వస్తావా నేస్తం, నాతో వస్తావా, శిఖరాగ్రం వరకు,
ఆ పైకి, పైపైకి, నువ్వూహించనంత దూరం
ఆకాశాన్ని చీల్చుకొంటూ, మబ్బులను త్రుంచుకుంటూ,
మెరుపులపై నడుచుకుంటూ,
సూరీడిని, చంద్రుడిని దాటుకొంటూ
నక్షత్రాలను రాసుకొంటూ, తెలియని శూన్యం వైపుకు,
వస్తావా నేస్తం, నాతో వస్తావా?
నీ ఇష్టం…
తామసాన్ని విదిలించి కొట్టి,
తారతమ్యాలను నెలపైనే వదలి పెట్టి…
నీవు రాగలిగితే, అదే మన అంతిమ ప్రయాణం,
మన మహా ప్రస్థానం!
అడుగులు తడబడ నివ్వకు,
అటూ ఇటూ దిక్కులు చూడకు,
దారిపొడగునా నిన్నాకర్షించే అందాలు,
తప్పుకు పురికొల్పే విచ్చు కత్తులు వుచ్చులు
చిత్తానికి భ్రమగొల్పే, చిత్ర విచిత్ర విషయీ వాసనలు,
నోర్లు తెరుచుకొని అవురావురు మని ఆకలిగా వేచివున్న
విషనాగులతో అల్లిన ఆరు వలలు…
తప్పు చేయకు తమ్ముడు,
తప్పనివ్వకు నీ దృఢమైన అడుగు!
అదిగో అటు చూడు, నలిగిన బాట,
విరిగిపడిఉన్న చీకటి గోడలు,
చెదరిన ప్రాపంచిక మంచు తెరలు
అవిగో, అవిగో…
మనముందు ఎందరో నడచినట్లు
పరమ పవిత్ర పాదాల ముద్రలు,
ఇక భయం లేదు…
ఆగక, అడుగులు వేయి నేస్తమా
అదిగో విశ్వాన్తరాళం అవతల
మనకోసం ఎదురు చూస్తున్న,
నిశ్శబ్ద, నితాంత ప్రశాంత నిర్మల
సహస్ర ప్రణవ నేత్రాలు…
నువ్వింతసేపూ పయనించింది
పాదాలతో అనుకొనేవు సుమా…
నిన్ను నడిపించింది నీ నమ్మకం.
Also read: దాచుకున్న దుఃఖం
Also read: నమ్మకం
Also read: గొర్రె
Also read: యుద్ధము… శాంతి
Also read: ఎరుపు-తెలుపు