———- ————–
(‘THE THREE GIFTS ‘ FROM ‘THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
అనువాదము : డా. సి. బి. చంద్ర మోహన్
14. సంచారి తత్త్వాలు
————————————
ఒకానొకప్పుడు బచారే నగరంలో ఒక దయగల రాజు ఉండేవాడు. అతనంటే ప్రజలందరికీ ప్రేమ, గౌరవమూనూ!
ఆ నగరంలో ఒక నిరుపేదకు మాత్రం రాజంటే పడేది కాదు. అతడు అస్తమానమూ రాజుని తెగుడుతూ నోరు పారేసుకునేవాడు. రాజుకా విషయం తెలిసినా గాని సహనంగా ఉన్నాడు.
చివరిగా రాజు అతని గురించి ఆలోచించాడు. ఒక శీతాకాలం రాత్రి రాజు గారి సేవకుడు మూడు కానుకలు పట్టుకొని ఆ నిరుపేద ఇంటికి వచ్చాడు. అవి ఏమిటంటే –
1.ఒక సంచి గోధుమ పిండి
2. ఒక సంచి సబ్బులు
3.ఒక చక్కెర సంచి.
” రాజు గారు వారి గుర్తుగా ఈ బహుమతులు నీకు పంపారు.” అని ఆ పేద మనిషితో సేవకుడు చెప్పాడు.
అతని పట్ల మర్యాదతో రాజు ఆ బహుమతులు పంపాడని తలచి పేద మనిషి పొంగిపోయాడు. అప్పుడు అతను బిషప్ దగ్గరకు గర్వంగా వెళ్లి ఇట్లా అన్నాడు ” నా సద్భావన రాజు కోరుకుంటున్నాడని నీకు అర్ధమవుతోందా ?”
బిషప్ ఆ పేద మనిషితో ఇట్లా అన్నాడు ” రాజు ఎంత తెలివైన వాడు ! నీకేమర్ధమయ్యింది ? ఆయన (రాజు) ఆ వస్తువుల ద్వారా నీకు సంకేతాలు ఇచ్చాడు. నీ ఆకలి తీర్చడానికి గోధుమ పిండి, నీ పరిశుభ్రత కోసం సబ్బులు, నీ వాక్కులో కాఠిన్యం తగ్గించడానికి చక్కెర పంపాడు.”
ఆ రోజు నుండి ఆ పేద మనిషి తనను చూసి తానే సిగ్గు పడసాగాడు. రాజు పట్ల ద్వేషం మునుపటి కంటే ఎక్కువైంది. రాజు ఆలోచన గురించి వివరించిన బిషప్ ను రాజు కంటే ఎక్కువ ద్వేషించ సాగాడు.
కాని , ఆ తరువాత అతను మౌనం దాల్చాడు.