- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్పష్టత
- కొత్త ఎస్ఈసీపై సర్వత్రా ఉత్కంఠ
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఏపీలో పెండింగులో ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలన్న పిటీషన్లపై ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది.
Also Read: ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు చిక్కులు:
ఏపీలో పెండింగులో ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ హయాంలో జరపాలని భావించిన వైసీపీ సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు తీర్పుతో విఘాతం కలిగింది. గతంలో ఆగిన చోటనుంచే ఎన్నికలను నిర్వహించాలని అధికార పార్టీ అంటుండగా, మళ్లీ నామినేషన్ల ప్రక్రియ నుంచి మొదలు పెట్టాలని విపక్షాలు వాదిస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ సెలవుపై వెళుతుండటంతో అధికార పార్టీ పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటీషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని, కమిషనరే తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుందని, దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 30 కి వాయిదా వేయడం 31న నిమ్మగడ్డ రిటైరవ్వనుండటంతో కొత్త ఎస్ఈసీ నియామకం తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
కొత్త ఎస్ఈసీపై జోరుగా సాగుతున్న చర్చ:
మరోవైపు ఈ నెల 31తో ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీకాలం ముగియనుండటంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. కొత్త ఎస్ఈసీ గా బాధ్యతలు చేపట్టిన వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఏపీలో కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం