————————-
(‘OLD OLD WINE’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
29. సంచారి తత్త్వాలు
—————————
ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు తన భూగర్భ గది గురించి, దానిలో ఉన్న పాత ద్రాక్ష సారా గురించి చాలా గర్వ పడేవాడు. అక్కడ ఒక కూజాలో అతి ప్రాచీనమైన ద్రాక్ష సారా ఉండేది. అది ఒక మంచి సందర్భం కోసం దాచి పెట్టాడు. ఆ విషయం అతనికి మాత్రమే తెలుసు.
ఆ రాజ్యం గవర్నరు ఒకసారి ఆ ధనికుడ్ని సందర్శించాడు. అప్పుడా ధనికుడు మనసులో ” ఆ పాత సారా కూజా కేవలం గవర్నరు కోసం తెరవలేను” అనుకున్నాడు.
ఆ ప్రాంతపు బిషప్ అతన్ని ఒకసారి సందర్శించాడు. అతడు తనలో తాను ” లేదు! నేను ఆ కూజాను బిషప్ కోసం తెరవలేను. అతనికి దాని విలువ తెలియదు. ఆ సారా సువాసన అతడి ముక్కు పుటాలకు కూడా చేరదు.” అనుకున్నాడు.
ఒకసారి ఆ రాజ్యం యొక్క యువరాజు వచ్చి, రాత్రి భోజనం చేసాడు. అప్పుడు కూడా ధనికుడిట్లా అనుకున్నాడు. ” కేవలం ఒక్క యువరాజు కోసం ఇంత విలువైన సారా వృధా చేయలేను.”
చివరకు అతని స్వంత మేనల్లుడు వివాహం చేసుకున్నప్పుడు కూడా అతడు మనసులో ఇలా అనుకున్నాడు ” లేదు! ఈ అతిధుల కోసం ఆ విలువైన సారా ఖర్చు పెట్టలేను.”
ఏళ్ళు గడిచాయి. ఆ ధనవంతుడు వార్ధక్యంతో చనిపోయాడు. అతనిని ఖననం చేసారు.
అతనిని ఖననం చేసిన రోజునే మిగిలిన సారా కూజాలతో పాటు, ఆ విలువైన, అత్యంత పురాతన మైన కూజా కూడా తీసుకు రాబడింది. ఇరుగు పొరుగు రైతులు దానిని పంచుకున్నారు. ఎవరికీ – ఆ కూజా ఎంత ప్రాచీనమైనదో తెలీదు.
వారి దృష్టిలో, కప్పులలో పోయబడిందంతా సారా కిందే లెక్క.
Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన
Also read: భోజనం, పానీయం
Also read: సన్యాసి ప్రవక్త
Also read: బంగారు బెల్టు
Also read: దాతృత్వం