నెహ్రూనీ, ఎంఎన్ రాయ్ నీ విన్నారు. ఇంటర్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన తర్వాత లెక్కలు ప్రధాన విషయంగా బీఎస్ సీ చేసేందుకు పుణె లోని ఫర్య్గూసన్ కాలేజీలో చేరారు. అక్కడ చదువుతో పాటు ఇతర రంగాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీకీ, భండార్కర్ పరిశోధనా సంస్థకూ క్రమం తప్పకుండా వెళ్ళి అనేక గ్రంథాలు చదివేవారు. కార్ల్ మార్క్స్, హెచ్ జి వెల్స్, తదితర పాశ్చాత్య రచయితల రచనలను అదేపనిగా చదివేవారు. బీఎస్ సీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై లండన్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ లో ఎంఎస్ చేయాలని కలగన్నారు. అది సాకారం కాలేదు. తిరిగి నాగపూర్ లోనే న్యాయశాస్త్రం అభ్యసించారు.

నాగపూర్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు దగ్గర జూనియర్ గా చేరారు. కానీ మనసు వకాలత్ మీద లేదు. నిజాం పాలనను అంతం చేయడం పైనా, హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడం పైనా దృష్టి ఉంది. మనసు రాజకీయాలవైపు లాగుతున్నదని గ్రహించారు. పది శాతం ప్రజలు కూడా అక్షరాస్యులు కాని ప్రాంతంలో ఉద్యమం నిర్వహించడం కష్టమని గ్రహించారు. వరంగల్లు వెళ్ళి పాములపర్తి సదాశివరావుతో కలసి కాకతీయ పత్రికను 1948లో నెలకొల్పారు. ఆ పత్రిక ఇద్దరి సంయుక్త సంపాదకత్వంలో వెలువడినా మొత్తం చాకిరి పీవీ చేయవలసివచ్చేది. సంపాదకుడి నుంచి అటెండర్ వరకూ ఆయనే. అంతకు ముందు సువరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక నెలకొల్పి అన్ని పనులూ తానే చేసుకొనేవారు. రచనలు సకాలంలో అందకపోతే తాను కూర్చొని ఒక కథో, ఒక వ్యాసమో పీవీ రాసేవారు.

ఆ విధంగా విజయ్ అనే కలంపేరుతో రాసిన గొల్లరామవ్య కథకు విశేషమైన పేరు వచ్చింది. అది విప్లవ కథ. మాక్సింగోర్కీ రాసిన ‘అమ్మ’ నవల చదివిన ప్రభావం పీవీపైన ఉన్నదేమోనని అనిపించే కథ. పద్దెనిమిదేళ్ళ పోరగాడు అర్దరాత్రి తన గుడిసెలో ప్రవేశించినప్పుడు ఆ గాయపడిన కుర్రవాడిని గొల్లరామవ్వ నిజాం పోలీసుల నుంచీ, రజాకార్ హంతకుల నుంచీ ఎట్లా కాపాడిందో, ఎటువటి తెలివితేటలూ, వివేకం, సమయజ్ఞత, సాహసం ప్రదర్శించిందో తెలిపే కథ. మహారాష్ట్రలో చాందా అనే ప్రాంతంలో రెండేళ్ళు రహస్య రాజకీయ జీవితం గడిపిన అనుభవం పీవీకి ఉంది. అందులోంచి పుట్టుకొచ్చిన కథ ఇది. రామవ్య అచ్చు తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ, మనుమరాలిని పురమాయిస్తూ, పోలీసులను దబాయిస్తూ, విప్లవకారుడికి ధైర్యవచనాలు చెబుతూ హంగామా చేస్తూ కథ నడిపిందో, ఎటువంటి కీలకమైన పాత్ర పోషించిందో పీవీ అద్భుతంగా వర్ణించారు. తన మనుమరాలు పక్కలో విప్లవకారుడిని పడుకోపెట్టి తన మనవడూ, మనవరాలే ఇంట్లో ఉన్నారనీ, పరాయివాళ్ళు ఎవ్వరూ లేరనీ పోలీసులను మభ్యపెట్టి తప్పుదారి పట్టించి జయప్రదంగా విప్లవకారుడిని కాపాడిన కథాక్రమం మనసుకు హత్తుకుంటుంది. ఈ కథ రాసినప్పుడు పీవీ వయస్సు 28 ఏళ్ళు.

