‘రాయిపాలెం’ ఒక కొండదొర ఆదివాసీల శివారు గ్రామం. 30 నుండి 35 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. ఇది అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల మండలం, శంకరం పంచాయితీలో వుంది. సరిగ్గ తూర్పు కనుమలకు చెందిన అడవులతో నిండిన కొండల దాపున ఈ గ్రామం వుంది. గ్రామానికి ఆనుకొని, మూడు వైపుల ముగ్గురు బాహుబలుల్లా ఆ కొండలు. రాయిపాలెం లోతట్టులో వుంటుంది. పని గట్టుకొని వెళ్తే తప్ప ఆ గ్రామ ఎవరికీ కనిపించదు. నిన్న, మొన్నటి వరకు అక్కడ కాలిబాటలే ‘రహదారులు’. కాని గత 10 ఏళ్లుగా అక్కడి దృశ్యo త్వరత్వరగా మారిపోతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్దిక, రాజకీయాలను శాస్తున్న ఒక సామాజిక వర్గంకు చెందిన కొందరు పెట్టుబడిదారులు ఈ లోపలికి చొరబడ్డారు. దాoతో అసలు శిసలు “రహదారులు” పరుగులు పెట్టుకుంటూ వచ్చాయి (అవన్నీ ఆదివసీల కోసం అంటూ కేటాయించిబడిన సప్లయన్ నిధులతో వేసినవి సుమా!).
కధ షరా మామూలే. రాయిపాలెం లోపలికి చొచ్చుకు వచ్చిన ఈ శీఘ్ర సంపన్నులు, రాయిపాలెం గ్రామాన్ని ఆనుకొని వున్న భూమి కూడా ‘మాదే’ అని ‘ఆదివాసీలు ఖాళీ చేయాలని’ వారిపై ఒత్తిడి మొదలయ్యింది. వారి వద్ద అన్ని కాగితాలు వున్నాయట. పాపం ఈ వెర్రి మొర్రి ఆదివాసీల వద్ద ఒక్క కాగితం ముక్కకూడా లేదట. అందుచేత, తృణమో, ఫణమో, పుష్పమో, తోయమో లేదా గాంధి బొమ్మ వున్న పచ్చ కాగితమో ఇస్తారట. అవి పుచ్చుకొని గప్ చుప్ గా వెళ్ళిపోవాలట… లేదంటే … ఆబోరు దక్కదట. రాయిపాలెం గ్రామ పెద్దల ఆహన్వంపై ఆ ఊరికి వెళ్ళాను.
రాయిపాలెం వెళ్లి ఒక రాత్రి అక్కడ వుండిపోయి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భూములన్ని కలయతిరిగి వచ్చాను. నన్ను చేతి కర్రలా ఈ యువకుడు అనుసరించాడు. ఈ అబ్బాయి తండ్రి చిన్నారావు.
2002లో నేను పాదయాత్ర చేసుకుంటూ కొండల వారంట నడుచుకుంటూ రాయిపాలెం వచ్చాను (ఆ వివరాలు నేను మర్చిపోయాను గాని చిన్నారావు గుర్తు చేసాడు). అప్పుడు నెలల పిల్ల వాడిగా వున్న వీడిని ఎత్తుకొని వూరoత తిరిగాను. ఇప్పుడు నాకు తోడుగా తన తాతతండ్రుల భూములని తిప్పి చూపించాడు.