అప్పటికి పదిహేనేళ్ళ కిందటే పీవీ కవిత్వం రాశారు.  రాఘవరెడ్డి శిష్యరికంలో ఛందోబద్ధంగా కవితలు రాసేవారు. శార్తూల విక్రీడితాలూ, మత్తేభాలు రాసేవారు. పద్యాలూ, గీతాలూ, ద్విపదలూ రచించేవారు. దేశభక్తి ఉట్టిపడే పద్యాలు రాశారు. పృథ్వీరాజును వంచించి దేశద్రోహానికి ఒడిగట్టిన జయచంద్రుడిని సంబోధిస్తూ, ‘‘జయచంద్రా హైందవ విధ్వంసకా!’’ అనే మకుటంతో పద్యం రాశారు. అప్పటి నుంచే పీవీలో హిందూ మతం పట్ల, హైదవ సంప్రదాయాల పట్లా గౌరవ ప్రపత్తులు ఉండేవి. కానీ పరమత సహనం ఉండేది. ముస్లిం స్నేహితులు ఉండేవారు.  పదిహేనేళ్ళు నిండక మునుపే విశ్వనాథ, అడవి బాపిరాజు, కృష్ణశాస్త్రి, జాషువా వంటి కవుల, రచయితల రచనలు చదివారు. ఇంటర్ లో ఉన్నప్పుడే థామస్ గ్రే కవిత్వం చదివి ముగ్ధుడైనారు. తక్కువ రాసినా ఎలిజీ కవిగా ప్రసిద్ధుడైన థామస్ గ్రే రచించిన ‘ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రే చర్చ్ యార్డ్‘ పద్యాన్ని అనుసరించి తనదైన ధోరణిలో తన భావుకత మేళవించి చిన్న స్మృతికావ్యం రాశారు. పీవీ ప్రేమకవిత్వం సైతం గిలికారు. వర్డ్స్ వర్త్, టెన్నిసన్ ల ప్రభావం పీవీపైన ఉన్నది.

‘‘నిర్మల వినీలాకాశం నుంచి

ఒక తారాసుందరి

తనను మక్కువతో, ప్రేమ వీక్షణాలతో తిలకిస్తుంటే…

ఆ పరమ రమణీయ సన్నివేశం హర్షించలేక

ఒక ఘాకకాంత

ఫక్కున నవ్వింది.

ఘాకకాంత అంటే గుడ్లగూబ. అపశకునం పక్షి. ‘భర్త్స్యనము’ శీర్షికతో అధిక్షేపన కవిత్వం సృజించారు.

‘‘ఏమయ్యా! నీ సృష్టి అఘోరించినట్లే ఉంది!

ఇన్ని అసమగ్రతలు, అవతవరకలు

నీకెప్పుడూ ఆలోచనలోకి రాలేదా?

నీవేమిటో చాలా గొప్పవాడివని అందరూ కైవారాలు చేస్తారు.

కానీ, నీ విభవ సమగ్రత, పరిపూర్ణత, ప్రభుత

అన్నీ నీవే పదిలంగా దాచి ఉంచుకో!

నాకు వాటిమీద ఎటువంటి మోజు లేదు.

నా బతుకు నన్ను బతకనివ్వు. న్యాయానికి

నీ కటాక్ష వీక్షణం

నాపై ప్రసరింపజేయకపోవడమే

నాకెంతో మేలు…

నీ దారిన నీవుండు

నా దారిన నేను పోతాను’’

అంటూ భగవంతుడిపై ధిక్కార శరాలు సంధించారు.

మనిషి స్వశక్తిపైన పీవీకి అమితమైన విశ్వాసం ఉన్నదనీ, అన్నీదేవుడిపై భారం వేసి కార్యశూన్యులుగా మిగిలిపోకూడాదనీ ఆయన ఉద్దేశమనీ, ఇందులో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తొంగి చూస్తాడనీ పీవీ మిత్రుడు సదాశివరావు ఉవాచ.

కవిత్వం, కథలూ, వ్యాసాలూ, విమర్శనాత్మక రచనలూ చాలా చేసిన తర్వాత రాజకీయాలలో మునిగి తేలుతూ నిర్విరామంగా ఉండిన పీవీ సాహితీక్షేత్రంలో విరామం తీసుకున్నారు. తిరిగి 1972లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 15 ఆగస్టు 1972న భారత స్వాతంత్ర్య రజతోత్సవం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ‘‘ ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు’’ అంటూ గొంతువిప్పి ఉద్వేగంతో, ఉత్తేజంతో పాడారు. 68 పంక్తులత ఈ దీర్ఘ కవిత 25 సంవత్సరాలలో స్వతంత్ర భారతం సాధించిన విజయాలను చెబుతూ, ఎదురైన వైఫల్యాలను వివరిస్తూ సాగుతుంది.  వలసవాదాన్నీ, గుత్తాధిపత్యాన్నీ, పరపీడన పరాయణత్వాన్నీ నిద్వంద్వంగా ఖండించారు. చివరికి ఆశావహంగానే దేశానికి సముజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్నదనీ, దానిని సమర్థంగా నిర్మించుకోవాలనీ ఆకాంక్షతో ఇట్లా ముగించారు:

నేనొక చైతన్యోర్మిని

నిస్తుల ప్రగతి శకలమును

ఇది నా సంతతకర్మ

మరే హక్కులు లేవు నాకు

ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ

 వెలుగుటయే నా తపస్సు

వెలిగించుట నా ప్రతిజ్ఞ.

కాళోజీ పీవీకి సన్నిహిత మిత్రుడు. ఆయన షష్టిపూర్తి సందర్భంగా ఒక సందేశం కవితాత్మకంగా పంపించారు.

బ్రహ్మనీకు పొరబాటున

పాపుల వయసిచ్చుగాక

కాలుడు మా కాళన్నను

కలకాలము మరచుగాక

అని రాసి ‘శతమానం భవతి,’ అని ముగించారు.

వృత్తి రచయిత కాదు పీవీ. ఆయన ప్రధాన వృత్తి రాజకీయం. ప్రవృత్తి కవిత్వం. అందుకని వీలైనప్పుడల్లా, అవసరం కలిగినప్పుడల్లా కవి, రచయిత పీవీని ఆవహిస్తారు. పీవీ హిందీలోనూ, ఆంగ్లంలోనూ కవితలు రాశారు. ఆ భాషలలోని ఇతర భాషల నుంచి తర్జుమా కూడా చేశారు. పీవీ అన్ని సాహిత్య ప్రక్రియలలో(నాటకం మినహాయించి) రచనలు చేశారు. కవితలతో సాహిత్యజీవితం ప్రారంభించి జీవిత చరమాంకంలో ప్రముఖ కవయిత్రి జయప్రభ కవితలను ఆంగ్లంలోకి అనువదించి కన్నుమూశారు. రెండు భాషలలోనూ 74 కవితల సంకలనం పీవీ నిర్యాణం తర్వాత 2005లో పెంగ్విన్ వారు ప్రచురించారు.  నాగపూర్ లో చదువుకునే రోజుల్లోనే సినిమా, నాటక సమీక్షలు మరాఠీలో రాశారు. అప్పుడే బెంగాల్ కరువు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కథ రాశారు. ఒక కాందిశీకురాలు ఆకలి తట్టుకోలేక బిచ్చమెత్తుకుంటుంది. ఎవ్వరూ కనికరం చూపించలేదు. బిచ్చం వేయలేదు. చివరికి ఒక మోతుబడి తనతో రమ్మనమని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళి, పనిమనిషిగా పెట్టుకొని తన కామవాంఛ తీర్చమంటాడు. ఆ మహిళ అందుకు నిరాకరించి ఆత్మహత్య చేసుకుంటుంది.

కాకతీయ వార పత్రిక పెట్టడానికి ముందే ఆంగ్లంలో ‘బ్లూ సిల్క్ శారీ’ అనే శీర్షికతో ఒక కథ రాశారు పీవీ. ఈ కథకు హిందూ-ముస్లిం మతకలహాలు నేపథ్యం. మతకలహాలలో సొమ్ము చేసుకున్న ఒక గూండా ముంబైలో రాజకీయంగా ఎదుగుతాడు. ఒక సారి మతకలహం రాజుకొని సంక్షోభం సృష్టించింది. ఆ గొడవలో గూండా రాజకీయవాది చెల్లెలు తప్పి పోతుంది. కొంతకాలం ఎదురు చూసి, అన్వేషించి చివరికి ఆమెను చనిపోయిందని తీర్మానించుకుంటారు కుటుంబ సభ్యులు. ఒక రోజు గూండా రాజకీయవాది ముంబయ్ లో సానికొంపకు వెడతాడు. అక్కడ నీలంరంగుసిల్కుచీర కట్టుకున్న అమ్మాయిని కోరుకుంటాడు. ఆ అమ్మాయితో గదిలోకి వెళ్ళి ముసుగు తీసి చూస్తే ఆమె గూండా చెల్లెలు. నిర్ఘాంతపోతాడు. ఈ కథ ఇప్పుడు దొరకడం లేదు. కానీ ప్రముఖ రచయిత డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ‘తెలంగాణ’ మాసపత్రిక ప్రత్యేక సంచికలో ఈ కథను వివరంగా చెప్పారు.

మంగయ్య అదృష్టం

పీవీ ప్రధానిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రభ వారపత్రిక 08 నవంబర్ 1999 సంచికలో ప్రచురించిన పెద్ద కథ, చిన్న నవలిక ‘మంగయ్య అదృష్టం.’ రాజకీయ జీవితంలో పీవీ అనుభవంలోకి వచ్చిన అంశాలూ, ఇతరులకు తెలిసిన అంశాలూ అనేకం ఉంటాయి. వాటన్నిటినీ మనసులో పెట్టుకొని రాసిన కథ ఇది. మన సినిమాలలో రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జునయుద్ధం వంటి కథలు కల్పితాలు. వీటికి మూలం దేవతల మధ్య అభిప్రాయభేదాలు. పంతాలూ, పట్టింపులూ. శివుడికీ, పార్వతికీ మధ్యనో, విష్ణుమూర్తికీ, లక్ష్మీదేవికీ మధ్యనో, బ్రహ్మకీ, సరస్వతికీ మధ్యతో వాదం జరుగుతుంది. వివాదం రగులుతుంది. అగ్నిలో ఆజ్యం పోయడానికి నారదుడు ఎప్పుడూ ఉంటాడు. అదే రకంగా పీవీ రాసిన కథలో త్రిమూర్తులూ, వారి సతీమణులూ, ఇతర దేవతలూ ఉంటారు. బ్రహ్మ నిర్వహిస్తున్న శాఖలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. బ్రహ్మ ఎవరికి ఎటువంటి తలరాత రాస్తారో దాని ప్రకారమే జరిగి తీరాలి. కానీ తలరాతను మార్చడానికి కొందరు దేవతలు ప్రయత్నించి విఫలం  చెందుతారు. చివరికి బ్రహ్మ అందరినీ సమాధానపరచి శాంతపర్చుతాడు. ఈ కథలో అనాధగా, అనాకారిగా పుట్టిన మంగయ్య అదృష్టం కలసి వచ్చి పైపైకి ఎదుగుతాడు. ఎంఎల్ఏ అవుతాడు. మంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ప్రధానమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో బ్రహ్మ కల్పించుకొని ఆ ప్రమాదం నివారిస్తున్నానంటూ ఇతర దేవతల్నిదారికి తెచ్చుకుంటాడు. ఈ కథలో రాజకీయ మలుపులూ, ఎత్తులూ, పైఎత్తులూ, కథ అడ్డం తిరగడాలూ, అనుకోని పరిణామాలు సంభవించడాలూ, దేవతలు రెండు ముఠాలుగా ఏర్పడి వ్యూహరచన చేయడాలూ, వారి వ్యూహాలను పటాపంచలు చేస్తూ చనిపోవలసిన మంగయ్య బతికిపోవడమే కాకుండా రాజకీయంగా విజయాలు సాధిస్తూ వెలిగిపోతాడు. అతని తల రాత అట్లా ఉంది. ప్రధానమంత్రి పదవి అతని తలరాతలో లేదు. కనుక బ్రహ్మకూడా ఏమీ చేయలేడు. ఇందులో సస్పెన్స్ తో పాటు హాస్యరసం దండిగా ఉంది.

బ్రీఫ్ కేస్ కథ

‘ద ఫర్గాటెన్ బ్రీఫ్ కేస్’ అనే కథ దిల్లీ నుంచి వచ్చిన అధిష్ఠానవర్గం ప్రతినిధి వ్యవహరించే తీరుకు నిదర్శనం. అధిష్ఠానవర్గం దూతను ముఖ్యమంత్రి ఎట్లా చూసుకుంటాడో తెలిపే కథ. ముఖ్యమంత్రిపైన ఫిర్యాదుల వెల్లువ వస్తే పార్టీ అధిష్ఠానం రంజన్ బాబు అనే నాయకుడిని రాష్ట్ర రాజధానికి పంపుతుంది. రంజన్ బాబును సంతోషపెట్టడానికి ముఖ్యమంత్రి వర్గం, ఆయయను వ్యతిరేకించే ప్రత్యర్థివర్గం ఎట్లా ప్రవర్తిస్తారో రచయిత చెబుతారు. ‘ఈ ముఖ్యమంత్రి వెళ్లిపోతున్నాడోచ్’ అనే ప్రచారంతో మొదలై అధిష్ఠావర్గం దూతకు సూట్ కేస్ అందించడంతో ముగుస్తుంది కథ. ప్రధాని పదవి, పార్టీ అధ్యక్ష పదవి రెండూ ఒకే వ్యక్తి చేతులో ఉండడం (ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు) వల్ల ముఖ్యమంత్రులను మార్చివేయడం తేలిక. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎవరినైనా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయమంటే చేసేవారు. దిగిపొమ్మంటే మారుమాట్లాడకుండా రాజీనామా గవర్నర్ కు సమర్పించి దిగిపోవడమే కాకుండా పోతూపోతూ పార్టీకి ఉపకారం చేస్తాడు.  అధిష్ఠానవర్గం దూత వచ్చి ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రతిపాదించవలసిన బాధ్యత కూడా గద్దెదిగుతున్న ముఖ్యమంత్రులచేత చేయించి ఘనత ఇందిర, రాజీవ్ లది. వారు చెప్పినట్టు వింటే ముఖ్యమంత్రి పదవి పోయినా ప్రత్యామ్నాయంగా గవర్నర్ పదవో, మరేదైనా పదవో వస్తుంది.  అందరూ రంజన్ బాబు లాగా ఉండరు. కొందరు శంకర్ దయాళ్ శర్మ వంటి పెద్దమనుషులు కూడా అధిష్ఠానం దూతలుగా వస్తారు. నారాయణ్ దత్ తివారీ, ఉమాశంకర్ దీక్షిత్, జీకే మూపనార్, గులాంనబీ ఆజాద్ వంటి దూతలు హైదరాబాద్ రావడం పీవీ చూశారు. వారిని ఎవరెవరు ఎప్పుడు ఎట్లా కలుసుకుంటారో, ఏమేమి మాట్లాడతారో ఆయనకు తెలుసు. పీసీసీ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రిని కానీ మార్చాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నప్పుడు అసమ్మతికి చెవి వొగ్గుతుంది. దూతలను పంపుతుంది. బ్రహ్మానందరెడ్డి, పీవీ, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కరరెడ్డి వంటి ముఖ్యమంత్రులంతా ఆ విధంగా పదవి నుంచి తప్పుకున్నవారే. దిల్లీ నుంచి వచ్చిన దూత ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పడు. అంటీముట్టనట్టు మాట్లాడతాడు. అందరు చెప్పిందీ నోట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తాడు. పార్టీ అధ్యక్షురాలికీ లేదా అధ్యక్షుడికి విన్నవిస్తానంటాడు. తన సొంత కవిత్వం ఎట్లాగూ కలుపుతాడని తెలిసిన ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రిని దింపడానికి ప్రయత్నిస్తున్న అసమ్మతివర్గం అతగాడిని సంతోషపెట్టడానికి చేయకూడని పనులు చేస్తుంది. వాటిలో ఒకటి దూత దిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు లేని బ్రీఫ్ కేసు దిల్లీ వెళ్ళే ముందు ఆయనకు ముఖ్యమంత్రి మనిషి అప్పగించడం. ఏమీ తెలియనట్టూ, దిల్లీ నుంచి తీసుకొని వచ్చిన బ్రీఫ్ కేస్ నే తాను గెస్ట్ హౌస్ నుంచి ఎయిర్ పోర్ట్ కి తీసుకొని రావడం మరచిపోయినట్టూ, అది గమనించి ఒక పార్టీ కార్యకర్త ఆ బ్రీఫ్ కేస్  ను విమానంలో తన సీటు దగ్గర పెట్టినట్టూ నటిస్తారు. ఇందులో అందరూ నటులే.

అతిథి

అతిథి (ద గెస్ట్) అనే శీర్షికతో మరో కథ రాశారు పీవీ. ఈ కథలు పీవీ శతజయంతి సందర్భంగా శతజయంతి ఉత్సవ కమిటీ ప్రచురించిన కథల పుస్తకంలో ఉన్నాయి. తెలుగులో రాశారో, ఇంగ్లీషులో రాశారో తెలియదు. తెలుగులో రాస్తే ఇంగ్లీషులోని పివి మనుమరాలు (ప్రభాకరరావు కుమార్తె) తర్జుమా చేశారు. ఇది ఒక సాధారణ పౌరుడు దక్షిణ్ ఎక్సెప్రెస్ ఎక్కి దిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిగా ఎదిగిన తన బాల్యమిత్రుడిని కలుసుకొని చిన్న పని చేయించుకోవడానికి చేసిన ప్రయత్నం. దిల్లీకి బయలుదేరే ముందు ఎందుకైనా మంచిదని తన మిత్రుడికి ఫోన్ చేస్తాడు సాధారణ పౌరుడు. ‘రావయ్యా పెద్దమనిషీ.రారా. దిల్లీకి స్వాగతం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి సమస్యా లేదు. నేరుగా మన ఇంటికే వచ్చేయ్,’ అంటాడు మంత్రి.

తీరా సాధారణ పౌరుడు మంత్రిగారి ఇంటికి వెళ్ళే సరికి మోతీలాల్ అనే గెస్ట్ తో ఉంటాడు. గెస్టె పై నుంచి దృష్టి మరల్చకుండానే ‘రారా’ అంటూ లోపలికి పిలిచి తర్వాత మళ్ళీ పట్టించుకోడు. అతిథిని మెప్పించడానికి అతడు కోరినవీ, కోరనివీ కూడా అనేక పనులు మంత్రి చేస్తున్నాడు. అతిథి వెళ్ళిపోయిన తర్వాత మంత్రితో తాను వచ్చిన పని చెప్పాడు. వెంటనే పని చేసిపెడతానని మంత్రి వాగ్దానం చేశాడు. మళ్ళీ మంత్రిని పట్టుకోవడానికి మన సామాన్యుడికి వారం రోజులు పట్టింది. అందుకు సంబంధించినవారితో అప్పటికే మాట్లాడానని మంత్రి బొంకుతాడు. తన బాల్యమిత్రుడు తన పని చేయడం లేదని అర్థం చేసుకున్నాడు సామాన్యుడు. ఈ సారి మంత్రిని కలవకుండా దిల్లీ వెళ్ళి తన పని చేయవలసిన అధికారిని కలుసుకొని, డిన్నర్ కి ఆహ్వానించి, మందుపార్టీ ఇస్తాడు. అధికారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన సామాన్యుడిని వెంటనే ప్రవేశపెడతారు. గదిలోకి వెళ్ళి అధికారికి ఎదురుగా కూర్చున్న తర్వాత కాలింగ్ బెల్ నొక్కుతాడు అధికారి. వెంటనే గదిలోకి  ప్రవేశించిన ప్యూన్ యూనిఫాంలో ఉన్న వ్యక్తిని చూసి మన సామాన్యుడు ఖంగు తింటాడు. అతడే మోతీలాల్. దిల్లీ రాజకీయ సంస్కృతి గురించీ, ఇతర కార్యాయలయాలలో పని చేస్తున్న అటెండర్లను పట్టుకొని పనులు చేయించుకోవడానికి మంత్రి స్థాయిలో ఉన్నవారు ఎట్లా తాపత్రయపడతారో చెప్పే కథ ఇది. పీవీ ముఖ్యమంత్రిగా గద్దె దిగిన తర్వాత దిల్లీకి పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1973లో వెళ్ళారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చుట్టపు చూపుగా రావడమే కానీ దిల్లీలోని తుది శ్వాసవరకూ మకాం ఉన్నారు. దిల్లీ రాజకీయ సంస్కృతిని కాచి వడబోశారు.

ద మినిస్టర్  

‘ద మినిస్టర్’ అనేది ఒక మంత్రి కథ. ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రి ఎట్లా ప్రవర్తిస్తున్నాడో, సొంతంగా ఆలోచించకుండా యాంత్రికంగా ఎట్లా వ్యవహరిస్తున్నాడో చూపించే కథ ఇది. అధికార పార్టీలో ముఠాలు ఉంటాయి. ప్రతి ముఠాకు ఒక నాయకుడూ, అనేకమంది ఉపనాయకులూ ఉంటారు. ప్రతి గ్రామంలో ఆ గ్రూపు ఉంటుంది. నాయకుడు ఉంటాడు. తన నాయకత్వం చెల్లుబాటు కావాలంటే తన గ్రామంలో తనను నమ్ముకున్నవారికి పనులు చేసి పెట్టడం ఒక్కటే మార్గం. అందుకని పని కట్టుకొని హైదరాబాద్ వచ్చి మంత్రులను కలుసుకొని ఫలానా ఉద్యోగం కావాలనీ, ఫలానా కాలేజీలో సీటు కావాలనీ అడుగుతారు. ఆ ఉద్యోగానికి సరిపడ అర్హత మీరు తెచ్చిన అభ్యర్థికి లేదన్నా, మీరు సిఫారసు చేస్తున్న విద్యార్థికి ఆ కళాశాలలో చేరడానికి అవసరమైక కనీస మార్కులు కూడా రాలేదన్నాపైరవీకారు ఒప్పుకోడు. అర్హతలూ, మార్కులూ ఉంటే మీ దగ్గరికి రావసిన పనేముంది? వారే సంపాదించుకునేవారు కదా? అర్హత లేదు కాబట్టే మీరు సిఫార్సు చేయాలంటూ వాదిస్తాడు. ఈ పనులు చేయకపోతే పార్టీ బలహీనపడుతుందని బెదిరిస్తారు. ఇట్లా పైరవీకారులతో మంత్రి సతమతం అవడం గమనించిన బాల్య మిత్రడు మంత్రిని ‘ఇట్లాగయితే నీకు ఆలోచించుకోవడానికి సమయం ఎప్పుడు కుదురుతుంది?’ అని అడుగుతాడు. ‘నేను ఆలోచిస్తానని నీకు ఎవరు చెప్పారు?’ అని మంత్రి ఎదురు ప్రశ్న వేయడంతో, మిత్రుడు తెల్లమొహం వేయడంతో కథ ముగుస్తుంది.

మంత్రిమండలి విస్తరణ

మంత్రివర్గ లేక మంత్రిమండలి విస్తరణ అనేది చాలా ఆసక్తికరమైన అంశం. దీనిపైన పీవీ ఒక కథ రాశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లోవదంతులు పుడతాయి. వ్యాప్తి చెందుతాయి. పీవీ నాలుగు పాత్రలను సృష్టిస్తారు. ఉత్తరాది నుంచి ఒకరు, పశ్చిమభారతం నుంచి మరొకరు, తూర్పు బారత్ నుంచి వేరొకరు, దక్షిణ భారతం నుంచి ఇంకొకరూ. డాక్టర్ చింతాద్రిపేటపాడు వీర వెంకట లక్ష్మీ ప్రసన్న సోమయాజులు అనే తెలుగు నాయకుడి పేరు నోరు తిరగదని డాక్టర్ చిల్లు అని పిలుస్తారు. తక్కినవారికి ఆయ ప్రాంతాలలో ఉండే పేర్లు పెట్టారు. ఒకరికి మంత్రిమండలి నుంచి ఉద్వాసన చెప్పడానికీ, మరొకరిని మంత్రిమండలిలోకి తీసుకోవడానికి ఉండవలసిన అర్హతలేమిటో పీవీ ఈ కథలో చర్చిస్తారు. మంత్రి కావాలన్నకోరిక బలంగా ఉన్న పార్లమెంటు సభ్యుడు తమ రాష్ట్రం నుంచి మంత్రిమండలిలో ఉన్న వ్యక్తిని దించి తాను ఆ స్థానం ఆక్రమించుకోవాలంటే చాలా కష్టబడాలి. పైగా మంత్రి తన కులానికి చెందినవాడైతే మరింత కష్టం. ఉన్నమంత్రికి ఉద్వాసన చెప్పించాలంటే అతనిపైన దుష్ప్రచారం జరగాలి. మంత్రి కావాలని కోరుకున్నవారే ఆ పని చేయాలి. దొరక్కుండా చేయాలి. అతి జాగ్రత్తగా, అతి సమర్థంగా, అతి గోప్యంగా జరగాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక సీనియర్ జర్నలిస్టును పట్టుకొని వార్తాకథనం రాయించాలి. అందుకు ప్రతిఫలం ముట్టజెప్పాలి. ఈ వ్యవహారం అంతా ఎట్లా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చెబుతారు పీవీ.

ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్

‘ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్’ కథ శాసనమండలికి రెండేళ్ళకు ఒక సారి జరిగే ఎన్నికల గురించి. నలుగురు – సోమేశ్వర్, బిహారీ, రతన్ లాల్, చౌధురి – ఒక్క సీటు కోసం పోటీ పడతారు. వారి వ్యూహాలనూ, ఎత్తులనూ, జిత్తులకూ, బేరసారాలనూ వివరిస్తారు. మరో అభ్యర్థి రాంగోపాల్. అతడు నిరుపేద. వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి. అదే విధంగా పేదరికంలో ఉన్న మరి ఇద్దరు అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం విడుదల చేసిన అభ్యర్థుల జాబితా పట్ల నిరాశ వెలిబుచ్చుతూ స్థానిక దినపత్రిక ప్రచురించిన సంపాదకీయాన్ని పీవీ ప్రస్తావిస్తారు. పార్టీ చెప్పే నీతులకు పూర్తి విరుద్ధంగా అభ్యర్థులు ఉన్నారని సంపాదకీయం తెగనాడుతుంది. జాబితాలో మార్పులు చేయాలని వేలమంది పార్టీ అధిష్థానానికి టెలిగ్రాంలు పంపించారు. అన్ని టెలిగ్రాంల ఖర్చునూ ఒకే నాయకుడు భరించినట్టు భోగట్టా. జాబితాకు నిరసనగా ధర్నాలు, నిరశన దీక్షలు జరిగాయి. సంపన్నులైన నలుగురు అభ్యర్థులూ తమ క్యాంపులు పెట్టుకున్నారు. రంగంలో ఉన్న మొత్తం ఏడుగురు అభ్యర్థులలో అత్యంత దుర్బలమైనవాడు రాంగోపాల్. శాసనసభ్యులు నివసించే ప్రాంతంలో సందడే సందడి.  అంతా ఒక నైట్ క్లబ్ లాగా, అక్కడ రాజకీయ వస్త్రాలను వదిలివేసే వినోదం జరుగుతున్నట్టు కనిపించింది. అన్ని మర్యాదలూ మంటగలిశాయి. ప్రతినాయకుడూ పుట్టినప్పుడు కట్టిన బట్టలతో ఉన్నాడు. తమకు కేటాయించిన ఓటర్లు మాయమైపోవడంతో పేద అభ్యర్థులు హతాశులైనారు. కథ చివరిలో రాంగోపాల్ గెలుపొందినట్టు ప్రకటిస్తారు. ఈ ఫలితం వినగానే రాంగోపాల్ కళ్ళు తిరిగి నాలుకు బయటకు పెట్టి కిందపడి మూర్ఛపోతాడు.

ఈ విధంగా రాజకీయ ఇతివృత్తం కలిగిన కథలను పీవీ అద్భుతంగా రాశారు. ఈ కథలు చదివినవారికి పీవీ బలమైన పరిశీలనాశక్తి, అద్భుతమైన అభివ్యక్తి, కథాకథన శిల్పచాతుర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆయన కథకుడుగా అగ్రగణ్యుడు.

(జూన్ 28 పీవీ శతజయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles